టీమిండియాకు బిగ్‌ షాక్‌! రాహుల్‌, జడేజా దూరం: బీసీసీఐ ప్రకటన | KL Rahul and Ravindra Jadeja ruled out of second Test in Vizag | Sakshi
Sakshi News home page

టీమిండియాకు బిగ్‌ షాక్‌: రాహుల్‌, జడేజా దూరం.. వాళ్లకు ఛాన్స్‌: బీసీసీఐ ప్రకటన

Published Mon, Jan 29 2024 4:44 PM | Last Updated on Mon, Jan 29 2024 5:12 PM

 KL Rahul, Ravindra Jadeja ruled out of second Test in Vizag - Sakshi

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు‍కు ముందు టీమిండియా భారీ షాక్‌ తగిలింది. ఈ మ్యాచ్‌కు భారత స్టార్‌ ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా గాయాల కారణంగా దూరమయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధృవీకరించింది. "వైజాగ్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో టెస్టుకు రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్‌ దూరమయ్యారు.

జడేజా తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. అదేవిధంగా రాహుల్‌ సైతం కుడి కాలి కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. వీరిద్దరూ ప్రస్తుతం జట్టు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారని" బీసీసీఐ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో వేగంగా పరిగెత్తిన జడేజాకు తొడకండరాలు పట్టేశాయి.

అనంతరం మైదానాన్ని ఇబ్బంది పడుతూ వీడాడు. అయితే జడేజా గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. మరోవైపు రాహుల్‌ కూడా ఫీల్డింగ్‌లో కండరాల నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది. ఇక రెండో టెస్టుకు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ముగ్గురి ఆటగాళ్లను ప్రధాన జట్టులో చేర్చింది.

ఎప్పటినుంచో జట్టులో ఛాన్స్‌కు ఎదురుచూస్తున్న ముంబై బ్యాటర్‌ సర్ఫారాజ్‌ ఖాన్‌కు ఎట్టకేలకు సెలక్టర్లు పిలుపునిచ్చారు. రెండో టెస్టుకు రాహుల్‌, జడ్డూ దూరం కావడంతో సర్ఫారాజ్‌కు సెలక్టర్లు ఛాన్స్‌ ఇచ్చారు. అతడితో పాటు యూపీ ఆల్‌రౌండర్‌ సౌరభ్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్‌ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. కాగా తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో భారత్‌ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement