విండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ టీ20ల్లో ఓ అరుదైన సిక్సర్ల రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భీకర ఫామ్‌లో ఉన్న పూరన్.. టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో 150 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో నిన్న (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్‌లో ఏడు సిక్సర్లు బాదిన పూరన్ ఈ ఏడాది టీ20 ఫార్మాట్‌లో 63 ఇన్నింగ్స్‌లు ఆడి 151 సిక్సర్లు బాదాడు. పూరన్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఇప్పటివరకు 21 సిక్సర్లు బాదాడు. ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టీ20 సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో పూరన్ తర్వాతి స్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 2015లో 135.. 2012లో 121 సిక్సర్లు బాదాడు.
పేట్రియాట్స్‌తో మ్యాచ్‌లో 43 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 93 పరుగులు చేసిన పూరన్.. మరో అరుదైన ఘనత కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. పూరన్ ఈ ఏడాది టీ20ల్లో 2022 పరుగులు చేశాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మొహమ్మద్ రిజ్వాన్ పేరిట ఉంది. రిజ్వాన్ 2021లో 48 ఇన్నింగ్స్‌ల్లో 2036 పరుగులు చేశాడు. పూరన్ తర్వాతి స్థానంలో అలెక్స్ హేల్స్ ఉన్నాడు. హేల్స్ 2022లో 61 మ్యాచ్‌లు ఆడి 1946 పరుగులు చేశాడు.
సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ (పూరన్ జట్టు) 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఆండ్రీ ఫ్లెచర్ (61 బంతుల్లో 93; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), కైల్ మేయర్స్ (30 బంతుల్లో 60; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలతో చెలరేగారు.
అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించడంతో 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. పూరన్‌తో పాటు జేసన్ రాయ్ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.
కాగా, ఈ మ్యాచ్ గెలుపుతో సంబంధం లేకుండా నైట్‌రైడర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. నైట్‌రైడర్స్‌తో పాటు సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్, బార్బడోస్ రాయల్స్ ఈ సీజన్ ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఈ సీజన్ నుంచి ఇదివరకే ఎలిమినేట్ అయ్యాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు అక్టోబర్ 1, 2, 4 తేదీల్లో జరుగనున్నాయి. అక్టోబర్ 6న ఫైనల్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment