Marcus Stoinis Reveals Interesting Conversation With MS Dhoni - Sakshi
Sakshi News home page

Marcus Stoinis: ధోని కాంప్లిమెంట్‌ ఇచ్చాడో.. జోక్‌ చేశాడో అర్థం కాలేదు!

Published Thu, Oct 28 2021 2:22 PM | Last Updated on Thu, Oct 28 2021 3:50 PM

Marcus Stoinis Reveals Interesting Conversation With MS Dhoni - Sakshi

Photo Courtesy: IPL

Marcus Stoinis Comments On MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌ ధోని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. భారత జట్టుకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన సారథిగా.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గా.. అనేకానేక ఘనతలు అతడి ఖాతాలో ఉన్నాయి. ఇక ఇలాంటి రికార్డులతోనే కాకుండా... ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లతో కూడా అతడు వ్యవహరించే తీరు కూడా కోట్లాది మంది అభిమానులను సంపాదించిపెట్టింది. టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో భాగంగా.. టీమిండియాతో మ్యాచ్‌ అనంతరం పాకిస్తాన్‌ ఆటగాళ్లు వచ్చి ధోని వద్ద సలహాలు తీసుకోవడం అతడి వ్యక్తిత్వానికి నిదర్శనం. 

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ క్రికెటర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ సైతం ఇదే మాట అంటున్నాడు. ఐపీఎల్‌-2021లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ సందర్భంగా ధోని తనతో మాట్లాడిన మాటలను స్టొయినిస్‌ గుర్తుచేసుకున్నాడు. ఈ మేరకు గ్రేడ్‌ క్రికెటర్స్‌ యూట్యూబ్‌ చానెల్‌తో మాట్లాడుతూ... ‘‘నిజానికి తను నాతో చాలా నిజాయితీగా మాట్లాడాడు. నా ఆట తీరు గురించి తనకు అవగాహన ఉంది. 

అందుకే నా కోసం సీఎస్‌కే ఎలాంటి ప్రణాళికలు రచించిందో.. ఫీల్డ్‌ను ఎలా సెట్‌ చేస్తారో కూడా చెప్పాడు. నిజానికి అది నాకు తను ఇచ్చిన కాంప్లిమెంటా లేదంటే... నీ గురించి మొత్తం తెలుసులేనన్న సెటైరో అర్థం కాలేదు(నవ్వులు)’’ అని స్టొయినిస్‌ వ్యాఖ్యానించాడు. ఇక క్రికెట్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్‌గా పేరొందిన ధోని.. ఫినిషింగ్‌కు సంబంధించి తనకు ఆసక్తికర విషయాలు చెప్పాడని స్టొయినిస్‌ పేర్కొన్నాడు. ‘‘కొంతమంది బాధ్యతాయుతంగా ఆడుతూ చివరి వరకు క్రీజులో ఉంటారు. 

మరికొందరు మ్యాచ్‌ ఆరంభంలోనే రిస్క్‌ తీసుకోవడానికి కూడా వెనుకాడరు. ఇందులో ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి అని తను అన్నాడు. నిజమే కదా’’ అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా..‘‘ ఆటలో మన బలహీనతలను గుర్తించాలి.. అయితే అది మన బలాన్ని ప్రభావితం చేసేలా మాత్రం ఉండకూడదనే స్ఫూర్తిదాయక మాటలు చెప్పాడు’’ అని తెలిపాడు. కాగా స్టొయినిస్‌ ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్‌-2021లో ఆడుతుండగా... ధోని టీమిండియాకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు.

చదవండి: Gary Kirsten: పాకిస్తాన్‌ హెడ్‌ కోచ్‌గా.. టీమిండియా మాజీ కోచ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement