బర్మింగ్‌హమ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఈ సారీ పతకం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. పురుషుల ఈవెంట్‌లో ఏకైక ఆశాకిరణం లక్ష్యసేన్‌కు సెమీస్‌లో చుక్కెదురైంది. దీంతో ప్రతిష్టాత్మక టోర్నీలో భారత పోరాటం ముగిసింది. 2022 టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన 22 ఏళ్ల లక్ష్యసేన్‌పై ఈ సారి భారత బృందం గంపెడాశలు పెట్టుకుంది. అయితే శనివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌తో ఆ ఆశలన్నీ ఆవిరయ్యాయి.
పురుషుల సింగిల్స్‌లో జరిగిన సెమీస్‌లో భారత ఆటగాడు 12–21, 21–10, 15–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడాడు. ఒక గంటా 8 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ప్రత్యర్థి జోరుకు ఎదురు నిలువలేకపోయిన లక్ష్యసేన్ రెండో గేమ్‌లో పుంజుకోవడంతో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ క్రిస్టీకి కష్టాలు తప్పలేదు.
ఈ గేమ్‌ను కైవసం చేసుకున్న భారత షట్లర్ నిర్ణాయక మూడో గేమ్‌లో ఆ పట్టుదల కొనసాగించడంలో విఫలమయ్యాడు. ఫలితం నిరాశపరిచినప్పటికీ వరుసగా ఫ్రెంచ్ ఓపెన్, ఆల్ ఇంగ్లండ్ టోర్నమెంట్లలో సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించడం ద్వారా లక్ష్యసేన్ బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్ ద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాల్ని మెరుగుపర్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment