
photo credit: IPL Twitter
ఐపీఎల్-2023 సీజన్‌లో ఓ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. మే 1న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన కేఎల్ రాహుల్ స్థానంలో కృనాల్ పాండ్యా లక్నో సూపర్ జెయింట్స్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. లీగ్‌లో లక్నో తదుపరి ఆడబోయే మ్యాచ్‌కు కృనాల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.
కృనాల్ నేతృత్వంలో లక్నో సూపర్ జెయింట్స్ ఇవాళ (మే 3) చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుందని పేర్కొంది. కేఎల్ రాహుల్ గాయం తీవ్రమైందని, ఈ విషయాన్ని బీసీసీఐ స్వయంగా టేకప్ చేస్తుందని, ఐపీఎల్‌లో తదుపరి మ్యాచ్‌ల్లో రాహుల్ ఆడాలా లేదా అన్న విషయంపై తుది నిర్ణయం బీసీసీఐ / ఎన్‌సీఏలదేనని లక్నో టీమ్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది.
వచ్చే నెలలో డబ్ల్యూటీసీ ఫైనల్ (జూన్ 7) ఉన్న దృష్ట్యా బీసీసీఐ రాహుల్ ఇంజ్యూరీ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటుందని, రాహుల్ విషయంలో ఎన్‌సీఏ మెడికల్ టీమ్ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేసింది. కాగా, ఆర్సీబీతో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ (బౌండరీని ఆపే క్రమంలో ఛేజ్ చేస్తూ) కేఎల్ రాహుల్ గాయపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లోనే రాహుల్ స్థానంలో కృనాల్ తాత్కాలికంగా కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. లీగ్ కీలక దశకు చేరిన తరుణంలో గాయం కారణంగా రాహుల్ దూరం కావడం లక్నో టీమ్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతం లక్నో.. గుజరాత్ (అగ్రస్థానం), రాజస్థాన్ (రెండో స్థానం), చెన్నై (నాలుగు), ఆర్సీబీ (ఐదు), పంజాబ్ (ఆరు)లతో పాటు ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment