జీవితంలో గెలిచి.. కరోనాపై ఓడి! | Milkha Singh To Wife Nirmal Kaur, Couples Succumbed To Covid | Sakshi
Sakshi News home page

జీవితంలో గెలిచి.. కరోనాపై ఓడి!

Published Sun, Jun 20 2021 3:10 AM | Last Updated on Sun, Jun 20 2021 3:10 AM

Milkha Singh To Wife Nirmal Kaur, Couples Succumbed To Covid - Sakshi

మిల్కా సింగ్‌ దంపతులు (ఫైల్‌) 

న్యూఢిల్లీ: ఫ్లైయింగ్‌ సిఖ్‌గా ప్రఖ్యాతిగాంచిన అథ్లెట్‌ మిల్కాసింగ్‌ కరోనా అనంతర లక్షణాలతో శుక్రవారం కన్నుమూశారు. కేవలం ఐదు రోజుల ముం దే ఆయన భార్య నిర్మల్‌ కౌర్‌ను కరోనా రక్కసి బలితీసుకుంది. వీరిద్దరే కాదు దేశవ్యాప్తంగా ఎంతోమంది దంపతులు వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. వయోధికులే కాదు... నిండు నూరే ళ్లు కలిసి జీవించాల్సిన యువ దంపతులూ ఎంద రో మహమ్మారి వల్ల అర్ధాంతరంగా తనువు చాలిం చారు. దశాబ్దాల క్రితం ఒక్కటైనవారు మాత్రమే కాదు, కొత్తగా పెళ్లయిన దంపతులు సైతం మరణించడంతో వారి కుటుంబాలకు శోకసంద్రంలో మునిగిపోతున్నాయి. వారాల వ్యవధిలో.. కొన్ని సందర్భా ల్లో రోజుల వ్యవధిలోనే దంపతులు తుదిశ్వాస విడి చిన సంఘటనలు ఉన్నాయి. దంపతుల్లో ఒకరి మరణం గురించి తెలిసి మరొకరు షాక్‌తో కన్ను మూసిన ఉదంతాలు బయటపడ్డాయి. ఇందుకు ‘బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌’ కారణమని నిపుణులంటున్నారు. 

అనాథలైన 3,261 మంది చిన్నారులు! 
కరోనా వల్ల దేశంలో ఎంతమంది దంపతులు మరణించారన్న స్పష్టమైన గణాంకాలు ప్రభుత్వం వద్ద లేవు. అయితే, కరోనా కాలంలో దేశవ్యాప్తంగా 3,261 మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారినట్లు జాతీయ బాలల హక్కు పరిరక్షణ కమిషన్‌(ఎన్‌సీపీసీఆర్‌) అంచనా వేసింది. అయితే, ఇవి 18 ఏళ్లలోపు పిల్లల గణాంకాలే. వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

చావుబతుకుల్లోనూ కలిసే... 
రాజస్తాన్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్‌ పహాడియా(89) కరోనా బారినపడ్డారు. గుర్గావ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 20న చనిపోయారు. ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే శాంతి పహాడియా(87) కూడా కరోనా కారణంగా అదే ఆసుపత్రిలో  మూడు రోజుల తర్వాత మృతిచెందారు. వారిద్దరికీ బాల్యంలోనే వివాహం జరిగింది. సుదీర్ఘకాలం కలిసి బతికిన పహాడియా దంపతులు దాదాపు ఒకేసారి స్వర్గానికి చేరుకున్నారని వారి కుమారుడు ఓంప్రకాశ్‌ పహాడియా కన్నీటిపర్యంతమయ్యారు. సీనియర్‌ జర్నలిస్టులు, దంపతులైన కల్యాణ్‌ బారువా, నీలాక్షి భట్టాచార్య కరోనా వల్ల గుర్గావ్‌ ఆసుపత్రిలో మే నెలలో మృతిచెందారు.

పహాడియా దంపతుల తరహాలోనే కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరూ తుదిశ్వాస విడిచారు. రాజస్తాన్‌లోని బికనీర్‌ పట్టణానికి చెందిన దంపతులు ఓంప్రకాశ్, మంజుదేవీ గత ఏడాది నవంబర్‌లో 15 రోజుల వ్యవధిలో చనిపోయారు. వారికి 40 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నా రాకాసి కరోనాను మాత్రం జయించలేకపోయారు. కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో నంజుండే గౌడ ఈ ఏడాది ఏప్రిల్‌ 30న మృతి చెందారు. పెళ్లయిన తొమ్మిదేళ్లకు భార్య మమత గర్భవతి కావడంతో ఆనంద డోలికల్లో మునిగిపోయిన నంజుండే గౌడ సంతానాన్ని చూసుకోకుండానే కన్నుమూశారు. మే 11న భార్య మమత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత మూడురోజులకే ఆమె కూడా కరోనాతో కన్నుమూసింది.  

పూర్తిగా కోలుకునేదాకా చెప్పొద్దు 
భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య.. భార్య మరణాన్ని భరించలేక భర్త గుండె పగిలి మరణించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. భార్యాభర్తలిద్దరికీ కరోనా సోకి ఒకరు చనిపోతే ఆ సమాచారాన్ని మరొకరికి తెలియజేయకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రెండో వ్యక్తి పూర్తిగా కోలుకునేదాకా చావు కబురు చెప్పొద్దని అంటున్నారు. ఒక్కోసారి జీవన సహచరి/సహచరుడి మరణం గురించి తెలియకపోవడం సైతం ఎంతో మేలు చేస్తుందని ముంబైకి చెందిన సైకియాట్రిస్టు హరీష్‌ షెట్టి అన్నారు. అధిక ఒత్తిడి, తీవ్రమైన భావోద్వేగానికి గురికావడం బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌కు కారణమని గుర్గావ్‌ సైకియాట్రిస్టు జ్యోతి కపూర్‌ వెల్లడించారు.

దశాబ్దాలపాటు కలిసి బతికిన దంపతుల్లో ఒకరి ఎడబాటు మరొకరికి అంతు లేని దుఃఖాన్ని కలిగించడం సహజమేనని పేర్కొన్నారు. ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తుందని వివరించారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేనివారు బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌తో మరణిస్తుంటారని అన్నారు. భార్య ఆకస్మిక మరణం వల్ల భర్త మరణించే రిస్కు 18 శాతం, భర్త ఆకస్మిక మరణం వల్ల భార్య చనిపోయే రిస్కు 16 శాతం ఉంటుం దని తమ పరిశీలనలో తేలిందని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement