ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌! | No-Place-For-Ishan Kishan-Indias Strongest Playing XI For-England ODIs | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

Jun 23 2026 11:39 AM | Updated on Jun 23 2026 12:56 PM

No-Place-For-Ishan Kishan-Indias Strongest Playing XI For-England ODIs

అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి జోష్ మీదున్న టీమిండియా ఇంగ్లండ్ గ‌డ్డ‌పై టీ20ల‌తో పాటు మూడు వ‌న్డేలు కూడా ఆడ‌నుంది. ఇంగ్లండ్ టూర్‌కు ముందు శ్రేయ‌స్ అయ్య‌ర్ నేతృత్వంలోని భార‌త జ‌ట్టు ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ విషయం పక్కనబెడితే, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లి ఆడుతాడా లేదా అనే సందేహం ఉండేది. 

అయితే ఇటీవలే గాయం నుంచి కోలుకున్న కోహ్లి ఫిట్‌నెస్ టెస్టులో పాసయ్యాడని తెలిపిన బీసీసీఐ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో ఆడబోయే  టీమిండియా స్ట్రాంగెస్ట్‌ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ తుదిజట్టులో ఇషాన్ కిష‌న్‌ చోటు ద‌క్కించుకోలేక‌పోయాడు. ఆఫ్గన్‌తో జరిగిన  రెండో వన్డేలో ఇషాన్‌ శతకం బాదిన సంగతి తెలిసిందే. అంతకముందు ఐపీఎల్‌లోనూ ఇషాన్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున తన బ్యాటింగ్‌తో అలరించిన సంగతి తెలిసిందే.

ఇక జట్టు విషయానికొస్తే.. టాపార్డ‌ర్‌లో ఓపెన‌ర్లుగా కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌తో పాటు రోహిత్ శ‌ర్మ, వ‌న్‌డౌన్‌లో కోహ్లి రానున్నారు. ఆఫ్గ‌న్‌తో వ‌న్డే సిరీస్‌లో కెప్టెన్ గిల్ అద‌ర‌గొట్టాడు. మూడు వ‌న్డేలు క‌లిపి 238 ప‌రుగులు చేసిన గిల్ ఖాతాలో ఒక సెంచ‌రీ, హాఫ్ సెంచ‌రీ ఉన్నాయి. 

మ‌రో బ్యాట‌ర్ రోహిత్ శ‌ర్మ తొలి రెండు వ‌న్డేల్లో పెద్ద‌గా రాణించన‌ప్ప‌టికీ మూడో వ‌న్డేలో త‌న‌దైన ఇన్నింగ్స్‌తో అల‌రించాడు. ఆఫ్గ‌న్‌తో సిరీస్‌లో 143 ప‌రుగులు సాధించాడు. ఇక కోహ్లి గాయం కార‌ణంగా ఆఫ్గ‌న్తో వ‌న్డే సిరీస్‌కు దూర‌మ‌య్యాడు. ఇక మిడిలార్డ‌ర్‌లో వైస్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌, కేఎల్ రాహుల్‌తో పాటు ఆల్‌రౌండ‌ర్లు నితీశ్ కుమార్ రెడ్డి, అక్ష‌ర్ ప‌టేల్‌లను ఎంపిక చేశారు. ఇక వ‌న్డేల్లో ఇప్ప‌టికే త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు పొందిన అయ్య‌ర్ త‌న‌కు అచ్చొచ్చిన నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు రానుండ‌గా, కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. 

నితీశ్‌కుమార్ రెడ్డి ప్ర‌స్తుతానికి జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న‌ప్ప‌టికీ, గాయంతో అత‌డు ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్ ఆడ‌డం అనుమానంగానే ఉంది.  ఆల్‌రౌండ‌ర్ కోటాలో అక్ష‌ర్‌ప‌టేల్ ఏడో స్థానంలో ఆడ‌డం గ్యారంటీ, బౌలింగ్ కోటాలో బుమ్రా, హ‌ర్షిత్ రానా, కుల్దీప్ యాద‌వ్‌, ప్ర‌సిధ్ క్రిష్ణ‌ల‌కు చోటు క‌ల్పించింది. 

ఇంగ్లండ్ వన్డేలకు భారత ప్లేయింగ్‌ ఎలెవన్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్‌), కేఎల్ రాహుల్ (వికెట్ కీప‌ర్‌, నితీశ్‌కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.

భారత్ వ‌ర్సెస్ ఇంగ్లండ్ వ‌న్డే షెడ్యూల్‌
1వ వన్డే జూలై 14, 2026 (మంగళవారం) ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ మధ్యాహ్నం 3:30

2వ వన్డే జూలై 16, 2026 (గురువారం) సోఫియా గార్డెన్స్, కార్డిఫ్ సాయంత్రం 5:30

3వ వన్డే జూలై 19, 2026 (ఆదివారం) లార్డ్స్, లండన్ మధ్యాహ్నం 3:30

Read: నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement