సీఎస్‌కే హెడ్‌కోచ్‌ పదవి.. రేసులో ఊహించని పేర్లు! | MS Dhoni, Rahul Dravid Lead Race To Replace Stephen Fleming As CSK Head Coach, More Details Inside | Sakshi
Sakshi News home page

సీఎస్‌కే హెడ్‌కోచ్‌ పదవి.. రేసులో ఊహించని పేర్లు!

Jul 14 2026 7:35 AM | Updated on Jul 14 2026 10:07 AM

MS Dhoni-Rahul Dravid-Others-Frontline Race For CSK Coach

సీఎస్‌కేకు 18 ఏళ్ల పాటు కోచ్‌గా పనిచేసిన స్టీఫెన్ ప్లెమింగ్ ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించాడు. దీంతో ఐదుసార్లు చాంపియన్ అయిన సీఎస్‌కేకు ఇప్పుడు కొత్త కోచ్ అవసరం ఏర్పడింది. ప్లెమింగ్ స్థానంలో హేమంగ్ బదానీ కొత్త కోచ్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. 

అయితే తాజాగా సీఎస్‌కే కోచ్‌ పదవి రేసులో ఊహించని పేర్లు వినిపిస్తున్నాయి. ఎంఎస్‌ ధోనితో పాటు రాహుల్‌ ద్రవిడ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీఎస్‌కేతో 18 ఏళ్లుగా ప్రయాణం కొనసాగిస్తున్న మాస్టర్ మైండ్ ఎంఎస్ ధోని హెడ్‌కోచ్‌గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు సీఎస్‌కే జట్టులో సంజూ శాంసన్ రావడంతో గతంలో రాజస్తాన్ రాయల్స్‌కు కోచ్‌గా పనిచేసిన మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పేరు కూడా ఫ్రంట్‌లైన్‌లో వినిపిస్తోంది. ఇదే విషయమై సీఎస్‌కే ఎండీ కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చాడు. 

'హేమంగ్ బదానీ మా పరిశీలనలో ఉన్న మాట నిజమే కానీ, ఇంకా అతడి పేరు ఖరారు చేయలేదు. మా దృష్టికి మరికొన్ని పేర్లు కూడా వచ్చాయి. అవన్నీ పరిశీలించి ఒక నిర్ణయానికి వస్తాం’ అని పేర్కొన్నారు. దీంతో సీఎస్‌కేకు కొత్త కోచ్‌గా ఎవరు రానున్నారనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఐపీఎల్ సీజన్ ఆరంభం నుంచి సీఎస్‌కే విజయవంతమైన జట్టుగా పేరు సంపాదించింది. 

ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు ఫైనల్ (10 సార్లు) చేరిన జట్టుగా నిలిచిన సీఎస్‌కే ఐదుసార్లు విజేతగా నిలిచింది. అయితే గత మూడేళ్లుగా సీఎస్‌కే ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమవుతూ వస్తోంది. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత సీఎస్‌కే మళ్లీ గాడిన పడలేదు. ఈ సీజన్‌లో మోస్తరు విజయాలతో పర్వాలేదనిపించినప్పటికీ చాంపియన్ ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. 

ఇక ఆరంభం నుంచి జట్టులో కొనసాగుతున్న ఎంఎస్ ధోనికి కోచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సీఎస్‌కే బ్రాండ్ విలువ పెరగడం వెనుక ధోని కీలకపాత్ర వహించడంతో వచ్చే సీజన్‌లోపు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి కోచ్ అవతారంలోకి మారే అవకాశం కనిపిస్తోంది. ఇక రాజస్తాన్ రాయల్స్ మెంటార్ కమ్ కోచ్‌గా సక్సెస్ చూసిన రాహుల్ ద్రవిడ్‌కు కూడా అవకాశముంది. 

భవిష్యత్తులో శాంసన్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉండడంతో ద్రవిడ్ సీఎస్‌కే కోచ్‌గా వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక వీరిద్దరితో పాటు హేమంగ్ బదానీ, రవిచంద్రన్ అశ్విన్‌, దినేశ్ కార్తిక్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక సీఎస్‌కేతో 18 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు స్టీఫెన్ ప్లెమింగ్ ప్రకటించినప్పటికీ, గత మూడేళ్లుగా జట్టు వైఫల్యం కారణంగానే ప్లెమింగ్‌ను సీఎస్‌కేనే తప్పించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement