![Namibian Allrounder David Wiese Retires From International Cricket](/styles/webp/s3/article_images/2024/06/16/Untitled-16_1.jpg.webp?itok=c2upMi3l)
నమీబియా స్టార్ ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో ఇంగ్లండ్ చేతిలో తన జట్టు ఓటమి అనంతరం వీస్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. 39 ఏళ్ల వీస్.. 2013లో సౌతాఫ్రికా తరఫున అరంగేట్రం చేసి 2016 వరకు ఆ జట్టు తరఫున ఆడాడు. అనంతరం వీస్ తన తండ్రి జన్మస్థలమైన నమీబియాకు వలస వెళ్లి ఆ దేశ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు (2021 ఆగస్ట్ నుంచి).
![](/sites/default/files/inline-images/Untitled-14.jpg)
2016 టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించిన వీస్.. 2021, 2022 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో నమీబియా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. వీస్ నమీబియా తరఫున ఆడుతూ ఆ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఐసీసీ టోర్నీల్లో నమీబియా సాధించిన మొట్టమొదటి విజయంలో (2021 టీ20 వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్‌పై) వీస్ కీలకపాత్ర పోషించాడు.
రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన వీస్ తన 11 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 15 వన్డేలు, 51 టీ20లు ఆడి 73 వికెట్లు పడొట్టాడు. కుడి చేతి వాటం బ్యాటర్ అయిన వీస్ తన అంతర్జాతీయ కెరీర్‌లో దాదాపు 1000 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ద సెంచరీలు ఉన్నాయి.
అంతర్జాతీయ కెరీర్‌తో పోలిస్తే ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ కెరీర్‌లో ఘనమైన రికార్డు కలిగిన వీస్.. 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 162 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడి దాదాపు 10000 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 54 అర్దసెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో వీస్ ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఏ ఫార్మాట్లలో కలిపి 490 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లోనూ వివిధ ఫ్రాంచైజీలకు ఆడిన వీస్.. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌ల్లో ఆడుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment