మాజీ టెన్నిస్ క్రీడాకారిణి హిమాని మోర్‌తో వివాహం
న్యూఢిల్లీ: భారత దిగ్గజ అథ్లెట్, స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఓ ఇంటివాడయ్యాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో జాతీయ మాజీ టెన్నిస్ క్రీడాకారిణి హిమాని మోర్‌తో రెండు రోజుల క్రితం నీరజ్ చోప్రా వివాహం జరిగింది. ఈ విషయాన్ని ఆదివారం నీరజ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. పెళ్లి ఫొటోలను జతచేస్తూ ‘జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించాను’ అని పోస్ట్ చేశాడు.
హరియాణాకు చెందిన 27 ఏళ్ల నీరజ్ చోప్రా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించాడు. అంతేకాకుండా 2023 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, 2024 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం... 2018 జకార్తా, 2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో... 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు. 2016లో ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన నీరజ్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.
నీరజ్ భార్య హిమాని మోర్ ప్రస్తుతం అమెరికాలోని న్యూ హాంప్‌షైర్ రాష్ట్రంలోని ఫ్రాంక్లిన్ పియర్స్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. 2012లో అండర్–14 జూనియర్ ఫెడ్ కప్‌లో భారత జట్టుకు ఆడిన హిమాని... 2017లో చైనీస్ తైపీలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లోనూ పోటీపడింది.
అఖిల భారత టెన్నిస్ సంఘం నిర్వహించిన టోర్నీలలో కూడా ఆడింది. 2018లో ఆమె సింగిల్స్‌లో అత్యుత్తమంగా 42వ ర్యాంక్‌లో, డబుల్స్‌లో 27వ ర్యాంక్‌లో నిలిచింది. ఒకవైపు విద్యాభ్యాసం చేస్తూనే మరోవైపు ఆమె ప్రస్తుతం మసాచుసెట్స్‌లోని ఆమ్‌హెర్‌స్ట్ కాలేజీ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment