పాకిస్తాన్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఆల్‌రౌండర్ ఇంకా మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించలేదని సమాచారం. దీంతో ఒలీ పోప్ మరోసారి స్టోక్స్ స్థానంలో జట్టును ముందుకు నడిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా ది హండ్రెడ్ లీగ్ 2024 సందర్భంగా బెన్ స్టోక్స్ గాయపడిన విషయం తెలిసిందే. నార్తర్న్ సూపర్‌చార్జెర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు తొడకండరాల నొప్పితో జట్టుకు దూరమయ్యాడు. దీంతో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ కూడా ఆడలేకపోయాడు.
ఈ క్రమంలో ఒలీ పోప్ సారథ్య బాధ్యతలు చేపట్టగా.. ఇంగ్లండ్ శ్రీలంకపై మూడు టెస్టుల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే, కెప్టెన్సీ పోప్ వ్యక్తిగత ప్రదర్శనపై ప్రభావం చూపగా.. అతడు విమర్శల పాలయ్యాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ జట్టు అక్టోబరు 7 నుంచి పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుపెట్టనుంది.
ముల్తాన్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు
ఇందుకోసం ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ముల్తాన్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే మాట్లాడుతూ.. స్టోక్స్ గాయం గురించి అప్‌డేట్ ఇచ్చాడు. ‘‘ఇంకో రెండు మూడు వైద్య పరీక్షల తర్వాత అతడు మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడో లేదో తెలుస్తుంది. పూర్తిగా కోలుకున్నాడనే అనుకుంటున్నాం.
రిస్క్ తీసుకోవడం అనవసరం
మ్యాచ్ ఆడేందుకు తను సిద్ధంగా ఉన్నాడు. అయితే, రిస్క్ తీసుకోవడం అనవసరం. మా జట్టు పటిష్టంగా ఉంది. ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆల్‌రౌండర్లుగా రాణించగల సమర్థులు ఉన్నారు. అందుకే.. అతడిపై మేనేజ్‌మెంట్ ఒత్తిడి పెట్టదలచుకోలేదు’’ అని జాక్ క్రాలే మీడియాతో పేర్కొన్నాడు. కాగా క్రాలే సైతం చేతి వేలికి గాయంతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా అతడు శ్రీలంకతో టెస్టులు మిస్సయ్యాడు. అతడి స్థానంలో డాన్ లారెన్స్ ఓపెనింగ్ చేశాడు.
పాక్‌తో టెస్టులకు ఇంగ్లండ్ జట్టు
బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జోష్ హల్, జాక్ లీచ్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, రెహాన్ అహ్మద్, జో రూట్, షోయబ్ బషీర్, జేమీ స్మిత్, ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్.
Comments
Please login to add a commentAdd a comment