
టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో మొదటి ఐదు మ్యాచ్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా తిలక్ వర్మ రికార్డులకెక్కాడు. ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20లో 27 పరుగులు చేసిన తిలక్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. తిలక్ వర్మ తన ఐదు టీ20 మ్యాచ్‌ల్లో 173 పరుగులు సాధించాడు.
ఈ క్రమంలో మరో భారత ఆటగాడు దీపక్ హుడా(172)ను వర్మ అధిగమించాడు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్(179) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఇక విండీస్ టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన 20 ఏళ్ల తిలక్ వర్మ.. ఈ సిరీస్ అసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.
ఈ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన వర్మ.. 173 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విండీస్ చేతిలో 8 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2తో భారత్ కోల్పోయింది. 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో విండీస్ చేతిలో భారత్ ఓడిపోవడం ఇదే తొలిసారి.
ఇక విండీస్ పర్యటన ముగియడంతో భారత్ ఐర్లాండ్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా అతిథ్య ఐరీష్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తలపడనుంది. డబ్లిన్ వేదికగా ఆగస్టు 18న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
చదవండి: ఓడిపోవడం మంచిదే.. మా బాయ్స్ అద్భుతం! చాలా సంతోషంగా ఉన్నా: హార్దిక్