
సాక్షి, అమరావతి : పరుగుల వీరుడు, ఫ్లయింగ్ సిఖ్‌గా ఖ్యాతిగాంచిన భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మిల్కాసింగ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో మిల్కాసింగ్ చెరగని ముద్ర వేశారని, ఆయన వ్యక్తిత్వం భావితరాలకు ఆదర్శమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
దేశం విశిష్ట క్రీడాకారుడిని కోల్పోయింది: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
స్ప్రింట్ దిగ్గజం మిల్కా సింగ్ మృతిపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోవిడ్ అనంతర సమస్యల కారణంగా దిగ్గజ క్రీడాకారుడు మృతి చెందటం బాధాకరమన్నారు. మిల్కా బలమైన వ్యక్తిత్వం భావి తరాలకు ఆదర్శమని, దేశం విశిష్ట క్రీడాకారుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. కోట్లాది మంది హృదయాల్లో మిల్కా ప్రత్యేక స్థానం పొందారన్నారు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో మిల్కా చెరగని ముద్ర వేశారన్నారు.