మెల్‌బోర్న్: అత్యంత విషాదకర సమయంలోనూ టీమిండియా యువ పేసర్ బౌలర్, హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్ జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించాడు. కన్నతండ్రిని కోల్పోయిన బాధను పంటిబిగువన భరిస్తూ ఆసీస్ పర్యటను దిగ్విజయంగా ముగించేందుకే మొగ్గుచూపాడు. జాతీయ జట్టుకు ఎంపికై తండ్రి కలను నెరవేర్చిన అతడు.. క్రికెటర్‌గా రాణించాలన్న ఆయన ఆశ నెరవేర్చేందుకు ఆస్ట్రేలియాలో ఉండేందుకు మొగ్గుచూపాడు. కాగా వన్డే, టీ20, టెస్టు సిరీస్ నిమిత్తం టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిరాజ్ శుక్రవారం చేదు వార్త వినాల్సి వచ్చింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడి తండ్రి తండ్రి మొహమ్మద్ గౌస్ (53) నిన్న మరణించారు.(చదవండి: క్రికెటర్ సిరాజ్ తండ్రి కన్నుమూత)
ఈ నేపథ్యంలో విషాదకర సమయంలో కుటుంబ సభ్యుల వద్ద సమయం గడిపేందుకు వీలుగా సిరాజ్‌ను భారత్‌కు పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సిద్ధమైంది. ఒకవేళ అతడు ఇంటికి వెళ్లాలనుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని పేర్కొంది. ఈ విషయం గురించి సిరాజ్‌తో చర్చించగా.. అతడు జట్టుతోనే ఉంటానని చెప్పినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. సిరాజ్ ప్రస్తుతం అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడని, ఈ కష్టకాలంలో తన బాధను పంచుకుంటూ, అతడికి అన్నివిధాలుగా అండగా ఉంటామని తెలిపింది. ఈ సమయంలో సిరాజ్, అతడి కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించవద్దని మీడియాకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బీసీసీఐ గౌరవ కార్యదర్శి జై షా పేరిట శనివారం ప్రకటన విడుదల చేశారు. (చదవండి: హైదరాబాద్‌లో ప్రతీ పేపర్‌లో నీ ఫోటోనే: సిరాజ్ తండ్రి)
Comments
Please login to add a commentAdd a comment