టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. లంకాషైర్ జట్టుతో అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రైటార్మ్ మీడియం పేసర్ కూడా!
ఐపీఎల్-2024 ఫైనల్లో సత్తా చాటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అరంగేట్రం చేసిన వెంకీ.. గత నాలుగు సీజన్లుగా అదే జట్టుతో కొనసాగుతున్నాడు. కీలక సమయాల్లో రాణిస్తూ జట్టులోని ప్రధాన ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగిన ఈ ఇండోర్ క్రికెటర్.. ఐపీఎల్-2024 ఫైనల్లో సత్తా చాటాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(6- నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. పదేళ్ల తర్వాత కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు వెంకటేశ్ అయ్యర్.
హార్దిక్ పాండ్యా వారసుడంటూ ప్రశంసలు.. కానీ
ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న సమయంలో(2021)నే టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టాడు వెంకీ. ఆ మరుసటి ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా వారసుడిగా నీరాజనాలు అందుకున్నాడు వెంకటేశ్ అయ్యర్.
టీమిండియా తరఫున ఇంత వరకు తొమ్మిది టీ20లు, రెండు వన్డేలు ఆడిన ఈ ఆల్‌రౌండర్.. ఆయా ఫార్మాట్లలో 133, 24 పరుగులు చేశాడు. టీ20లలో ఐదు వికెట్లు తీశాడు. అయితే, హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగి రావడంతో వెంకీకి అవకాశాలు కరువయ్యాయి. ఈ క్రమంలో 2022లో చివరిసారిగా అతడు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.
రీఎంట్రీపై దృష్టి
ఐపీఎల్-2024లో సత్తా చాటిన వెంకటేశ్ అయ్యర్.. రీఎంట్రీపై కన్నేశాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇంగ్లండ్ కౌంటీల్లో(ఫస్ట్‌క్లాస్)నూ ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐదువారాల పాటు లంకాషైర్‌తో కాంట్రాక్ట్ చేసుకున్నాడు. అనంతరం భారత్‌కు తిరిగి వచ్చి దులిప్ ట్రోఫీలో భాగం కానున్నాడు.
కౌంటీల్లో ఆడటం గురించి వెంకటేశ్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘లంకాషైర్ గొప్ప చరిత్ర ఉన్న జట్టు. ఫారూఖ్ ఇంజనీర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వాషింగ్టన్ సుందర్ లంకాషైర్‌కు ఆడారు. ఇప్పుడు నేను కూడా ఆ జాబితాలో చేరబోతున్నా’’ అని హర్షం వ్యక్తం చేశాడు.
చదవండి: IND vs SL: గంభీర్ కొత్త ప్రయోగం.. స్పిన్నర్‌గా మారిన హార్దిక్ పాండ్యా
Comments
Please login to add a commentAdd a comment