ప్యారిస్ ఒలింపిక్స్ 68 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ రెజ్లర్ నిషా దహియా, ఉత్తర కొరియా రెజ్లర్ పాక్ సోల్ గుమ్ తలపడ్డారు. గేమ్ ఆరంభం నుంచే ప్రత్యర్ధిపై నిషా దహియా ఆధిపత్యం చెలాయించింది. ఆట మరో 90 సెకన్లలో ముగియనుంది. అప్పటికే 8-1 స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న నిషా దహియా.. విజయం ఖాయమనే అంతా భావించారు. సరిగ్గా అదే సమయంలో ఆమెను దురదృష్టం వెంటాడింది.
అనూహ్యంగా దహియా కుడి చేతి వేలికి గాయమైంది. నొప్పితో విలవిలలాడిపోయింది. తక్షణమే స్పందించిన వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ఓ వైపు గాయంతో బాధపడుతున్నప్పటకి.. పతకం సాధించాలన్న కసితో దహియా పోరాడింది. కానీ గాయం తర్వాత ప్రత్యర్ధికి పోటీ ఇవ్వలేకపోయింది.
ఈ క్రమంలో ప్రత్యర్ధి పుంజుకుని వరుసగా 9 పాయింట్లు సాధించి 10-8తేడాతో నిషాను ఓడించింది. దీంతో ఒక్కసారిగా నిషా దహియా కన్నీటి పర్యంతమైంది. అయితే దహియా ఓటమి పాలైనప్పటకి.. తన పట్టుదలతో అందరని మనసులను గెలుచుకుంది.
ఆమె పోరాట పటిమపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా నిషా దహియా ఓటమిపై భారత రెజ్లింగ్ కోచ్ వీరేంద్ర దహియా సంచలన ఆరోపణలు చేశాడు. ప్రత్యర్థి సోల్ గమ్ పాక్ ఉద్దేశ్యపూర్వకంగానే నిషా దహియాను గాయపరిచిందని వీరేంద్ర దహియా పేర్కొన్నాడు.
"100కు 100 శాతం ఉద్దేశపూర్వకంగా ఆమె నిషాను గాయపరిచింది. ఆమెను కావాలనే గాయపరచడం అందరూ చూశారు. ఆమెకు కొరియన్ డగౌట్ నుంచి అలా చేయాలనే సూచనలు వచ్చాయి. అందుకే సోల్ గుమ్ నిషాను ఎటాక్ చేసింది. నిషా నుంచి పతకాన్ని దొచేశారుని" పీటీఐతో వీరేంద్ర దహియా చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment