న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ కార్యకలాపాల్లో కదలిక మొదలైంది. యూఏఈ వేదికగా మూడు జట్లతో మహిళల చాలెంజర్ సిరీస్ జరుగనున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మహిళల క్రికెట్ జట్టుకు నూతన సెలక్షన్ కమిటీని నియమించింది. ఈ కమిటీకి 90వ దశకంలో విశేషంగా రాణించిన భారత మాజీ క్రికెటర్, మేటి లెఫ్టార్మ్ స్పిన్నర్ నీతూ డేవిడ్ చైర్మన్‌గా వ్యవహరించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా శనివారం ప్రకటించారు. మొత్తం ఐదుగురు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో నీతూతో పాటు మిథు ముఖర్జీ, రేణు మార్గరెట్, ఆరతి వైద్య, వెంకటాచెర్ కల్పన ఇతర సభ్యులు. హేమలత కళ ఆధ్వర్యంలోని గత సెలక్షన్ కమిటీ నాలుగేళ్ల పదవీకాలం ఈ ఏడాది మార్చితో ముగిసింది. కరోనాతో క్రికెట్ కార్యకలాపాలు ఆగిపోవడంతో కొత్త కమిటీని ఎంపిక చేసేందుకు ఆలస్యమైందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
‘సీనియారిటీ ప్రాతిపదికగా నీతూ డేవిడ్‌ను కొత్త ప్యానల్ చైర్మన్‌గా ఎంపిక చేశాం. మహిళల క్రికెట్‌లో ఆమె దిగ్గజం. ఆమె నెలకొల్పిన ఘనతల ప్రకారం చూస్తే ఈ ఎంపికను ఎవరూ ప్రశ్నించరనే అనుకుంటున్నాం. నీతూ మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ కాగా, భారత్ తరఫున 100 వికెట్లు దక్కించుకున్న తొలి క్రికెటర్’ అని జై షా ఆమె ఘనతల్ని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 43 ఏళ్ల నీతూ భారత్ తరఫున 10 టెస్టుల్లో 41 వికెట్లు, 97 వన్డేల్లో 141 వికెట్లు పడగొట్టింది. 1995 జంషెడ్‌పూర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టి భారత్ తరఫున ప్రపంచ రికార్డును నెలకొల్పింది. కమిటీలోని ఇతర సభ్యులైన ఆరతి వైద్య (మహారాష్ట్ర; 50 ఏళ్లు) 3 టెస్టులు, 6 వన్డేలు... రేణు (పంజాబ్; 45 ఏళ్లు) 5 టెస్టులు, 23 వన్డేలు... కల్పన (కర్ణాటక; 59 ఏళ్లు) 3 టెస్టులు, 8 వన్డేలు... మిథు ముఖర్జీ (బెంగాల్; 55 ఏళ్లు) 4 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment