హామిల్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 423 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ వైట్ వాష్ నుంచి కివీస్ తప్పించుకుంది. తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించిన ఇంగ్లండ్ 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
కాగా 658 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 234 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లలో స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 4 వికెట్లు పడగొట్టగా.. మాట్ హెన్రీ, టిమ్ సౌథీ తలా రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాకబ్ బెతల్(76) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జో రూట్(54), అట్కినిసన్(43) పర్వాలేదన్పించారు.
కేన్ మామ భారీ సెంచరీ..
అంతకముందు రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు 453 పరుగుల భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన అధిక్యాన్ని జోడించి 657 పరుగుల భారీ లక్ష్యాన్ని పర్యాటక జట్టు ముందు కివీస్ ఉంచింది. కివీ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (204 బంతుల్లో 156; 20 ఫోర్లు, 1 సిక్స్) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
విలియమ్సన్‌తో పాటు రచిన్ రవీంద్ర (90 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్),డరైల్ మిచెల్ (84 బంతుల్లో 60; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), టామ్ బ్లండెల్ (55 బంతుల్లో 44; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాంట్నెర్ (38 బంతుల్లో 49; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) రాణించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో బెథెల్ 3 వికెట్లు తీయగా... బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. పాట్స్, అట్కిన్‌సన్, రూట్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 143 పరుగుకే కుప్పకూలింది. కాగా ఈ మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ టిమ్ సౌథీ టెస్టు క్రికెట్‌కు విడ్కోలు పలికాడు.
Comments
Please login to add a commentAdd a comment