ఐపీఎల్ మెగావేలం 2022లో తొలిరోజే స్టార్ ఆటగాళ్లంతా దాదాపు వేలంలోకి రావడంతో రెండోరోజు పెద్దగా చెప్పుకునే ఆటగాళ్లు కనిపించలేదు. అయితే రెండోరోజు వేలంలో ఇప్పటివరకు చూసుకుంటే అత్యధిక ధర పలికిన ఆటగాడు ఇంగ్లండ్ విధ్వంసకర ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్. ఈ ఇంగ్లండ్ ఆటగాడు మెగావేలంలో రూ.11.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. కాగా భారీ ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరైన లివింగ్‌స్టోన్ కోసం ప్రారంభం నుంచే పోటీ నెలకొంది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య ఆసక్తికర పోరు నడిచింది.
రూ. కోటి కనీస ధరతో బరిలోకి దిగిన లివింగ్‌స్టోన్‌ను ఇంత ధర పలుకుతాడని ఎవరు ఊహించలేదు. గతేడాది రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన లివింగ్‌స్టోన్ ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన మూడో ఇంగ్లండ్ ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ రూ. 14 కోట్లకు రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్, రూ.12.5 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత టైమల్ మిల్స్‌ను ఆర్‌సీబీ రూ.12 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇక గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఫైనల్ చేరడంలో లివింగ్‌స్టోన్ కీలకపాత్ర పోషించాడు. జూలైలో ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 42 బంతుల్లోనే 9 సిక్సర్లు, ఆరు ఫోర్లతో సెంచరీతో మెరిశాడు. అతని విధ్వంసకర ఆటతో ఇంగ్లండ్ టి20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక బిగ్‌బాష్ లీగ్‌లోనూ పెర్త్ స్కార్చర్స్ తరపున లివింగ్‌స్టోన్ పలుమార్లు సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈసారి వేలంలో భారీ ధరకు అమ్ముడైన లివింగ్‌స్టోన్ మెరుపులు మెరిపిస్తాడో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment