గతంలో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన స్టార్క్ (PC: BCCI/IPL)
Mitchell Starc Eyes IPL Return In 2024: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పునరాగమనం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఐపీఎల్-2024కు తప్పక అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు.
ఆర్సీబీకి ప్రాతినిథ్యం
కాగా 2014 ఎడిషన్ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన స్టార్క్.. తొలుత ఢిల్లీతో మ్యాచ్‌లో ఒక వికెట్ తీశాడు. మరుసటి ఏడాదిలోనే ఐపీఎల్ నుంచి వైదొలిగిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. మొత్తంగా ఈ టీ20 లీగ్‌లో 27 మ్యాచ్‌లలో కలిపి 34 వికెట్లతో రాణించాడు.
ఎనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్ రీఎంట్రీ
కాగా, 2018లో కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని కొనుగోలు చేసినప్పటికీ గాయం కారణంగా ఆడలేకపోయాడు. ఆ తర్వాత అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కే తన ప్రాధాన్యం అంటూ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలో సుమారు ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు స్టార్క్ సిద్ధపడుతున్నాడు.
అయితే, దీని వెనుక పెద్ద మాస్టర్ ప్లానే ఉంది మరి! టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా స్టార్క్ మళ్లీ క్యాష్ రిచ్ లీగ్‌లోకి అడుగుపెడుతున్నాడు. అతడే స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఈ మేరకు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ..
అసలు విషయం అదీ!
‘‘ఇప్పటికి ఎనిమిదేళ్లు గడిచాయి. వచ్చే ఏడాది కచ్చితంగా తిరిగి వస్తా. టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఇది నాకెంతగానో ఉపయోగపడుతుంది. ఐపీఎల్‌లో ఆడేందుకు ఆసక్తి చూపడానికి ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు. ఐసీసీ టోర్నీకి ముందు ఇలాంటి అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు’’ అని మిచెల్ స్టార్క్ పేర్కొన్నాడు.
డబ్ల్యూపీఎల్‌లో కెప్టెన్‌గా స్టార్క్ భార్య
కాగా ఆస్ట్రేలియా తరఫున ఇప్పటి వరకు 82 టెస్టులు, 110 వన్డేలు, 58 టీ20లు ఆడిన స్టార్క్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 333, 219, 73 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. స్టార్క్ భార్య, ఆసీస్ వికెట్ కీపర్ భార్య అలిసా హేలీ వుమెన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఉన్న విషయం తెలిసిందే.
మహిళా క్రికెట్‌ను అభివృద్ధి చేసే క్రమంలో బీసీసీఐ ప్రవేశపెట్టిన ఈ టీ20 లీగ్‌లో యూపీ వారియర్స్ జట్టుకు ఆమె కెప్టెన్‌గా ఎంపికైంది. రూ. 70 లక్షలతో యూపీ ఫ్రాంఛైజీ హేలీని కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే... ప్రపంచకప్-2023 టోర్నీకి ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో మిచెల్ స్టార్క్ స్థానం దక్కించుకున్నాడు.
చదవండి: సిగ్గుపడు రోహిత్! నువ్వసలు కెప్టెన్‌వేనా?.. వాళ్లకు ఉన్నపాటి బుద్ధి నీకు లేదు!
వరల్డ్‌కప్ తర్వాత ద్రవిడ్ బై.. బై! నాడు అతడు ‘బలిపశువు’.. కొత్త కోచ్‌గా అతడే?
Comments
Please login to add a commentAdd a comment