Malaysia Masters: Kidambi Srikanth Beat World 5th Ranker To Enter Quarter Finals - Sakshi
Sakshi News home page

Malaysia Masters: ప్రపంచ ఐదో ర్యాంకర్‌కు షాకిచ్చిన కిదాంబి శ్రీకాంత్‌

May 26 2023 8:07 AM | Updated on May 26 2023 10:13 AM

Malaysia Masters: Kidambi Srikanth Beat World 5th Ranker To Enter Quarter Finals - Sakshi

కౌలాలంపూర్‌: వ్యక్తిగత విదేశీ కోచ్‌ను నియమించుకున్న తర్వాత భారత స్టార్‌ షట్లర్, ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌ ఆటతీరులో మార్పు కనిపిస్తోంది. మలేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీలో ప్రపంచ 23వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ 5వ ర్యాంకర్‌ కున్లావుత్‌ వితిద్‌సర్న్‌ (థాయ్‌లాండ్‌)తో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ శ్రీకాంత్‌ 21–19, 21–19తో అద్భుత విజయం సాధించాడు.

45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ రెండు గేముల్లోనూ ఒకదశలో వెనుకబడి పుంజుకున్నాడు. కున్లావుత్‌పై శ్రీకాంత్‌కిదే తొలి గెలుపు కావడం విశేషం. గతంలో కున్లావుత్‌తో ఆడిన మూడుసార్లూ శ్రీకాంత్‌ వరుస గేముల్లో ఓడిపోవడం గమనార్హం.  

ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌పై నెగ్గిన ప్రణయ్‌  
భారత నంబర్‌వన్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ మరో గొప్ప విజయంతో క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్నాడు. తొలి రౌండ్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ను ఓడించిన ప్రణయ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఈ ఏడాది ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్, ప్రపంచ 11వ ర్యాంకర్‌ షి ఫెంగ్‌ లీని బోల్తా కొట్టించాడు. 70 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ ప్రణయ్‌ 13–21, 21–16, 21–11తో షి ఫెంగ్‌ లీపై గెలిచాడు.

నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 7–5తో వద్ద ప్రణయ్‌ వరుసగా తొమ్మిది పాయింట్లు నెగ్గి 16–5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌ 14–21, 19–21తో ఎన్జీ కా లాంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌) చేతిలో ఓటమి చవిచూశాడు.  

సింధు వరుసగా 13వసారి... 
మహిళల సింగిల్స్‌లో భారత స్టార్, ప్రపంచ మాజీ చాంపియన్‌ పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 13వ ర్యాంకర్‌ సింధు 21–16, 21–11తో ప్రపంచ 28వ ర్యాంకర్‌ అయా ఒహోరి (జపాన్‌)పై గెలిచింది. తొలి గేమ్‌లో ఆరంభంలోనే 4–0తో ముందంజ వేసిన సింధు వెనుదిరిగి చూడలేదు. రెండో గేమ్‌లోనూ ఆమెదే పైచేయిగా నిలిచింది. ఒహోరిపై సింధుకిది వరుసగా 13వ విజయం కావడం విశేషం. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌లో జాంగ్‌ యి మాన్‌ (చైనా)తో సింధు; నిషిమోటో (జపాన్‌)తో ప్రణయ్‌; క్రిస్టియన్‌ అడినాటా (ఇండోనేసియా)తో శ్రీకాంత్‌ తలపడతారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement