Political Tensions In Pakistan: పాకిస్థాన్‌లో మారుతున్న రాజకీయ సమీకరణలు ఆసీస్-పాక్ మధ్య జరుగుతున్న క్రికెట్ సిరీస్‌పై ప్రభావం చూపేలా ఉన్నాయి. దాయాది దేశంలో ప్రతిపక్షాలన్నీ ఏకమై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ క్రమంలో ఇమ్రాన్ ఈ నెలాఖర్లోగా (మార్చి 28 నుంచి 30 మధ్యలో) తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇమ్రాన్‌కు పదవీ గండం తప్పేలా లేదని తెలుస్తోంది. పాక్‌లో నెలకొన్న ఈ రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఆసీస్-పాక్ సిరీస్ కొనసాగడం అనుమానంగా మారింది.
ఇరు జట్ల మధ్య మార్చ్ 29 నుంచి పరిమిత ఓవర్ల సిరీస్ ప్రారంభంకావల్సి ఉండగా, అదే సమయంలో ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా ఇస్లామాబాద్‌లో భారీ ర్యాలీలు జరగనున్నాయి. ఈ ర్యాలీలు జరిగే ప్రదేశం క్రికెటర్లు బస చేసే హోటల్‌కు అతి సమీపంలో ఉండటంతో తదుపరి సిరీస్ సాధ్యాసాధ్యాలపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల సిరీస్ వేదికల మార్పు అంశాన్ని పీసీబీ పరిశీలిస్తుంది. షెడ్యూల్ ప్రకారం మూడు వన్డేలు, ఏకైక టీ20 మ్యాచ్ రావల్పిండి వేదికగా జరగాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వేదికను లహోర్‌కు మార్చే ఆలోచనలో పీసీబీ ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా, 24 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా.. పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో పాక్‌తో మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఓ టీ20 ఆడాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లు డ్రా కాగా, ఈ నెల 21 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. అనంతరం ఈనెల 29 నుంచి ఏప్రిల్ 5 వరకు పరిమిత ఓవర్ల సిరీస్ జరగనుంది.
చదవండి: ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం.. హర్భజన్ సింగ్‌కు బంపర్ ఆఫర్
Comments
Please login to add a commentAdd a comment