ఐదేళ్ల క్రితం ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో హార్దిక్ పాండ్యాతో కలిసి వివాదంలో భాగమైన భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ నాటి ఘటన ఇప్పటికీ తనను వెంటాడుతుందని అన్నాడు. ఆ ఇంటర్వ్యూ తర్వాత జరిగిన పరిణామాలు తనను చాలా భయపెట్టాయని, ఆ తర్వాత ఒక వ్యక్తిగా కూడా తనను తాను ఎంతో మార్చుకోవాల్సి వచ్చిందని అతను చెప్పాడు.
నాటి కార్యక్రమంలో మహిళలపై తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ ఆ తర్వాత హార్దిక్, రాహుల్‌లపై బీసీసీఐ కొంత కాలం నిషేధం విధించింది. ‘మామూలుగా నేను చాలా సిగ్గరిని. చిన్నప్పటినుంచి తక్కువగా మాట్లాడే తత్వం. భారత్‌కు ఆడిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని రాహుల్ తన గురించి చెప్పుకున్నాడు.
అయితే కరణ్ జోహర్‌తో ఇంటర్వ్యూ తనను బాగా ఇబ్బంది పెట్టిందని అతను గుర్తు చేసుకున్నాడు. ‘ఆ ఇంటర్వ్యూ అసలు మరో ప్రపంచంలో సాగింది. అది నన్ను చాలా చాలా మార్చేసింది. జట్టునుంచి సస్పెన్షన్‌కు గురి కావడంతో ఆ తర్వాత అందరితో కలిసి మాట్లాడలేకపోయాను. నేను స్కూల్‌లో కూడా ఎప్పుడూ సస్పెండ్ కాలేదు’ అని రాహుల్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment