కింగ్స్ పంజాబ్(ఫోటో కర్టసీ: ట్వీటర్)
అబుదాబి: ఈ సీజన్‌లో భారీ స్కోర్లు చేస్తూ ఫీల్డింగ్‌లో అదరగొడుతున్న కింగ్స్ పంజాబ్ కొన్ని తప్పిదాలతోనే మ్యాచ్‌లను చేజార్చుకుంటుంది.రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ లైన్ తప్పడంతో ఓటమి పాలైన కింగ్స్ పంజాబ్.. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కూడా ఇదే తప్పిదంతో పరాజయం పాలైంది. షమీ, కాట్రెల్ వంటి మంచి పేసర్లు ఉన్నా చివరి ఆరు ఓవర్లలో వందకు పైగా పరుగులు ఇవ్వడమే ముంబై ఇండియన్స్‌పై ఓటమి కారణం. 14 ఓవర్లు ముగిసే సరికి ముంబై మూడు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసిన తరుణంలో మిగతా ఆరు ఓవర్లలో కింగ్స్ పంజాబ్ భారీగా పరుగులు సమర్పించుకుంది. 14 నుంచి 20 ఓవర్ల మధ్యలో షమీ వేసిన 17వ ఓవర్‌లో ఐదు పరుగులు మినహా మిగతా అంతా ముంబైదే పైచేయిగా నిలిచింది.(చదవండి: ఉల్లంఘిస్తే రూ. కోటి చెల్లించాల్సిందే: బీసీసీఐ)
15వ ఓవర్‌లో రవి బిష్నోయ్ రెండు సిక్స్‌లతో మొత్తంగా 15 పరుగులు సమర్పించుకోగా, నీషమ్ వేసిన 16వ ఓవర్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఇచ్చి 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక 17వ ఓవర్‌లో రోహిత్ శర్మను షమీ ఔట్ చేయడంతో ఆ ఓవర్‌లో పరుగుల వేగం తగ్గింది. అటు తర్వాత పొలార్డ్‌కు హార్దిక్‌కు జత కలవడంతో స్కోరు బోర్డు వేగంగా పరుగులు పెట్టింది. నీషమ్ వేసిన 18 ఓవర్‌లో హార్దిక్ సిక్స్, రెండు ఫోర్లు కొట్టడంతో ఆ ఓవర్‌లో 18 పరుగులు వచ్చాయి. ఇక షమీ వేసిన 19 ఓవర్‌లో హార్దిక్-పొలార్డ్‌లు 19 పరుగులు పిండుకున్నారు. హార్దిక్ ఒక ఫోర్ సాయంతో ఐదు పరుగులు చేయగా, పొలార్డ్ హ్యాట్రిక్ ఫోర్లతో దుమ్ములేపాడు. ఇక గౌతమ్ వేసిన చివరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా ఒక సిక్స్ కొట్టగా, పొలార్డ్ హ్యాట్రిక్ సిక్స్‌లతో చెలరేగిపోయాడు. దాంతో ఆ ఓవర్‌లో 25 విలువైన పరుగులు ముంబై స్కోరులో కలిశాయి. దాంతో ముంబై 191 పరుగుల్ని బోర్డుపై ఉంచకల్గింది. చివరి పది ఓవర్లలో 129 పరుగుల్ని కింగ్స్ పంజాబ్ సమర్పించుకోవడమే ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణం.
చివరి ఓవర్ స్పిన్నర్‌కు..
కాట్రెల్ మంచి పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. కానీ అతనికి స్లాగ్ ఓవర్‌లు అవకాశం లేకుండానే 13 ఓవర్లు ముగిసే సరికి అతని నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేశాడు కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన కాట్రెల్ ఒక మెయిడిన్ సాయంతో 20 పరుగులిచ్చి వికెట్ తీశాడు. కానీ అతని ఓవర్లు ముందుగానే ముగిసిపోవడంతో పేస్ బౌలింగ్ లేమి కనబడింది. 20 ఓవర్‌ను ఆఫ్ స్పిన్నర్ గౌతమ్‌కు ఇవ్వడంతో ముంబై స్కోరును పెంచుకోవడానికి వీలు దొరికింది. స్పిన్నర్లను బాగా ఆడే హార్దిక్-పొలార్డ్‌లు ఉండగా గౌతమ్‌కు ఆఖరి ఓవర్‌ను ఇవ్వడం కింగ్స్ పంజాబ్ కొంపముంచింది. ఏకంగా 25 పరుగులు ఇవ్వడంతో కింగ్స్ పంజాబ్‌ను ఆందోళన గురిచేసింది. ముంబై వంటి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ జట్టుకు బౌలింగ్ వేసేటప్పుడు బౌలింగ్ అనేది చాలా కీలకం. అటువంటిది చివరి ఓవర్ స్పిన్నర్‌కు ఇవ్వడం కింగ్స్ పంజాబ్ చేసిన తప్పిదం. ఆదిలో ముంబైను కట్టడి చేసి, చివరి ఓవర్లలో పరుగులు ఇవ్వడం కింగ్స్ పంజాబ్‌కు బౌలింగ్ లేమిని చూపెట్టింది. (చదవండి: కింగ్స్ పంజాబ్‌పై ముంబైదే పైచేయి)
ఓపెనర్లు మినహా ఎవరూ లేరు..
ఈ సీజన్‌లో కింగ్స్ పంజాబ్ భారీ స్కోర్లు చేసిందంటే అది ఓపెనర్ల చలవే. మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌తోనే కింగ్స్ పంజాబ్ పటిష్టంగా కనిపించింది. తాజా మ్యాచ్‌లో ఓపెనర్లు మయాంక్(25), కేఎల్ రాహుల్(17)లు విఫలం కావడంతో కింగ్స్ పంజాబ్ తేలిపోయింది. మ్యాక్స్‌వెల్, కరుణ్ నాయర్‌లు దారుణంగా విఫలం కావడం కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతోంది. నికోలస్ పూరన్ మాదిరిగా రాణిస్తున్నా టాపార్డర్‌లో ఓపెనర్లు విఫలమైతే మాత్రం పంజాబ్ బ్యాటింగ్ గాడి తప్పుతోంది. ఈరోజు ముంబై ఇండియన్స్‌తో ఇదే జరిగింది. రాహుల్, మయాంక్‌లు ఔటైన తర్వాత నాయర్ డకౌట్‌గా పెవిలియన్ చేరితే, మ్యాక్స్‌వెల్ 11 పరుగులే చేశాడు. పూరన్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44 పరుగులు చేసినా లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. దాంతో కింగ్స్ పంజాబ్ గెలుపును అందుకోలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment