ICC ODI WC 2023 Top Scorer Prediction: వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో ఇంగ్లండ్ టెస్టు జట్టు మాజీ కెప్టెన్ జో రూట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐసీసీ టోర్నీలో అత్యధిక పరుగులు చేసే బ్యాటర్ ఇతడేనంటూ ఎవరూ ఊహించని పేరును చెప్పాడు. టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. వంటి స్టార్లందరినీ కాదని సహచర ఆటగాడికే ఓటువేశాడు.
స్టోక్స్ అద్బుత ఇన్నింగ్స్ కారణంగా
2019లో సొంతగడ్డపై తొలిసారిగా విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టులో జో రూట్ సభ్యుడన్న విషయం తెలిసిందే. నాటి ఈ మెగా ఈవెంట్‌లో ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి మోర్గాన్ బృందం జగజ్జేతగా అవతరించింది. ఆనాటి మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్ 84 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను రేసులో నిలిపి విజయం అందించాడు.
ఈ క్రమంలో వరల్డ్‌కప్-2019లో ఇంగ్లండ్ హీరోగా నీరాజనాలు అందుకున్న స్టోక్స్.. మళ్లీ బరిలోకి దిగేందుకు వీలుగా వన్డేల రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు మెగా టోర్నీలో ఆడేందుకు అంగీకరించాడు.
ఆ ‘హీరో’ పేరు చెప్పలేదు!
అయితే, ప్రపంచకప్-2023లో టాప్ రన్‌స్కోరర్‌గా రూట్.. స్టోక్స్ పేరు చెప్పాడనుకుంటున్నారా? కానే కాదు... ఆశ్చర్యకరంగా ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను ఎంచుకున్నాడు. ‘‘తనను తాను నిరూపించుకోవడంలో జానీ ఎల్లప్పుడూ ముందే ఉంటాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్బుతమైన ఆటగాడు. టాపార్డర్‌లో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. జేసన్‌రాయ్‌తో కలిసి గొప్ప భాగస్వామ్యాలు నమోదు చేసిన ఘనత అతడిది.
పవర్‌ప్లేలో విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడగలడు. ఈసారి ప్రపంచకప్‌లో మరింత గొప్పగా రాణిస్తాడనుకుంటున్నా. నా ఛాయిస్ జానీ బెర్‌స్టో’’ అని ఐసీసీతో రూట్ వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన నెట్టింట చక్కర్లు కొడుతోంది.
బెయిర్‌స్టో గణాంకాలు ఇలా
కాగా 33 ఏళ్ల జానీ బెయిర్‌స్టో ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకు 95 వన్డేలు ఆడాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ సాధించిన పరుగులు 3634. కాగా అక్టోబరు 5న భారత్ వేదికగా ఇంగ్లండ్- న్యూజిలాండ్ మ్యాచ్‌తో ప్రపంచకప్-2023 ఈవెంట్‌కు తెరలేవనుంది.
చదవండి: వరల్డ్‌కప్ తర్వాత ద్రవిడ్ బై.. బై! నాడు అతడు ‘బలిపశువు’.. కొత్త కోచ్‌గా అతడే?
సిగ్గుపడు రోహిత్! నువ్వసలు కెప్టెన్‌వేనా?.. వాళ్లకు ఉన్నపాటి బుద్ధి నీకు లేదు!
Comments
Please login to add a commentAdd a comment