milka singh
-
ఆ హీరోయిన్ పారితోషికం కేవలం 11 రూపాయలు!
ముంబై: ‘‘ఫ్లైయింగ్ సిఖ్’’గా ప్రసిద్ధి పొందిన భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘భాగ్ మిల్కా భాగ్’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన ఫరాన్ అక్తర్, సోనం కపూర్‌కు మంచి గుర్తింపు దక్కింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించడమే అదృష్టంగా భావించిన నటీనటులు.. నామమాత్రపు పారితోషికం తీసుకున్నారు. సోనం సైతం కేవలం 11 రూపాయలు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకుందట. భాగ్ మిల్కా భాగ్ డైరెక్టర్ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా తన బయోగ్రఫీలో ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు. త్వరలో విడుదల కానున్న ‘‘ది స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్’’లో సోనంపై ప్రశంసలు కురిపించిన రాకేశ్ ఓంప్రకాశ్.. ‘‘ఇది లవ్‌స్టోరీ కాదు అని సోనంకు ముందే తెలుసు. బాల్యంలో దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్న వ్యక్తి కథ ఇది. ఈ మూవీలో అతిథి పాత్రలో నటించేందుకు సోనం వెంటనే ఒప్పుకొంది. సినిమాలో తను భాగం కావాలని నిర్ణయించుకుంది. అప్పటికే ఢిల్లీ-6 సినిమాలో మేం కలిసి పనిచేశాం. మా మధ్య అప్పటి నుంచి అనుబంధం ఉంది. భాగ్ మిల్కా భాగ్ గురించి చెప్పగానే తనకు 7 రోజుల సమయం కావాలని అడిగింది. కేవలం 11 రూపాయలు తీసుకుని బీరో పాత్ర పోషించింది. తన మనసు చాలా మంచిది’’ అని పేర్కొన్నాడు. కాగా 2013లో విడుదలైన భాగ్ మిల్కా భాగ్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో మిల్కాసింగ్ ఇష్టసఖి పాత్రలో సోనం నటించింది. చదవండి: ఆచార్య షూటింగ్ పూర్తి.. వైజాగ్‌లో చికిత్స తీసుకుంటున్న మెగాస్టార్! -
ఒక్క రోజులో 86 లక్షలకు పైగా టీకాలు వేసి చరిత్ర సృష్టించాం: మోదీ
ఢిల్లీ: కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడంపై సందిగ్ధతను అధిగమించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం 'మన్ కీ బాత్' ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా జరుగుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఒక్క రోజులో 86 లక్షలు కన్నా ఎక్కువ మందికి టీకాలు వేసి భారత దేశం చరిత్ర సృష్టించిందని తెలిపారు. కరోనా వైరస్‌పై దేశ ప్రజల పోరాటం కొనసాగుతోందని మోదీ చెప్పారు. ఈ పోరాటంలో మనమంతా ఓ అసాధారణ విజయాన్ని సాధించామన్నారు. కొద్ది రోజుల క్రితం మునుపెన్నడూ లేని అద్భుతాన్ని మన దేశం సాధించిందన్నారు. జూన్ 21న 86 లక్షల మందికి పైగా ఉచిత వ్యాక్సిన్ తీసుకున్నారని.. ఒక రోజులో ఇంత ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోవడం గొప్ప రికార్డు అని పేర్కొన్నారు. మధ్య ప్రదేశ్‌లోని బేటుల్ జిల్లా, దులేరియా గ్రామస్థులతో మోదీ మాట్లాడారు. వ్యాక్సిన్‌పై సందిగ్ధతను తమ గ్రామంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారని గ్రామస్థులు ఆయనకు తెలిపారు. దీనిపై స్పందించిన మోదీ మాట్లాడుతూ, వదంతులను నమ్మవద్దని వారికి నచ్చజెప్పారు. తాను రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నానని తెలిపారు. తన తల్లి వయసు సుమారు వందేళ్ళు ఉంటుందని, ఆమె కూడా రెండు డోసులను తీసుకున్నారని తెలిపారు. వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్‌పై మోదీ మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. రోడ్ టు టోక్యో క్విజ్‌లో పాల్గొనడం ద్వారా విలువైన బహుమతులు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఫ్లయింగ్ సిఖ్‌గా పేరుపొందిన మిల్కా సింగ్‌ను మోదీ గుర్తు చేసుకున్నారు. 1964లో దేశం తరపున ఒలింపిక్స్‌లో పాల్గొన్న మిల్కా తృటిలో పతకాన్ని చేజార్చుకున్నాడని.. ఆ స్థాయి ప్రదర్శనతోనే దేశ మన్ననలు పొందాడని తెలిపారు. కరోనా కారణంగా ఒక లెజెండరీ అథ్లెట్‌ను కోల్పోవడం బాధాకరమని మోదీ అభిప్రాయపడ్డారు. చదవండి: డీఏను తక్షణమే పునరుద్ధరించాలి: కాంగ్రెస్ -
Milkha Singh Love Story: ఆమె ప్రేమకై అతడి పరుగు
‘నాకొచ్చిన అన్ని ట్రోఫీల కన్నా గొప్ప ట్రోఫీ నా భార్య’ అని అనేవారు మిల్ఖా సింగ్. మిల్ఖా సింగ్, ఆయన భార్య నిర్మల్ కౌర్ 59 ఏళ్ల వైవాహిక జీవితం గడిపారు. తమ ప్రేమ కథను పెళ్లి వరకూ తీసుకెళ్లడానికి ఆ రోజుల్లోనే కొంత సాహసం చేశారు. వారు ఒకరిని విడిచి ఒకరు ఎంతగా ఉండలేకపోయారంటే 5 రోజుల తేడాలో ఇద్దరూ మరణించారు. జూన్ 13న నిర్మల్. జూన్ 18న మిల్ఖా. మిల్ఖా సింగ్ మరణించాక అభిమానులు ఆయన ప్రేమ కథను గుర్తు చేసుకుంటున్నారు. ఈ జూన్ నెలలో భార్య నిర్మల్ కౌర్ కరోనాతో మరణించిన ఐదు రోజులకు మిల్ఖా సింగ్ కూడా ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నారు. బహుశా ఈ లోకం ఆయనకు నిరర్థకం అనిపించి ఉండవచ్చు ఆమె లేకుండా. తన భార్య నిర్మల్‌ను ఎవరికి పరిచయం చేసినా మిల్ఖా ‘నా గుండె చప్పుడు’ అని అనేవారు. ఆమె లేనప్పుడు ఆయన గుండె చప్పుడు ఆగిపోవడం ఆయన దృష్టిలో సహజమే కావచ్చు. భారతదేశానికి తన పరుగు తో విశేషమైన పేరు తెచ్చిన మిల్ఖా సింగ్ తన ప్రేమ కోసం కూడా బాగానే పరుగు తీశారు. 1960 లో మొదలైన ప్రేమ కథ 1962లో పెళ్లితో సుఖాంతమైంది. అతను స్టార్ ఆమె టీచర్ మిల్ఖాసింగ్, నిర్మల్ కౌర్‌ల పరిచయం 1958లో కొలంబోలో జరిగింది. ఆమె వాలీబాల్ ప్లేయర్. ఇతను అథ్లెట్. ‘అప్పుడు ఆమెతో కబుర్లు చెప్పాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనొచ్చు’ అంటారు మిల్ఖా. ఆ తర్వాత రెండేళ్లపాటు వాళ్లు కలవలేదు. ఢిల్లీలో 1960లో అక్కడి స్టేడియంలో ప్రాక్టీస్‌కు వెళ్లేవారు మిల్ఖా. అక్కడే స్కూల్ పిల్లలను ప్రాక్టీసు చేయిస్తూ నిర్మల్ వచ్చేవారు. ‘అక్కడ ఆమెను చూసి చాలా సంతోషించాను. రెండేళ్ల క్రితం చూసిన నిర్మల్‌కు ఇప్పటి నిర్మల్‌కు ఎంత తేడా. ఆమె ఇప్పుడు ఇంకా నిండుగా తయారైంది’ అని తన ఆత్మకథలో రాశారు మిల్ఖా. అయితే ఆయన బిడియపడుతూ ఉంటే ఆమే అతణ్ణి బలవంతం గా కాఫీకి పిలిచింది. ఆ తర్వాత వారు కలుసుకోవడం కొనసాగింది. ‘ఒకసారి నేను ఆమె కారులో వస్తూ ఉన్నాం. నేను డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను. ఆమెతో మాట్లాడుతూ కొంచెం పరధ్యానంగా ఉండటంతో కారు కంట్రోల్ తప్పింది. రోడ్డు మీద వెళుతున్న కొంతమందికి డాష్ ఇచ్చాను. ఒకామె గాయపడింది. అది పెద్ద గొడవ అయ్యింది ఆమె ఖర్చులన్నీ భరించి కొంత డబ్బు నేను ఇచ్చినా...’ అని రాశారు మిల్ఖా. వీరిద్దరూ కలిసి తిరగడం పత్రికలకు ఎక్కింది. కాని ఇరువురూ భయపడలేదు. మిల్ఖాసింగ్, నిర్మల్ కౌర్‌ల పెళ్లినాటి ఫొటో చండీగఢ్ నుంచి ఢిల్లీకి ఆ సమయంలోనే మిల్ఖా మిలటరీ ఉద్యోగానికి రిజైన్ చేసి చండీగఢ్‌లో పంజాబ్ స్పోర్ట్స్ అకాడెమీకి ఉద్యోగిగా వెళ్లారు. కాని ఢిల్లీలో టీచరుగా పని చేస్తున్న నిర్మల్ ఆయనకు బాగా గుర్తుకొచ్చేది. ప్రతి వీకెండ్ కారు డ్రైవ్ చేసుకుంటూ ఢిల్లీకి వచ్చి ఆమెను కలిసేవారు. కొన్ని నెలలకే నిర్మల్ కూడా చండీగఢ్‌కు షిఫ్ట్ అయ్యారు. ఆమె కూడా పంజాబ్ స్పోర్ట్స్ అకాడెమీ ఉద్యోగి అయ్యారు. దాంతో వీరి ప్రేమ కథ ఇరు ఇళ్లల్లో తెలిసిపోయింది. మిల్ఖా సిఖ్. నిర్మల్ హిందూ. నిర్మల్ ఇంట్లో ఈ పెళ్లి మొదట ఇష్టం కాలేదు. నాటి పంజాబ్ సి.ఎం ప్రతాప్ సింగ్‌కు నిర్మల్ తల్లిదండ్రులు ఈ ఉదంతం పై లేఖలు రాసేవారు. దాంతో ఆయన మిల్ఖాను పిలిచి ఒకరోజు బాగా ఫైర్ అయ్యారు. ఆ తర్వాత మిల్ఖా ఆయనకు తమ ప్రేమ గురించి పూర్తిగా వివరించి చెప్పడంతో ఏకంగా సి.ఎం. రంగంలో దిగి ఇరు కుటుంబాల వారికి చెప్పి పెళ్లి జరిపించారు. 1962లో వీరి పెళ్లయ్యింది. మిల్ఖాకు, నిర్మల్‌కు ఎడం 9 ఏళ్లు. కొడుకు, కోడలు, మనవడితో మిల్ఖా దంపతులు ఆమె నా సర్వస్వం పెళ్లయ్యాక మిల్ఖా తన భార్యే తన సర్వస్వం గా భావించేవారు. ‘ఎప్పుడు మేము కారులో బయటకు వెళ్లినా ఆయనే డోర్ తెరిచి నిలుచునేవారు’ అంటారు నిర్మల్. ‘నేను మెట్రిక్యులేషన్ దాటలేదు. కాని నా నలుగురు పిల్లలు బాగా చదువుకున్నారు. అందుకు కారణం నిర్మల్’ అంటారు మిల్ఖా. వీరు ఒక పిల్లాడిని కూడా దత్తత తీసుకున్నారు. అతను మిలట్రీలో పని చేస్తూ 1999లో టైగర్ హిల్ బ్యాటిల్లో మరణించాడు. వీరి ఒక కుమార్తె న్యూయార్క్‌లో డాక్టర్ అయితే కుమారుడు జీవ్ మిల్ఖా ప్రొఫెషనల్ గోల్ఫర్. దేశ విభజన సమయంలో దాదాపు అనాథలా పాకిస్తాన్ నుంచి భారతదేశం వచ్చి స్వశక్తితో పెరిగి సైన్యంలో చేరి అక్కడే పరుగు నేర్చి భారతదేశం ఎప్పటికీ గుర్తు పెట్టుకునే క్రీడాకారుడైన మిల్ఖా ఆ పరుగుతో వచ్చిన జీవితాన్ని సఫలం చేసుకోవడంలో భార్య నిర్మల్‌ను భాగస్వామిగా చేసుకున్నాడు. ప్రేమ మొదలయ్యే ముందు అప్పటికే కీర్తి గడించిన మిల్ఖా సింగ్‌ను చూసి ‘నువ్వు స్థిరం ఎరగని తుమ్మెదవు. నేను ఒంటరి చెట్టును. ఈ చెట్టు గురించి నీకు గుర్తుంటుందా’ అన్నదట నిర్మల్. ఆ తుమ్మెద ఆ తర్వాత ఆ చెట్టునే అంటిపెట్టుకుని ఉండిపోవడమే ఈ ప్రేమలోని అందం. సుగంధం. – సాక్షి ఫ్యామిలీ -
Milka Singh: ‘ఫ్లయింగ్ సిఖ్’ అయ్యాడిలా...
పాకిస్తాన్ దిగ్గజ అథ్లెట్ అబ్దుల్ ఖాలిఖ్. అప్పట్లో ఆయనకు ఆసియాలోనే అత్యంత వేగవంతమైన రన్నర్‌గా పేరుంది. అంతటి పరుగు వీరుడ్ని అది కూడా వారి గడ్డమీదే ఓడించిన ఘనత మన సింగ్‌ది. 1960లో జరిగిన ఇండోృపాక్ స్పోర్ట్స్ మీట్లో 200 మీటర్ల పరుగులో మిల్కా అతన్ని ఓడించి పసిడి పట్టాడు. సింగ్ పరుగుకు ముగ్ధుడైన అప్పటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్... ‘ఫ్లయింగ్ సిఖ్’ బిరుదుతో మిల్కాను సత్కరించారు. 1962 జకార్తా ఆసియా క్రీడల్లో మరో రెండు స్వర్ణాలు (400 మీ., 4్ఠ400 రిలే) సాధించాడు. 1964లో రిటైరైన మిల్కా ఆర్మీ ఉద్యోగాన్ని కూడా వదిలేసి పంజాబ్ రాష్ట్రంలోనే క్రీడాధికారిగా ఉన్నత ఉద్యోగం చేశాడు. అతని జీవిత గాథతో బాలీవుడ్లో తెరకెక్కిన ‘బాగ్ మిల్కా బాగ్’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. -
జీవితంలో గెలిచి.. కరోనాపై ఓడి!
న్యూఢిల్లీ: ఫ్లైయింగ్ సిఖ్‌గా ప్రఖ్యాతిగాంచిన అథ్లెట్ మిల్కాసింగ్ కరోనా అనంతర లక్షణాలతో శుక్రవారం కన్నుమూశారు. కేవలం ఐదు రోజుల ముం దే ఆయన భార్య నిర్మల్ కౌర్‌ను కరోనా రక్కసి బలితీసుకుంది. వీరిద్దరే కాదు దేశవ్యాప్తంగా ఎంతోమంది దంపతులు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. వయోధికులే కాదు... నిండు నూరే ళ్లు కలిసి జీవించాల్సిన యువ దంపతులూ ఎంద రో మహమ్మారి వల్ల అర్ధాంతరంగా తనువు చాలిం చారు. దశాబ్దాల క్రితం ఒక్కటైనవారు మాత్రమే కాదు, కొత్తగా పెళ్లయిన దంపతులు సైతం మరణించడంతో వారి కుటుంబాలకు శోకసంద్రంలో మునిగిపోతున్నాయి. వారాల వ్యవధిలో.. కొన్ని సందర్భా ల్లో రోజుల వ్యవధిలోనే దంపతులు తుదిశ్వాస విడి చిన సంఘటనలు ఉన్నాయి. దంపతుల్లో ఒకరి మరణం గురించి తెలిసి మరొకరు షాక్‌తో కన్ను మూసిన ఉదంతాలు బయటపడ్డాయి. ఇందుకు ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’ కారణమని నిపుణులంటున్నారు. అనాథలైన 3,261 మంది చిన్నారులు! కరోనా వల్ల దేశంలో ఎంతమంది దంపతులు మరణించారన్న స్పష్టమైన గణాంకాలు ప్రభుత్వం వద్ద లేవు. అయితే, కరోనా కాలంలో దేశవ్యాప్తంగా 3,261 మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారినట్లు జాతీయ బాలల హక్కు పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) అంచనా వేసింది. అయితే, ఇవి 18 ఏళ్లలోపు పిల్లల గణాంకాలే. వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చావుబతుకుల్లోనూ కలిసే... రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా(89) కరోనా బారినపడ్డారు. గుర్గావ్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 20న చనిపోయారు. ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే శాంతి పహాడియా(87) కూడా కరోనా కారణంగా అదే ఆసుపత్రిలో మూడు రోజుల తర్వాత మృతిచెందారు. వారిద్దరికీ బాల్యంలోనే వివాహం జరిగింది. సుదీర్ఘకాలం కలిసి బతికిన పహాడియా దంపతులు దాదాపు ఒకేసారి స్వర్గానికి చేరుకున్నారని వారి కుమారుడు ఓంప్రకాశ్ పహాడియా కన్నీటిపర్యంతమయ్యారు. సీనియర్ జర్నలిస్టులు, దంపతులైన కల్యాణ్ బారువా, నీలాక్షి భట్టాచార్య కరోనా వల్ల గుర్గావ్ ఆసుపత్రిలో మే నెలలో మృతిచెందారు. పహాడియా దంపతుల తరహాలోనే కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరూ తుదిశ్వాస విడిచారు. రాజస్తాన్‌లోని బికనీర్ పట్టణానికి చెందిన దంపతులు ఓంప్రకాశ్, మంజుదేవీ గత ఏడాది నవంబర్‌లో 15 రోజుల వ్యవధిలో చనిపోయారు. వారికి 40 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నా రాకాసి కరోనాను మాత్రం జయించలేకపోయారు. కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో నంజుండే గౌడ ఈ ఏడాది ఏప్రిల్ 30న మృతి చెందారు. పెళ్లయిన తొమ్మిదేళ్లకు భార్య మమత గర్భవతి కావడంతో ఆనంద డోలికల్లో మునిగిపోయిన నంజుండే గౌడ సంతానాన్ని చూసుకోకుండానే కన్నుమూశారు. మే 11న భార్య మమత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత మూడురోజులకే ఆమె కూడా కరోనాతో కన్నుమూసింది. పూర్తిగా కోలుకునేదాకా చెప్పొద్దు భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య.. భార్య మరణాన్ని భరించలేక భర్త గుండె పగిలి మరణించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. భార్యాభర్తలిద్దరికీ కరోనా సోకి ఒకరు చనిపోతే ఆ సమాచారాన్ని మరొకరికి తెలియజేయకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రెండో వ్యక్తి పూర్తిగా కోలుకునేదాకా చావు కబురు చెప్పొద్దని అంటున్నారు. ఒక్కోసారి జీవన సహచరి/సహచరుడి మరణం గురించి తెలియకపోవడం సైతం ఎంతో మేలు చేస్తుందని ముంబైకి చెందిన సైకియాట్రిస్టు హరీష్ షెట్టి అన్నారు. అధిక ఒత్తిడి, తీవ్రమైన భావోద్వేగానికి గురికావడం బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌కు కారణమని గుర్గావ్ సైకియాట్రిస్టు జ్యోతి కపూర్ వెల్లడించారు. దశాబ్దాలపాటు కలిసి బతికిన దంపతుల్లో ఒకరి ఎడబాటు మరొకరికి అంతు లేని దుఃఖాన్ని కలిగించడం సహజమేనని పేర్కొన్నారు. ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తుందని వివరించారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేనివారు బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌తో మరణిస్తుంటారని అన్నారు. భార్య ఆకస్మిక మరణం వల్ల భర్త మరణించే రిస్కు 18 శాతం, భర్త ఆకస్మిక మరణం వల్ల భార్య చనిపోయే రిస్కు 16 శాతం ఉంటుం దని తమ పరిశీలనలో తేలిందని చెప్పారు. -
సాక్షి కార్టూన్ 20-06-2021
-
ఒలింపిక్స్‌లో స్వర్ణం మిస్సయిన మిల్కా సింగ్..
న్యూఢిల్లీ: జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి నిత్యం శ్రమించాలి. ఏమాత్రం ఏమారపాటుగా ఉన్న వెంటుకవాసిలో ఓటమి పాలవుతాం. చదువు విషయానికి వస్తే పరీక్షల ముందు ప్రిపేరషన్ ప్రారంభించినా సరిపోతుందేమో కానీ.. క్రీడల విషయంలో మాత్రం అలా కాదు. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఒలింపిక్స్ జరిగేది నాలుగేళ్లకోసారి కదా.. మూడో ఏట నుంచి ప్రాక్టీస్ మొదలు పెడతానంటే సరిపోదు. నాలుగేళ్లు శ్రమిస్తేనే మన కల సాకారం అవుతుంది అంటారు అభినవ్ బింద్రా. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయుడిగా రికార్డ్ సృష్టించారు అభినవ్ బింద్రా. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించారు. అయితే అభినవ్ విజయం కన్నా దాదాపు 50 ఏళ్ల ముందే భారత్ ఖాతాలో ఈ రికార్డు నమోదయ్యేది. అది కూడా పరుగుల వీరుడు, ఫ్లయింగ్ సిక్ మిల్కా సింగ్ వల్ల. కానీ దురదృష్టం కొద్ది ఆ అవకాశం చేజారింది. ఈ విషయాన్ని స్వయంగా మిల్కా సింగ్ తెలిపారు. ఇండియాటుడేకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దీని గురించి వెల్లడించారు. ఆ వివరాలు.. 1958లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 200మీటర్లు, 400 మీటర్ల విభాగంలో మిల్కా సింగ్ స్వర్ణం గెలిచారు. ఆ తర్వాత మిల్కా సింగ్ లక్ష్యం 1960లో జరిగిన రోమ్ ఒలింపిక్స్. అందుకోసం తీవ్రంగా శ్రమించారు మిల్కా సింగ్. అప్పటికి ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరు మిల్కా సింగ్ స్వర్ణం గెలుస్తారని భావించారు. కానీ దురదృష్టం కొద్ది ఆయన నాలుగో స్థానానికే పరిమితం అయ్యారు. ఈ బాధ తనను జీవితాంతం వెంటాడుతుందన్నారు మిల్కా సింగ్. ఇండియాటుడేకిచ్చిన ఇంటర్వ్యూలో మిల్కా సింగ్ మాట్లాడుతూ.. ‘‘1960 రోమ్ ఒలింపిక్స్‌లో సెమి ఫైనల్స్, ఫైనల్స్ మధ్య రెండు రోజుల విరామం ఉంది. ఆ 2 రోజులు నామీద విపరీతమైన ఒత్తిడి ఉంది. ప్రపంచం నన్ను గమనిస్తుంది.. నేను తప్పక విజయం సాధించాలని భావించాను. రోమ్కు వెళ్లడానికి ముందు ప్రతి ఒక్కరు నేను 400మీటర్ల విభాగంలో స్వర్ణం సాధిస్తానని భావించారు. రేసులో నేను ముందంజలో ఉన్నాను. 200మీటర్ల దూరాన్ని 21 సెకన్లలో పూర్తి చేశాను. ఇప్పటివారికి ఇది పూర్తిగా అసాధ్యం. అయితే అదే వేగంతో వెళ్తే నేను రేస్ పూర్తి చేయలేనని భావించి నా వేగాన్ని కాస్త తగ్గించాను. అదే నేను చేసిన పెద్ద తప్పదం. ఆ తర్వాత నేను ఎంత ప్రయత్నించినా మునుపటి వేగాన్ని అందుకోలేకపోయాను. ఫలితంగా నాలుగో స్ధానంలో నిలిచాను. ఇది నా దురదృష్టం కాదు.. ఇండియాది. చనిపోయే వరకు ఈ బాధ నన్ను వెంటాడుతూనే ఉంది’’ అన్నారు మిల్కా సింగ్. ఈ రేస్‌లో మిల్కా సింగ్ 45.6 సెకండ్స్‌తో నాలుగో స్థానంలో నిలవగా అమెరికాకు చెందిన ఓటిస్ డేవిస్ 44.9 సెకండ్స్లో రేసు ముగించి స్వర్ణం గెలిచాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రపంచ అథ్లెటిక్స్‌లో మిల్కాసింగ్‌ది చెరగని ముద్ర: సీఎం జగన్
సాక్షి, అమరావతి : పరుగుల వీరుడు, ఫ్లయింగ్ సిఖ్‌గా ఖ్యాతిగాంచిన భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మిల్కాసింగ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో మిల్కాసింగ్ చెరగని ముద్ర వేశారని, ఆయన వ్యక్తిత్వం భావితరాలకు ఆదర్శమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దేశం విశిష్ట క్రీడాకారుడిని కోల్పోయింది: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్ప్రింట్ దిగ్గజం మిల్కా సింగ్ మృతిపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోవిడ్ అనంతర సమస్యల కారణంగా దిగ్గజ క్రీడాకారుడు మృతి చెందటం బాధాకరమన్నారు. మిల్కా బలమైన వ్యక్తిత్వం భావి తరాలకు ఆదర్శమని, దేశం విశిష్ట క్రీడాకారుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. కోట్లాది మంది హృదయాల్లో మిల్కా ప్రత్యేక స్థానం పొందారన్నారు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో మిల్కా చెరగని ముద్ర వేశారన్నారు. చదవండి : మిల్కాసింగ్ అస్తమయం: బావురుమన్న అభిమానులు -
అథ్లెట్ మిల్కాసింగ్ కన్నుమూత
-
Milkha Singh: శరణార్థి శిబిరం నుంచి ఒలింపిక్స్.. వయా తీహార్ జైలు!
ఒలంపిక్స్, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్‌లో పరుగు పందేలతో, పతకాలతో దేశ ప్రతిష్టను పెంచిన దిగ్గజం మిల్కా సింగ్. పోస్ట్ కొవిడ్ సంబంధిత సమస్యలతో 91 ఏళ్ల వయసున్న ఆయన కన్నుమూయగా.. క్రీడా లోకం, దేశం ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తోంది. అయితే ఈ పరుగుల దిగ్గజం గురించి అతితక్కువ మందికి తెలిసిన విషయాలెంటో చూద్దాం. 1929 నవంబర్ 20న గోవింద్‌పుర(ప్రస్తుతం పాక్‌లో ఉన్న పంజాబ్)లో పుట్టిన మిల్కా సింగ్.. విభజన అల్లర్లలో తల్లిదండ్రుల్ని పొగొట్టుకున్నాడు. బలవంతంగా శరణార్థ శిబిరాల్లో గడిపిన మిల్కా.. చివరికి 1947లో ఢిల్లీలో ఉంటున్న తన సొదరి దగ్గరికి చేరుకున్నాడు. ఆ టైంలో టికెట్ లేకుండా ప్రయాణించిన నేరానికి కొన్నాళ్లు తీహార్ జైలులోనూ గడిపాడాయన. అల్లర్లలో తల్లిదండ్రుల్ని కోల్పోవడం, చేదు అనుభవాలు తన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీశాయని, ఒకానొక టైంలో దొపిడీ దొంగగా మారాలని అనుకున్నాడని ఆయన తరచూ ఇంటర్వ్యూలలో చెప్తుండేవాడు. అయితే సోదరుడి ప్రోత్సాహంతో ఆర్మీలో చేరి.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ‘పరుగులు’ తీశాడు ఇండియన్ ఆర్మీ పరీక్షల్లో మూడుసార్లు విఫలమైన మిల్కా సింగ్.. 1951 నాలుగో అటెంప్ట్‌లో సెలక్ట్ అయ్యాడు. ఆర్మీలో టెక్నికల్ జవాన్‌గా మిల్కా సింగ్ ప్రస్థానం మొదలైంది. అయితే అక్కడి నుంచే ఆయన రన్నింగ్ రేసుల్లో పాల్గొనేవాడు. మన దేశంలో రన్నింగ్‌లో ‘ట్రాక్ అండ్ ఫీల్డ్’ను ఇంట్రడ్యూస్ చేసింది మిల్కా సింగే. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచిన తర్వాత.. తన విజయానికి గౌరవంగా దేశవ్యాప్త సెలవు ప్రకటించాలన్న మిల్కా సింగ్ విజ్ఞప్తిని అప్పటి ప్రధాని నెహ్రూ సంతోషంగా అంగీకరించారు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో నాలుగో స్థానంలో నిలిచాడు మిల్కా సింగ్. అయితే అప్పుడు ఆయన నెలకొల్నిన 45 సెకన్ల రికార్డు బ్రేక్ చేయడానికి మరో భారత రన్నర్‌కి 40 ఏళ్లు పట్టింది. ఆసియా పరుగుల వీరుడి ట్యాగ్ దక్కించుకున్న అబ్దుల్ ఖలిక్‌పై 200 మీటర్లపరుగుపందెంలో విజయం సాధించాడు మిల్కా సింగ్. అది చూసి పాక్ జనరల్ ఆయూబ్ ఖాన్ ‘ఫ్లైయింగ్ సిక్’ అని పిలిచాడు. అప్పటి నుంచి అది ఆయన బిరుదు అయ్యింది. మొత్తం 80 రేసుల్లో 77 విజయాలతో అరుదైన రికార్డు ఆయన సొంతమని చెప్తారు. 2001లో కేంద్రం ఆయనకు అర్జున అవార్డు ప్రకటించగా.. ‘40 ఏళ్లు ఆలస్యమైంద’ని పేర్కొంటూ ఆయన తిరస్కరించారు. ఆయన తన పతకాలన్నింటిని దేశానికే దానం చేశాడు. తొలుత ఢిల్లీ నెహ్రూ స్టేడియంలో ప్రదర్శనకు ఉంచిన వాటిని.. తర్వాత పటియాలాలోని స్పోర్ట్స్ మ్యూజియానికి తరలించారు. 1999లో కార్గిల్ వార్‌లో అమరుడైన బిక్రమ్ సింగ్ ఏడేళ్ల కొడుకును మిల్కా సింగ్ దత్తత తీసుకున్నాడు మిల్కా సింగ్ తన కూతురు సోనియా సాన్వాకాతో కలిసి ఆత్మకథ ‘ది రేస్ ఆఫ్ మై లైఫ్’ రాసుకున్నాడు. ఈ బుక్ ఆధారంగానే బాలీవుడ్ డైరెక్టర్ రాకేష్ మెహ్రా, ఫర్హాన్ అక్తర్‌ను లీడ్ రోల్ పెట్టి ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమా తీశాడు. అయితే ఈ సినిమా కోసం తన బయోపిక్ హక్కుల్ని ఒక్క రూపాయికే ఇచ్చేసి ఆశ్చర్యపరిచాడు ఈ దిగ్గజం. కానీ, సినిమాకొచ్చే లాభాల్లో కొంత వాటాను పేద క్రీడాకారుల కోసం నెలకొల్పిన మిల్కా సింగ్ ఛారిటబుల్ ట్రస్ట్‌కి ఇవ్వాలనే కండిషన్ పెట్టాడనే విషయం తర్వాత వెలుగులోకి వచ్చింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: మిల్కా సింగ్ భార్య నిర్మల్ కౌర్ కన్నుమూత -
దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ కన్నుమూత
చండీగఢ్: దిగ్గజ పరుగుల వీరుడు, ఫ్లయింగ్ సిఖ్‌గా ఖ్యాతిగాంచిన భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ (91) కన్నుమూశారు. కరోనా అనంతర సమస్యలతో శుక్రవారం అర్ధరాత్రి చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్)లో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి 11.30 సమయంలో తుదిశ్వాస విడిచారు. ఇంటి వంట మనుషుల్లో ఒకరు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆ వ్యక్తి ద్వారా మే 20వ తేదీన మిల్కాసింగ్‌కు వైరస్ సోకింది. మే 24న మొహాలీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. నెగెటివ్ రావడంతో మే 30న డిశ్చార్జి అయినప్పటికీ ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో జూన్ 3న ఆయన్ను చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌లో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1932 నవంబర్ 20న పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఉన్న గోవింద్‌పురలో జన్మించారు. సిక్‌రాథోడ్ రాజపుత్రుల కుటుంబంలో జన్మించిన మిల్కాసింగ్ 1951లో భారత సైన్యంలో చేరారు. ఆర్మీ నిర్వహించిన పరుగులపోటీలో మిల్కాసింగ్‌కు ఆరో స్థానంలో నిలిచారు. అనంతరం అథ్లెట్‌గా మారారు. మిల్కాసింగ్‌కు హైదరాబాద్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. సికింద్రాబాద్‌లో మిల్కాసింగ్ 9 ఏళ్లపాటు శిక్షణ పొందారు. అనంతరం 1958 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచి సత్తా చాటాడు. అనంతరం1958 టోక్యో, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణాలు నెగ్గారు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల విభాగంలో నాలుగో స్థానంలో నిలిచారు. త్రుటిలో ఒలింపిక్ పతకాన్ని కోల్పోయారు. ట్రాక్‌పై ఆయన చూపిన తెగువతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 1959లో పద్మశ్రీతో సత్కరించింది. మిల్కాసింగ్ భార్య నిర్మల్ కౌర్ కరోనా వైరస్‌తో పోరాడుతూ జూన్ 14వ తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే. భార్య మృతి చెందిన నాలుగు రోజులకే ఆయన కన్నుమూయడంతో మిల్కాసింగ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మిల్కాసింగ్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ‘భాగ్ మిల్కా భాగ్’ అనే బాలీవుడ్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో క్రీడాలోకం మూగబోయింది. మరణవార్త తెలియగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్ర్భాంతికి లోనయ్యారు. గొప్పవ్యక్తిని కోల్పోయామని తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: కరోనాతో మిల్కా సింగ్ భార్య మృతి చదవండి: కరోనా బారిన పడిన భారత దిగ్గజ అథ్లెట్ In the passing away of Shri Milkha Singh Ji, we have lost a colossal sportsperson, who captured the nation’s imagination and had a special place in the hearts of countless Indians. His inspiring personality endeared himself to millions. Anguished by his passing away. pic.twitter.com/h99RNbXI28 — Narendra Modi (@narendramodi) June 18, 2021 Saddened to hear about the demise of Shri Milkha Singh Ji. A legendary sportsman, he will be dearly remembered. My sincere condolences to his family, loved ones and fans across the world. — Mamata Banerjee (@MamataOfficial) June 18, 2021 -
కరోనాతో మిల్కా సింగ్ భార్య మృతి
చండీగఢ్: భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. మిల్కాసింగ్ భార్య నిర్మల్ కౌర్ కరోనా వైరస్‌తో పోరాడుతూ ఆదివారం మృతి చెందారు. ఈ మేరకు ఆమె కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. 85 ఏళ్ల నిర్మల్ పంజాబ్ ప్రభుత్వంలో మహిళా స్పోర్ట్స్ డైరెక్టర్‌గా పని చేశారు. భారత మహిళల వాలీబాల్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. కాగా 91 ఏళ్ల మిల్కా సింగ్ సైతం ఇటీవల కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అనంతరం చండీగఢ్‌లోని మిల్కా సింగ్ నివాసానికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఇక మిల్కా సింగ్ 1958 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, 1958 టోక్యో, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణాలు నెగ్గారన్న విషయం తెలిసిందే. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల విభాగంలో నాలుగో స్థానంలో నిలిచారు. కాగా క్రీడాకారులైన మిల్కా సింగ్- నిర్మల్ కౌర్ 1963లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు సంతానం. చదవండి: మైదానంలో ఆటగాడికి గాయం.. ప్రత్యర్ధి అభిమానులు ఏం చేశారో తెలుసా..? -
Corona: ఆసుపత్రిలో చేరిన దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్
చండీగఢ్: కరోనా వైరస్ బారిన పడ్డ భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్‌ను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆసుపత్రిలో చేర్పించామని ఆయన కుమారుడు, స్టార్ గోల్ఫర్ జీవ్ మిల్కాసింగ్ తెలిపారు. గత బుధవారం ‘పాజిటివ్’గా రావడంతో 91 ఏళ్ల మిల్కా సింగ్ చండీగఢ్‌లోని తన ఇంట్లో చికిత్స తీసుకుంటున్నారు. మిల్కా సింగ్ 1958 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, 1958 టోక్యో, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణాలు నెగ్గారు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల విభాగంలో నాలుగో స్థానంలో నిలిచారు. అయినప్పటికీ ట్రాక్‌పై ఆయన చూపిన తెగువతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కాగా కోవిడ్ బారిన పడిన అనంతరం మిల్కా సింగ్ మాట్లాడుతూ.. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, అయితే జాగింగ్ నుంచి తిరిగి వచ్చాక కాస్త అలసటగా ఉండటంతో కోవిడ్ పరీక్ష చేయించుకున్నానని తెలిపారు, తనకు పాజిటివ్‌గా నిర్ధారణగా కావడం ఆశ్చర్యానికి గురిచేసిందని, త్వరలోనే కోలుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: కరోనా కాటు: ఇటుకల బట్టీలో ఫుట్‌బాల్ కెప్టెన్ -
కరోనా బారిన పడిన భారత దిగ్గజ అథ్లెట్
న్యూఢిల్లీ: ఫ్లయింగ్ సిఖ్‌గా పేరుగాంచిన దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ కోవిడ్ బారిన పడ్డారు. ఇటీవల ఇంట్లో పని చేసే సహాయకుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అతను పరీక్షలు చేయించుకున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్న మిల్కా పరిస్థితి నిలకడగానే ఉందని అతని భార్య నిర్మల్ కౌర్ తెలిపారు. కాగా, మిల్కా వయస్సు 91 ఏళ్లు కావడంతో ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుమార్తె మోనా మిల్కా సింగ్ న్యూయార్క్ నగరంలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో వైద్యురాలు కావడంతో ఎప్పటికప్పుడు వీడియో కాల్ ద్వారా సలహాలు సూచనలు ఇస్తుందని నిర్మల్ కౌర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిల్కా సింగ్ మాట్లాడుతూ.. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, బుధవారం జాగింగ్ నుంచి తిరిగి వచ్చాక కాస్త అలసటగా ఉండటంతో కోవిడ్ పరీక్ష చేయించుకున్నానని, పాజిటివ్ రావడంతో ఆశ్యర్యపోయానని పేర్కొన్నారు. కాగా, అథ్లెట్‌గా ఎంతో ఖ్యాతి గడించిన మిల్కా సింగ్.. ఒలింపిక్ పతకం మాత్రం సాధించలేకపోయారు. కెరీర్లో ఎన్నో మరపురాని మారథాన్లలో పాల్గొన్న అతనికి.. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల రేస్ చాలా ప్రత్యేకం. ఈ పోటీల్లో అతను నాలుగో స్థానంలో నిలిచినా.. ట్రాక్‌పై అతను చూపిన తెగువతో భారతీయుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ రేస్ ద్వారా అతను ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరిన తొలి భారతీయుడిగా నిలిచాడు. అలాగే ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్లో బంగారు పతకం సాధించిన ఏకైక అథ్లెట్ కూడా అతనే కావడం విశేషం. చదవండి: టీమిండియా కోచ్‌గా ద్రవిడ్, కెప్టెన్‌గా ధవన్..? -
పతకానికి చేరువై.. అంతలోనే దూరమై..
రెప్పపాటులో... వెంట్రుకవాసి తేడాతో... అర క్షణంలో...ఈ మాటలు అప్పుడప్పుడు అలవోకగా మనం వాడేస్తుంటాం. కానీ వాస్తవంలో వచ్చే సరికి వీటి విలువ ఎంత? ఇదే ప్రశ్న మిల్కా సింగ్‌ను అడిగితే ‘జీవిత కాలమంత’ అనే సమాధానం వస్తుందేమో! ఎందుకంటే ఒలింపిక్స్‌లో పతకం సాధించేందుకు చేరువై... అంతలోనే దూరమైన విషాదానికి నిలువెత్తు నిదర్శనం మిల్కా సింగ్. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగులో మిల్కా నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం కోల్పోయిన క్షణాన్ని భారత అభిమానులు మరచిపోలేరు. ఆ తర్వాత ఒలింపిక్స్‌లో మన అథ్లెట్ల ప్రదర్శనను బట్టి చూస్తే... పతకం దక్కకపోయినా నాటి ఘటనకు భారత క్రీడా చరిత్రలో ఉన్న ప్రాతినిధ్యం ఏమిటో అర్థమవుతుంది. ఆ జ్ఞాపకాలన్నీ... రోమ్ ఒలింపిక్స్‌కు ముందే మిల్కా సింగ్ భారత అథ్లెటిక్స్‌కు సంబంధించి తనదైన ప్రత్యేక ముద్ర వేశాడు. దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో కళ్ల ముందే తల్లిదండ్రులను కోల్పోవడంతో పాటు అనేక కష్టాలను ఎదుర్కొన్న మిల్కా ఎంతో పోరాటంతో వాటిని అధిగమించాడు. భారత సైన్యంలో చేరడంతో అతని జీవితానికి ఒక దిశ లభించింది. అక్కడే అథ్లెట్‌గా పాఠాలు నేర్చుకున్న అతను కొన్నాళ్లకు పూర్తి స్థాయిలో 400 మీటర్ల పోటీని తన ప్రధాన ఈవెంట్‌గా మార్చుకున్నాడు. 1958 కటక్ జాతీయ క్రీడల్లో 200 మీ., 400 మీ. విభాగాల్లో స్వర్ణాలతో వెలుగులోకి వచ్చిన మిల్కా... అదే ఏడాది టోక్యోలో జరిగిన ఆసియా క్రీడల్లో ఈ రెండు విభాగాల్లోనే స్వర్ణ పతకాలు గెలుచుకొని తన సత్తా చాటాడు. కొద్ది రోజులకే కార్డిఫ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా 400 మీటర్ల పరుగు (440 గజాలు)లో అగ్ర స్థానంలో నిలవడంతో మిల్కా పేరు మారుమోగిపోయింది. దాంతో దేశవ్యాప్తంగా అతనికి పెద్ద సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. ఎక్కడకు వెళ్లినా మిల్కాకు జనం బ్రహ్మరథం పట్టారు. అయితే దురదృష్టవశాత్తూ ఒలింపిక్ వేదికకు వచ్చే సరికి అతను అంచనాలు అందుకోలేకపోయారు. ఫలితంగా 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో మిల్కా 200 మీ., 400 మీ. రెండింటిలో పాల్గొన్నా... హీట్స్ దశను దాటి ముందుకు వెళ్లలేకపోయాడు. గుండె పగిలిన క్షణం... గత ఒలింపిక్స్ నుంచి పాఠాలు నేర్చుకున్న మిల్కా నాలుగేళ్ల పాటు తీవ్రంగా శ్రమించాడు. మెల్బోర్న్లో 400 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన చార్లెస్ జెన్కిన్స్ను కలిసి తన గురించి చెప్పుకున్నాడు. అతని నుంచి ప్రాక్టీస్‌కు సంబంధించి కొత్త తరహా టెక్నిక్‌లు, శిక్షణలో పద్ధతుల గురించి తెలుసుకున్నాడు. దాంతో 1960 రోమ్‌లో పోటీలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమై వచ్చాడు. ఒలింపిక్స్‌కు ముందు సన్నాహకంగా జరిగే రేసులలో అతను అద్భుతమైన టైమింగ్‌లు నమోదు చేయడంతో మళ్లీ అందరి దృష్టి మిల్కాపై పడింది. హీట్స్‌లో, క్వార్టర్ ఫైనల్లో, సెమీ ఫైనల్లో మెరుగైన ప్రదర్శనతో మిల్కా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. గన్ పేలింది... పరుగు ప్రారంభమైంది. ఐదో లేన్‌లో ఉన్న మిల్కా వేగంగా దూసుకుపోయాడు. ఒటిస్ డేవిస్ తర్వాత రెండో స్థానంలో అతను కొనసాగుతున్నాడు. 100 మీ., 200 మీ., 250 మీటర్లు ముగిశాయి. మిల్కాకు మంచి అవకాశం కనిపించింది. అంతలో అనూహ్యం జరిగింది! తన పోటీదారులు ఎక్కడ ఉన్నారో అన్నట్లుగా పరుగెడుతూనే లిప్తకాలం పాటు అతని దృష్టి పక్కకు పడింది. అంతే... ఆ అర క్షణంలోనే వేగం మందగించింది. ఈ చిన్న పొరపాటు మిల్కాసింగ్‌కు జీవిత కాలం బాధను మిగిల్చింది. అప్పటి వరకు వెనుకంజలో ఉన్న ఇద్దరు అథ్లెట్లు దూసుకుపోయారు. కోలుకొని శక్తిమేరా పరుగెత్తేలోపే రేసు ముగిసిపోయింది. ఫలితంగా నాలుగో స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఒటిస్ డేవిస్ (అమెరికా –44.9 సె.), కార్ల్ కాఫ్ మన్ (జర్మనీ– 44.9 సె.) తొలి రెండు స్థానాల్లో నిలవగా... కాంస్యం సాధించిన మాల్కమ్ స్పెన్స్ (దక్షిణాఫ్రికా – 45.5 సె.)కు మిల్కా సింగ్ (45.6 సె.) మధ్య తేడా చూస్తే ఆ బాధ ఏమిటో అర్థమవుతుంది. 38 ఏళ్ల పాటు... ‘అధికారికంగా ఫలితాలు ప్రకటించక ముందే నేను చేసిన తప్పేమిటో నాకు అర్థమైపోయింది. 250 మీటర్లు అద్భుతంగా పరుగెత్తిన తర్వాత నెమ్మదించడం నాకు చేటు చేసింది. నేను ఆ వ్యత్యాసాన్ని సరి చేయలేకపోయాను. మా అమ్మానాన్నలు చనిపోయిన తర్వాత నేను ఇంతగా ఎప్పుడూ బాధపడలేదు. కొన్ని రోజుల పాటు ఏడుస్తూనే ఉండిపోయాను’ అని మిల్కా సింగ్ స్వయంగా చెప్పుకున్నాడు. మ్యాన్యువల్‌గా లెక్కించిన టైమింగ్‌లను ముందుగా ఈ ఈవెంట్లో ఫలితాల సమయంలో ప్రకటించారు. కానీ ఎలక్ట్రానిక్ స్కోరు బోర్డు ప్రకారం ఆ తర్వాత వాటిని సవరించారు. దీని ప్రకారం మిల్కా 400 మీటర్ల టైమింగ్ అధికారికంగా 45.73 సెకన్లుగా నమోదైంది. భారత్ తరఫున ఇదే అత్యుత్తమ ప్రదర్శన కాగా... 1998లో పరమ్‌జీత్ సింగ్ 45.70 సెకన్లలో (జాతీయ చాంపియన్‌షిప్‌లో) రేసు పూర్తి చేయడంతో మిల్కా రికార్డు కనుమరుగైంది. అయితే ఇన్నేళ్ల ఒలింపిక్ చరిత్రలో భారత అథ్లెట్లు ఎవరూ దీనికి సమమైన ప్రదర్శనను ఇవ్వలేకపోయారు. ఒక్క పతకం గెలుచుకోలేకపోగా... మిల్కా తరహాలో కనీసం నాలుగో స్థానం వరకు కూడా వెళ్లలేకపోయారు. ఇది చాలు మిల్కా ఘనత ఏమిటో చెప్పడానికి. –సాక్షి క్రీడా విభాగం -
ఉత్తమ క్రీడాకారుడిగా జీతూ రాయ్
న్యూఢిల్లీ : ఈ ఏడాది టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డుల్లో... మేటి షూటర్ జీతూ రాయ్ ఉత్తమ క్రీడాకారుడిగా నిలిచాడు. ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్‌కు ‘జీవితకాల సాఫల్య పురస్కారం’ లభించింది. వివిధ క్రీడాంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అథ్లెట్లకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. యూత్ ఐకాన్ పురస్కారాన్ని సైనా నెహ్వాల్ గెలుచుకోగా, బ్యాడ్మింటన్‌లో పి.వి.సింధు, టెన్నిస్‌లో సానియా మీర్జాలు ఉత్తమ క్రీడాకారిణిలుగా ఎంపికయ్యారు. -
ఫిల్మ్‌ఫేర్‌లో ‘మిల్కా’ జోరు
ముంబై: ‘ఫ్లయింగ్ సిఖ్’ మిల్కాసింగ్ జీవితం ఆధారంగా వచ్చిన బాలీవుడ్ సినిమా ‘భాగ్ మిల్కా భాగ్’కు 59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల పంటపండింది. 2013కు గానూ ఉత్తమ చిత్రం, నటుడు, దర్శకత్వం, గీతం, ప్రొడక్షన్ డిజైన్, దుస్తులు విభాగాల్లో ఆ చిత్రం అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ నటి అవార్డును ‘గలియోంకా రాస్లీలా రామ్‌లీలా’ చిత్రానికి గానూ దీపికా పదుకొణే దక్కించుకుంది. తమిళ నటుడు ధనుష్ ఉత్తమ కొత్త నటుడి అవార్డు గెలుచుకున్నాడు. అవార్డుల వివరాలు - ఉత్తమ నటుడు: ఫర్హాన్ అక్తర్ (భాగ్ మిల్కా భాగ్) - ఉత్తమ నటి: దీపికా పదుకొణే (గలియోంకా రాస్లీలా రామ్‌లీలా) - ఉత్తమ దర్శకుడు: రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా (భాగ్ మిల్కా భాగ్) - సోనీ ట్రెండ్ సెట్టర్ ఆఫ్ ది ఇయర్: చెన్నై ఎక్స్‌ప్రెస్ - జీవితసాఫల్య అవార్డు: తనూజ - ఉత్తమ గాయకుడు: అర్జిత్ సింగ్ (తుమ్హీ హో-ఆషిఖీ-2) - ఉత్తమ గాయని: మోనాలీ ఠాకూర్ (సావర్‌లూన్- లుటేరా) - ఉత్తమ గీతం: ప్రశూన్ జోషి (జిందా- భాగ్ మిల్కా భాగ్) - బెస్ట్ వీఎఫ్ఎక్స్: టాటా ఎలిక్సిస్ (ధూమ్-3) ఇక్కడి వైఆర్ఎఫ్ స్టూడియోలో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఆదివారం సోనీ టీవీ ప్రసారం చేయనుంది. -
ఆప్ లో చేరిన మిల్కాసింగ్ భార్య, కూతురు
చంఢీగఢ్ : భారత అథ్లెట్ దిగ్గజం మిల్కాసింగ్ భార్య నిర్మలా కౌర్ మరియు కూతురు మోనా సింగ్ లు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ మేరకు వారు పార్టీలో చేరేందుకు అవసరమైన సన్నాహకాలను పూర్తి చేశారు. కాగా మిల్కాసింగ్ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. దీనికి సంబంధించి మీడియాతో మాట్లాడిన ఆయన. అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ విధానాలు, లక్ష్యాలు నచ్చడంతో వారు పార్టీలో చేరారన్నారు. వారి నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని తెలిపారు. తాను మాత్రం ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదన్నారు. భారత్ కు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ ప్రధానులుగా ఉన్న సమయంలో పార్టీలో చేరాలనుకున్నా, అప్పుడు పరిస్థితులు అనుకూలించలేదన్నాడు. తన భార్య, కూతుర్ని రాజకీయాల్లో రాకుండా అడ్డుకోలేనని, సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిపక్వత వారికి ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భారత్ తరుపున మిల్కాసింగ్ మూడు సార్లు ఒలింపిక్స్ కు ప్రాతినిధ్యం వహించాడు.1958 నుంచి 1962 మధ్య జరిగిన ఆసియా గేమ్స్ లో నాలుగు బంగారు పతకాలు సాధించి భారత్ కీర్తిని ప్రపంచానికి తెలియజేశాడు.