బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమిపాలైన పాకిస్తాన్ క్రికెట్ జట్టు సొంతగడ్డపై మరో టెస్టు సిరీస్ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా ఇంగ్లండ్‌తో తలపడనుంది. అక్టోబరు 7 నుంచి ఈ సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ముల్తాన్, కరాచి, రావల్పిండిలో ఈ మ్యాచ్‌లను నిర్వహించాల్సి ఉంది.
అయితే, తాజా సమాచారం ప్రకారం పాకిస్తాన్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ వేదికను విదేశానికి తరలించినట్లు సమాచారం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదా శ్రీలంకలో ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్‌లోని స్టేడియాల పునరుద్ధరణ కార్యక్రమం నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు ఈ దిశగా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
అందుకే వేదిక మార్పు
కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఐసీసీ టోర్నీని సమర్థవంతంగా నిర్వహించాలంటే పాక్ స్టేడియాల్లో తగిన సదుపాయాలు లేవు. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు వివిధ స్టేడియాల్లో పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. అయితే ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనిపించకపోవడంతో టెస్టుమ్యాచ్‌ల నిర్వహణ సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో సిరీస్ వేదికను తరలించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.
కానీ.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును ఇందుకు ఒప్పించడం సహా... యూఏఈ లేదంటే శ్రీలంకలో సిరీస్ నిర్వహించడం పాక్ బోర్డుకు అంతతేలికేమీ కాదు. ఎందుకంటే.. బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో మహిళల టీ20 ప్రపంచకప్-2024 వేదికగా ఇప్పటికే యూఏఈని ఖరారు చేసింది ఐసీసీ. అక్టోబరు 3- 20 వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది.
లంక బెస్ట్ ఆప్షన్
కాబట్టి యూఏఈలో పాకిస్తాన్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ నిర్వహణ సాధ్యం కాకపోవచ్చు. మరోవైపు.. శ్రీలంకలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడా మ్యాచ్‌లు సజావుగా నిర్వహించడం కష్టమేకానుంది. అయితే, లంక కంటే ఉత్తమ ఆప్షన్ లేదు కాబట్టి అక్కడే ఈ సిరీస్‌ను నిర్వహించాలని పాక్ బోర్డు భావిస్తున్నట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో 0-2తో క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. పాకిస్తాన్ బంగ్లా చేతిలో టెస్టుల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి.
పాకిస్తాన్‌లో ఇంగ్లండ్ పర్యటన 2024- ఖరారైన షెడ్యూల్
మొదటి టెస్టు- అక్టోబరు 7- అక్టోబరు 11- ముల్తాన్
రెండో టెస్టు- అక్టోబరు 15- అక్టోబరు 19- కరాచి
మూడో టెస్టు- అక్టోబరు 24- అక్టోబరు 28- రావల్పిండి.
Comments
Please login to add a commentAdd a comment