
సాక్షి, వరంగల్: జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో రెండో రోజు ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ కె.నరేశ్ కుమార్ అదరగొట్టాడు. పురుషుల 100 మీటర్ల విభాగంలో నరేశ్ చాంపియన్‌గా అవతరించాడు. హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో నరేశ్ 100 మీటర్లను 10.30 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. స్వర్ణం సాధించే క్రమంలో నరేశ్ కొత్త మీట్ రికార్డు సాధించాడు.
2001లో 10.37 సెకన్లతో అనిల్ కుమార్ నెలకొల్పిన మీట్ రికార్డును నరేశ్ బద్దలు కొట్టాడు. అమ్లాన్ బొర్గోహైన్ (అస్సాం; 10.34 సెకన్లు) రజతం, హర్జీత్ సింగ్ (సర్వీసెస్; 10.34 సెకన్లు) కాంస్యం సాధించారు. ఇద్దరూ ఒకేసారి గమ్యం చేరినా ఫొటో ఫినిష్‌లో హర్జీత్‌కంటే ముందుగా అమ్లాన్ లక్ష్యాన్ని చేరినట్లు తేలింది. 100 మీటర్ల ఒకే రేసులో ముగ్గురు భారత్ అథ్లెట్స్ 10.35 సెకన్ల సమయం నమోదు చేయడం ఇదే ప్రథమం.
అంతేకాకుండా నరేశ్ ప్రదర్శన 100 మీటర్ల విభాగంలో భారత్ నుంచి టాప్–5లో ఉండటం విశేషం. కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల నరేశ్‌కు జాతీయస్థాయిలో రెండేళ్లలో ఇది రెండో స్వర్ణ పతకం. గత ఏడాది కర్ణాటకలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీ క్రీడల్లో గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించిన నరేశ్ పసిడి పతకం గెల్చుకున్నాడు. నరేశ్ ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని రేపల్లె సాధన డిగ్రీ కాలేజీలో బీఏ కోర్సు అభ్యసిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment