కేకేఆర్‌ అదరహో.. | KKR Beat Rajasthan By 37 Runs | Sakshi
Sakshi News home page

కేకేఆర్‌ అదరహో..

Published Wed, Sep 30 2020 11:23 PM | Last Updated on Wed, Sep 30 2020 11:32 PM

KKR Beat Rajasthan By 37 Runs - Sakshi

దుబాయ్‌:  రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అదరగొట్టింది. బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించి పోరాడే స్కోరును బోర్డుపై ఉంచిన కేకేఆర్‌.. ఆపై బౌలింగ్‌లో ఇరగదీసింది. బ్యాటింగ్‌ లైనప్‌లో పటిష్టంగా ఉన్న రాజస్తాన్‌ను 137 పరుగులకే కట్టడి చేసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.  కేకేఆర్‌ బౌలర్లలో శివం మావి, నాగర్‌కోటి, ప్యాట్‌ కమిన్స్‌,  వరుణ్‌ చక్రవర్తిలు రాణించి జట్టుకు మంచి విజయాన్ని అందించారు. మావి, నాగర్‌కోటి, వరుణ్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, కమిన్స్‌, కుల్దీప్‌ యాదవ్‌, సునీల్‌ నరైన్‌లు తలో వికెట్‌ తీశారు. రాజస్తాన్‌ ఆటగాళ్లలో టామ్‌ కరాన్‌( 54 నాటౌట్‌; 36 బంతుల్లో  2 ఫోర్లు,  3 సిక్స్‌లు)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇక రాజస్తాన్‌ ఆటగాళ్లలో ఎనిమిది మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో ఘోర ఓటమి తప్పలేదు.  ఇది కోల్‌కతాకు రెండో విజయం కాగా, రాజస్తాన్‌కు తొలి ఓటమి.(చదవండి: ఐపీఎల్ 2020:‌ అయ్యర్‌కు భారీ జరిమానా)

కేకేఆర్‌ నిర్దేశించిన 175 పరుగుల టార్గెట్‌లో రాజస్తాన్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్‌ స్టీవ్‌ స్మిత్‌(3) పరుగులకే ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కేకేఆర్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ అద్భుతమైన క్యాచ్‌తో స్మిత్‌ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం సంజూ శాంసన్‌(8) కూడా నిరాశపరిచాడు. ఆపై జోస్‌ బట్టర్‌(21), రాబిన్‌ ఊతప్ప(2)లు స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో రాజస్తాన్‌ కష్టాల్లో పడింది. రియాన్‌ పరాగ్‌(1), రాహుల్‌ తెవాటియా(14)లు ఆకట్టులేకపోవడంతో రాజస్తాన్‌ 66 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోవడంతో తేరుకోలేకపోయింది. ఇక జోఫ్రా ఆర్చర్‌ వచ్చీ రావడంతోనే ఒక సిక్స్‌ కొట్టినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. వరుణ్‌ చక‍్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌ కొట్టే ప్రయత్నంలో నాగర్‌కోటి అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో ఆర‍్చర్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. కాగా, టామ్‌ కరాన్‌ చివరి వరకూ క్రీజ్‌లో ఉండి మెరుపులు మెరిపించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఓటమి తప్పలేదు.

అంతకుముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌ ఎక్కువగా మెరుపులు లేకుండానే కొనసాగింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి  కోల్‌కతా ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.ఓపెనర్‌ గిల్‌ మరోసారి సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. చివర్లో మోర్గాన్‌ మెరుపులతో కేకేఆర్‌ 170 పరుగుల మార్కును దాటింది. కాగా 34 బంతుల్లో 47 పరుగులు చేసిన గిల్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. హాఫ్‌ సెంచరీకి చేరువైన గిల్‌ను జోఫ్రా ఆర్చర్(6)‌ బోల్తా కొట్టించాడు. పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు ఒక వికెట్‌ నష్టానికి 42 పరుగులు చేసింది. పవర్‌ప్లే ముగిసిన తర్వాత గిల్‌, రాణాలు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే తెవాటియా వేసిన 10 ఓవర్‌లో చివరి బంతికి భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన నితీష్‌ రాణా క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఆండ్రీ రసెల్‌ 3 సిక్సర్లు కొట్టి 14 బంతుల్లో 22 పరుగులు చేసినా దానిని బారీ స్కోరుగా మలచలేకపోయాడు. తర్వాత వచ్చిన కెప్టెన్‌ దినేష్‌ కార్తీక్‌ అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. చివర్లో ఇయాన్‌ మోర్గాన్‌(34 నాటౌట్‌; 23 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) రాణించాడు. ఇక కమిన్స్‌(12; 10 బంతుల్లో 1 ఫోర్‌), నాగర్‌కోటి(8 నాటౌట్‌; 5 బంతుల్లో 1 ఫోర్‌) ఫర్వాలేదనిపించడంతో కేకేఆర్‌ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. రాజస్తాన్‌ బౌలర్లలో ఆర‍్చర్‌ రెండు వికెట్లు సాధించగా, రాజ్‌పుత్‌, ఉనాద్కత్‌, టామ్‌ కరాన్‌, రాహుల్‌ తెవాటియాలకు తలో వికెట్‌ దక్కింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement