పారిస్: 100 విజయాలు, కేవలం 2 పరాజయాలు, 13 టైటిల్స్... ఫ్రెంచ్ ఓపెన్‌లో రాఫెల్ నాదల్ సాధించిన అత్యద్భుత ఘనత ఇది. ఎర్రమట్టిపై తనకే సాధ్యమైన జోరును కొనసాగించి మరో టోర్నీ గెలిస్తే అతను టెన్నిస్‌లో కొత్త చరిత్ర సృష్టిస్తాడు. 20 గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలతో ఫెడరర్‌గా సమంగా అగ్రస్థానంలో ఉన్న నాదల్...21వ టైటిల్‌తో ఒక్కడే శిఖరాన నిలుస్తాడు. అయితే తనకు అచ్చొచ్చిన మైదానంలో కూడా ఓటమి ఎదురు కావచ్చని, ఆటలో ఎక్కడా, ఎవరూ అజేయులు కాదని నాదల్ వ్యాఖ్యానించాడు.
‘కొద్ది రోజుల క్రితమే క్లే కోర్టుపైనే మాంటెకార్లో, మాడ్రిడ్ టోర్నీలలో నేను ఓడాను. రోలండ్ గారోస్‌లో మాత్రం ఓడిపోరాదని కోరుకుంటున్నా. నా శక్తి మేరకు పోరాడటమే నేను చేయగలిగింది’ అని చెప్పాడు. జూన్ 3న 35వ పుట్టిన రోజు జరుపుకోనున్న నాదల్... ఇంత కాలం ఆడగలనని పదేళ్ల క్రితం అనుకోలేదన్నాడు. ‘పదేళ్ల క్రితం నేను వరుస గాయాలతో బాధపడ్డాను. అసలు ఎంత కాలం ఆడతానో చెప్పలేని పరిస్థితి. అయితే రెండేళ్ల క్రితం మాత్రం నాలో కొత్త ఉత్సాహం వచ్చింది. కెరీర్‌ను మరికొన్నేళ్లు పొడిగించుకోవచ్చని అనిపించింది.
2005నుంచి ఇప్పటి వరకు ఇంత సుదీర్ఘ కాలం టాప్–10 కొనసాగడం గర్వంగా అనిపిస్తోంది’ అని ఈ స్పెయిన్ స్టార్ గుర్తు చేసుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో 2009 రాబిన్ సొదర్లింగ్ చేతిలో పరాజయం పాలైన నాదల్, 2015లో జొకోవిచ్ చేతిలో ఓడాడు. తర్వాతి ఏడాది గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే తప్పుకున్నాడు. ‘రోలండ్ గారోస్‌కు నా దృష్టిలో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గెలిచిన 13 టైటిల్స్‌లో ఏది ఇష్టమంటే చెప్పలేను. ప్రతీ దానికి ఒక్కో విశిష్టత ఉంది. మళ్లీ నా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి నెగ్గాలని అనుకుంటున్నా’ అని ఈ దిగ్గజ ఆటగాడు తన మనసులో మాట చెప్పాడు.
ఒకే పార్శ్వంలో ముగ్గురు దిగ్గజాలు
14వ టైటిల్ వేటలో నాదల్‌కు కఠినమైన డ్రా ఎదురైంది. టాప్ సీడ్ నాదల్‌తో పాటు వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్, స్విస్ స్టార్ రోజర్ ఫెడరర్ కూడా ఒకే పార్శ్వంలో ఉండటం విశేషం. ముందంజ వేయాలంటే నాదల్ ఇటీవల క్లే కోర్టుల్లో విశేషంగా రాణిస్తున్న పలువురు యువ ఆటగాళ్లను దాటాల్సి ఉంటుంది. ఎలాంటి సంచలనాలు లేకుండా అంతా సాఫీగా సాగితే పురుషుల క్వార్టర్ ఫైనల్లో నాదల్‌తో రుబ్లెవ్ తలపడే అవకాశం ఉండగా...జొకోవిచ్, ఫెడరర్ మధ్య క్వార్టర్స్‌లోనే పోరు జరగనుంది.
ఫ్రెంచ్ ఓపెన్‌కు పర్యాయపదంగా మారిన రాఫెల్ నాదల్‌ను నిర్వాహకులు సముచిత రీతిలో గౌరవించారు. రోలండ్ గారోస్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద నాదల్ స్టెయిన్‌లెస్ స్టీల్ విగ్రహాన్ని వారు ఏర్పాటు చేశారు. నాదల్ ప్రధాన బలమైన ‘ఫోర్ హ్యాండ్’ షాట్ పోజులో ఈ 3 మీటర్ల విగ్రహం కనిపిస్తుంది. స్పెయిన్‌కు చెందిన ప్రముఖ శిల్పి జోర్డీ డి ఫెర్నాండెజ్ దీనిని రూపొందించారు. రాతి, ఇనుము, చెక్క, మట్టి తదితర వస్తువులతో ప్రయత్నించిన తర్వాత చివరకు నాదల్ విగ్రహాన్ని స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయాలని ఆయన నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment