భర్త అడుగుజాడల్లో భార్య అనే నానుడును నిజజీవితంలో మనం తరుచూ వింటుంటాం. ఈ మాటను క్రీడాజీవితంలో ఫాలో అయ్యి చూపించింది ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ అలైసా హీలీ. ఆస్ట్రేలియా పురుషుల జట్టు స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ భార్య అయిన హీలీ.. ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళల టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. హీలీ క్రికెట్‌కు సంబంధించిన ఓ విషయంలో భర్త స్టార్క్ అడుగుజాడల్లో నడిచింది. యాదృచ్చికంగా చోటు చేసుకున్న ఈ సందర్భం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.
ఏం జరిగిందంటే.. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 2013లో భారత్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ మ్యాచ్ స్టార్క్ కెరీర్‌లో తొమ్మిదవది. యాదృచ్చికంగా స్టార్క్ భార్య అలైసా హీలీ కూడా తన తొమ్మిదవ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల వద్దనే ఔటైంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో హీలీ తృటిలో సెంచరీ చేజార్చుకుని బాధతో పెవిలియన్‌కు చేరింది. అయితే తాను భర్త అడుగుజాడల్లోనే నడుస్తున్నానన్న విషయం హీలీకి తెలియకపోయి ఉండవచ్చు. తొమ్మిదో టెస్ట్‌లో భార్యా భర్తలు 99 పరుగుల వద్ద ఔట్ కావడం ఆసక్తికరంగా మారింది.
కాగా, సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో లిచ్‌ఫీల్డ్ (4), ఎల్లిస్ పెర్రీ (3), తమిళ మెక్‌గ్రాత్ (0) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా.. బెత్ మూనీ (78), అలైసా హీలీ (99), సథర్‌ల్యాండ్ (54 నాటౌట్) అర్దసెంచరీలు చేసి ఆసీస్‌ను ఆదుకున్నారు. సౌతాఫ్రికా మహిళల జట్టుకు ఇది తొలి టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment