సౌరవ్ గంగూలీ (PC: BCCI)
Sourav Ganguly Comments: మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మనే ఉండాలని మాజీ సారథి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ముగిసేంత వరకు హిట్‌మ్యాన్‌ను కొనసాగిస్తేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలరని అభిప్రాయపడ్డాడు.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు పూర్తిగా దూరం కానున్నాడనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ఈనెలలో మొదలుకానున్న సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా రోహిత్.. పొట్టి సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు. వన్డేలకు కూడా దూరం కానున్నాడు.
ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టాల్సి ఉండగా.. అతడు ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. దీంతో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో జట్టును ముందుండి నడిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్‌నే సఫారీలతోనూ కెప్టెన్‌గా కొనసాగించనున్నారు.
ఇక వన్డే కెప్టెన్సీని కేఎల్ రాహుల్‌కు అప్పగించారు. అయితే, టెస్టు సిరీస్‌లో మాత్రం రోహిత్ శర్మ జట్టుతో కలువనున్నాడు. ఈ పరిణామాలపై సౌరవ్ గంగూలీ స్పందిస్తూ మేనేజ్‌మెంట్‌కు కీలక సూచనలు చేశాడు.
‘‘చాలా మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవడం సమస్యగా పరిణమించింది. సూర్య టీ20 కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే, వన్డేల్లో అతడి స్థానం విషయంలో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కాబట్టి 50 ఓవర్ల క్రికెట్‌కు మరో కెప్టెన్ అంటే ఈసారి కేఎల్ రాహుల్ వస్తున్నాడు. ఇక రోహిత్ టెస్టులు ఆడాలనుకుంటున్నాడు కాబట్టి తనే సారథిగా ఉంటాడు.
నిజానికి.. రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో ఆడాలి. వన్డే వరల్డ్‌కప్‌లో అతడి సారథ్యంలో టీమిండియా అద్భుతంగా ఆడింది. అతడు గొప్ప నాయకుడు. టీ20 వరల్డ్‌కప్-2024 ముగిసేంత వరకు అతడు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉండాలి’’ అని సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. కాగా సౌతాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లి కూడా దూరంగా ఉండనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment