
క్వాలిఫయర్–1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘనవిజయం
నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ పోరుకు అర్హత
160 పరుగుల లక్ష్యాన్ని 13.4 ఓవర్లలోనే ఛేదించిన కోల్‌కతా నైట్‌రైడర్స్
బంతితో హడలెత్తించిన స్టార్క్
దంచేసిన వెంకటేశ్, శ్రేయస్ అయ్యర్
ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్–2లో తలపడనున్న సన్‌రైజర్స్
ఈ సీజన్‌లో 7 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగుసార్లు 200 పైచిలుకు స్కోర్లను అవలీలగా చేసింది. ఎనిమిదోసారి మాత్రం ‘సన్’ బృందం రైజింగ్ కాలేదు. కీలకమైన ప్లే ఆఫ్స్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ పూర్తి ఓవర్లు ఆడకుండానే 159 పరుగులకే కుప్పకూలింది.
రెండో క్వాలిఫయర్ ఉందన్న ధీమానో లేదంటే ఓడినా పోయేదేం లేదన్న అలసత్వమో గానీ హైదరాబాద్ బ్యాటర్లు పేలవ ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సులువుగా ఫైనల్ దారి చూపారు. ఆద్యంతం పక్కా ప్రణాళికతో ఆడిన కోల్‌కతా ముందుగా బంతితో సన్‌రైజర్స్‌ను కట్టడి చేసి... ఆ తర్వాత బ్యాట్‌తో మెరిపించి 160 పరుగుల లక్ష్యాన్ని 13.4 ఓవర్లలోనే ఛేదించేసి దర్జాగా నాలుగోసారి ఐపీఎల్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది.
అహ్మదాబాద్: ‘ప్లే ఆఫ్స్’ దశ వరకు తగిన ప్రదర్శన చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఇంకో అవకాశం కోసం ఎదురుచూడకుండా ఐపీఎల్ 17వ సీజన్‌లో నేరుగా ఫైనల్‌కు అర్హత సంపాదించింది. మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించింది. లీగ్ దశలో భీకరమైన ఫామ్ కనబరిచిన సన్‌రైజర్స్ మాత్రం కీలకమైన దశలో నిర్లక్ష్యంగా ఆడి ఓడింది.
ఫైనల్ బెర్త్ కోసం ఆ జట్టు రెండో క్వాలిఫయర్ కోసం నిరీక్షించనుంది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. రాహుల్ త్రిపాఠి (35 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశారు.
అనంతరం కోల్‌కతా 13.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (24 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్ (28 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) సన్‌రైజర్స్ బౌలర్ల భరతం పట్టి మూడో వికెట్‌కు కేవలం 44 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యం జోడించడం విశేషం. గతంలో కోల్‌కతా జట్టు 2012, 2014లలో టైటిల్ సాధించి, 2021లో రన్నరప్‌గా నిలిచింది.
ఆది నుంచే కష్టాల్లో...
అసలైన మ్యాచ్‌లో స్టార్క్ బంతితో నిప్పులు చెరిగాడు. రెండో బంతికే ట్రవిస్ హెడ్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అభిషేక్ శర్మ (3)ను కూడా సింగిల్ డిజిట్‌కే వైభవ్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఫామ్‌లో ఉన్న నితీశ్ కుమార్ రెడ్డి (9), షహబాజ్ (0)లను స్టార్క్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. దాంతో సన్‌రైజర్స్ 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఏడో ఓవర్లో జట్టు స్కోరు 50కి చేరింది.
మెల్లిగా ఈ కష్టాల నుంచి గట్టెక్కుతున్న సమయంలో 8, 9, 10 ఓవర్లు సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌కు ఊరటనిచ్చాయి. హర్షిత్ వేసిన 8వ ఓవర్లో రాహుల్ త్రిపాఠి సిక్సర్‌తో 12 పరుగులొచ్చాయి. నరైన్ తొమ్మిదో ఓవర్లో త్రిపాఠి బౌండరీ బాదితే... క్లాసెన్ 6, 4 కొట్టడంతో 18 పరుగుల్ని రాబట్టుకుంది. రసెల్ పదో ఓవర్లో ఇద్దరు చెరో ఫోర్ కొట్టడంతో మరో 12 పరుగులు రావడంతో సగం ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 92/4 స్కోరు చేసింది.
వరుణ్ దెబ్బతో....
ఇంకేం ఓవర్‌కు 9.2 రన్‌రేట్‌తో గాడిలో పడుతోందనుకుంటున్న తరుణంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దెబ్బకొట్టాడు. అతను వేసిన 11వ ఓవర్లో త్రిపాఠి బౌండరీతో జట్టు స్కోరు 100కు చేరింది. కానీ ఆఖరి బంతికి క్లాసెన్ అవుటయ్యాడు. దీంతో ఐదో వికెట్‌కు 62 పరుగుల విలువైన భాగస్వామ్యానికి తెరపడింది.
తర్వాత కాసేపటికే 5 పరుగుల వ్యవధిలోనే త్రిపాఠి, సన్విర్ (0), సమద్ (16), భువనేశ్వర్ (0) ఇలా నాలుగు వికెట్లను కోల్పోయిన సన్‌రైజర్స్ 126/9 స్కోరు వద్ద ఆలౌట్‌కు సిద్ధమైపోయింది. ఈ దశలో కెపె్టన్ కమిన్స్ (24 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులతో 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది.
అదరగొట్టిన ‘అయ్యర్’లు
బౌలింగ్‌లోనూ హైదరాబాద్ తేలిపోవడం, ఫీల్డర్లు క్యాచ్‌లు నేలపాలు చేయడంతో నైట్‌రైడర్స్‌కు లక్ష్యఛేదన మరింత సులువైంది. ఓపెనర్లు గుర్బాజ్ (14 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సునీల్ నరైన్ (16 బంతుల్లో 21; 4 ఫోర్లు) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యారు. 67 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఒక్క వికెట్టు పడలేదు.
వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ వచ్చిన లైఫ్‌లను సద్వినియోగం చేసుకొని హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో 9.4 ఓవర్లలోనే కోల్‌కతా స్కోరు వందకు చేరింది. లక్ష్యంవైపు చకచకా పరుగులు తీసింది. వెంకటేశ్ 28 బంతుల్లో, శ్రేయస్ 23 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. వెంకటేశ్, శ్రేయస్ ధాటికి కోల్‌కతా 38 బంతులు మిగిలుండగానే విజయతీరానికి చేరింది.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (బి) స్టార్క్ 0; అభిõÙక్ శర్మ (సి) రసెల్ (బి) వైభవ్ 3; త్రిపాఠి (రనౌట్) 55; నితీశ్ కుమార్ రెడ్డి (సి) గుర్బాజ్ (బి) స్టార్క్ 9; షహబాజ్ (బి) స్టార్క్ 0; క్లాసెన్ (సి) రింకూ సింగ్ (బి) వరుణ్ 32; సమద్ (సి) శ్రేయస్ (బి) హర్షిత్ 16; సన్వీర్ (బి) నరైన్ 0; కమిన్స్ (సి) గుర్బాజ్ (బి) రసెల్ 30; భువనేశ్వర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 0; విజయకాంత్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 159. వికెట్ల పతనం: 1–0, 2–13, 3–39, 4–39, 5–101, 6–121, 7–121, 8–125, 9–126, 10–159. బౌలింగ్: స్టార్క్ 4–0–34–3, వైభవ్ 2–0–17–1, హర్షిత్ 4–0–27–1, నరైన్ 4–0–40–1, రసెల్ 1.3–0–15–1, వరుణ్ చక్రవర్తి 4–0–26–2.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) విజయకాంత్ (బి) నటరాజన్ 23; నరైన్ (సి) విజయకాంత్ (బి) కమిన్స్ 21; వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 51; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 58; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (13.4 ఓవర్లలో 2 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–44, 2–67. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–28–0, కమిన్స్ 3–0–38–1, నటరాజన్ 3–0–22–1, విజయకాంత్ 2–0–22–0, హెడ్ 1.4–0–32–0, నితీశ్ రెడ్డి 1–0–13–0.
Comments
Please login to add a commentAdd a comment