వెంకటేశ్‌ అయ్యర్‌ అద్బుత బౌలింగ్‌: ఉత్కంఠ పోరులో విజయం | One Day Cup: Venkatesh Iyer Bowls Lancashire To Thrilling Victory Over Worcestershire | Sakshi
Sakshi News home page

వెంకటేశ్‌ అయ్యర్‌ అద్బుత బౌలింగ్‌: ఉత్కంఠ పోరులో విజయం

Published Thu, Aug 15 2024 5:07 PM | Last Updated on Thu, Aug 15 2024 5:52 PM

One Day Cup: Venkatesh Iyer Bowls Lancashire To Thrilling Victory Over Worcestershire

భారత క్రికెటర్‌ ‌వెంకటేశ్‌ అయ్యర్‌ ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌ వన్డే కప్‌ టోర్నీలో ఆల్‌రౌండ్‌ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. వొర్సెస్టెర్‌షైర్‌ జట్టుతో ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లంకాషైర్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. వెంకీ కారణంగా మూడు పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన లంకాషైర్‌ విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

25 పరుగులు
ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌ వన్డే కప్‌ టోర్నీలో  భాగంగా బుధవారం లంకాషైర్‌- వొర్సెస్టెర్‌షైర్‌తో తలపడింది.  మాంచెస్టర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వొర్సెస్టెర్‌షైర్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన లంకాషైర్‌ నిర్ణీత 50 ఓవర్లలో 237 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. కెప్టెన్‌ జోష్‌ బొహానన్‌ 87 పరుగులతో ఆకట్టుకోగా.. మిడిలార్డర్‌లో బాల్డర్‌సన్‌ అర్ద శతకంతో మెరిశాడు. వీరితో పాటు వెంకటేశ్‌ అయ్యర్‌ 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.

ఇక లక్ష్య ఛేదనకు దిగిన వొర్సెస్టెర్‌షైర్‌ ఆదిలోనే టాపార్డర్‌ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన కెప్టెన్‌ జేక్‌ లిబి 83 పరుగులతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దగా.. మిడిలార్డర్‌ బ్యాటర్‌ టామ్‌ టేలర్‌ 41 పరుగులతో అతడికి సహకారం అందించాడు. ఆఖరల్లో టామ్‌ హిన్లే 24 పరుగులతో జట్టును లక్ష్యానికి చేరువగా తీసుకువచ్చాడు.

మూడు పరుగులా? రెండు వికెట్లా?
ఈ క్రమంలో 49వ ఓవర్‌లో బంతిని అందుకున్న లంకాషైర్‌ పేస్‌ బౌలర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ అద్భుతం చేశాడు. వొర్సెస్టెర్‌షైర్‌ గెలుపునకు మూడు పరుగుల దూరంలో ఉండగా.. చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్న సమయంలో.. రెండు వికెట్లూ తనే పడగొట్టాడు. ఓవర్‌ ఐదో బంతికి హిన్లేను అవుట్‌ చేసిన వెంకటేశ్‌.. ఆరో బంతికి హ్యారీ డేర్లీని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 234 పరుగుల వద్దే వొర్సెస్టెర్‌షైర్‌ ఇన్నింగ్స్‌ ముగిసిపోయింది. ఫలితంగా మూడు పరుగుల స్వల్ప తేడాతో లంకాషైర్‌ విజయం సాధించింది.

టీమిండియాలో చోటు కరువు
ఇక వెంకటేశ్‌ అయ్యర్‌ లాస్ట్‌ ఓవర్‌ థ్రిల్లర్‌కు సంబంధించిన వీడియోను లంకాషైర్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అవుతోంది. ఈ మ్యాచ్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ ఆరు ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఈ సీజన్‌లో లంకాషైర్‌కు దక్కిన రెండో గెలుపు ఇది. మొత్తంగా ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం రెండే గెలిచి టోర్నీ నుంచి ఎలిమినేట్‌ అయిపోయింది. ఇక మధ్యప్రదేశ్‌కు చెందిన వెంకటేశ్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. రైటార్మ్‌ మీడియం పేసర్‌ కూడా అన్న సంగతి తెలిసిందే.

టీమిండియా తరఫున తొమ్మిది టీ20లు, రెండు వన్డేలు ఆడిన ఈ ఆల్‌రౌండర్‌.. ఆయా ఫార్మాట్లలో 133, 24 పరుగులు చేశాడు. టీ20లలో ఐదు వికెట్లు తీశాడు. అయితే, 2022 తర్వాత భారత జట్టులో అతడికి స్థానం కరువైంది. ఈ నేపథ్యంలో కౌంటీలో ఆడేందుకు నిర్ణయించుకున్న వెంకటేశ్‌.. ఐదువారాల పాటు లంకాషైర్‌కు ప్రాతినిథ్యం వహించేందుకు ఒప్పందం కుదరుర్చుకున్నాడు. ఆ జట్టు తరఫున ఐదు ఇన్నింగ్స్‌ ఆడి కేవలం 68 పరుగులు చేశాడు. మూడు వికెట్లు తీయగలిగాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement