
Mark Wood: ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందే కొత్త ఫ్రాంచైజీల్లో ఒకటైన లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ)కు తలనొప్పులు మొదలయ్యాయి. వేలంలో కోట్లు కుమ్మరించి సొంతం చేసుకున్న కీలక ఆటగాడు, ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ గాయం బారిన పడ్డాడు. ఊహించని ఈ పరిణామంతో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని ఎల్‌ఎస్‌జీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలే నాణ్యమైన పేసర్ లేడని కుమిలిపోతున్న ఎల్‌ఎస్‌జీని మార్క్ వుడ్ గాయం మరింత కలవరపాటుకు గురి చేస్తుంది.
వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌తో పోటీపడి మరీ సొంతం చేసుకున్న ఆటగాడు లీగ్‌కు ముందు గాయపడటంతో లక్నో శిబిరంలో ఆందోళన మొదలైంది. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆటలో బౌలింగ్ చేస్తుండగా మార్క్ వుడ్ మోచేతికి గాయమైంది. దీంతో మైదానం వీడిన అతను తిరిగి బౌలింగ్‌కు రాకపోగా, డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు. అతని గాయంపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
కాగా, ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్న మార్క్ వుడ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా ఏడున్నర కోట్లు కుమ్మరించి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 28న వాంఖడే వేదికగా లక్నో, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నాయి.
చదవండి: తన చర్యతో కట్టిపడేసిన క్రికెటర్.. వీడియో వైరల్