![Pakistan All Out For 242 In Tri Series Final Against New Zealand](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/nz.jpg.webp?itok=Ui1vpMiw)
కరాచీలో జరుగుతున్న ట్రయాంగులర్ సిరీస్ (Tri-Series) ఫైనల్లో న్యూజిలాండ్ (New Zealand), పాకిస్తాన్ (Pakistan) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగడంతో పాక్ 49.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. పేసర్ విలియమ్ ఓరూర్కీ నాలుగు వికెట్లు తీసి పాక్‌ను ప్రధాన దెబ్బకొట్టాడు. మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ అద్భుతంగా బౌలింగ్ చేసి తలో రెండు వికెట్లు తీశారు. జేకబ్ డఫీ, నాథన్ స్మిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
పాక్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. కెప్టెన్ రిజ్వాన్ చేసిన 46 పరుగులే అత్యధికం. సల్మాన్ అఘా 45, తయ్యబ్ తాహిర్ 38, బాబర్ ఆజమ్ 29, ఫహీమ్ అష్రఫ్ 22, ఫకర్ జమాన్ 10, సౌద్ షకీల్ 8, ఖుష్దిల్ షా 7, షాహీన్ అఫ్రిది 1, నసీం షా 19 పరుగులు చేశారు.
వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన బాబర్
ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ ఓ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ హాషిమ్ ఆమ్లాతో కలిసి రికార్డు షేర్ చేసుకున్నాడు. ఆమ్లా, బాబర్‌కు తలో 123 ఇన్నింగ్స్‌ల్లో 6000 పరుగులు పూర్తి చేశారు.
వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన టాప్-5 ఆటగాళ్ల జాబితాలో బాబర్, ఆమ్లా తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. విరాట్ 136 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని తాకితే.. కేన్ మామ, వార్నర్ భాయ్ తలో 139 ఇన్నింగ్స్‌ల్లో 6000 పరుగుల క్లబ్‌లో చేరారు.
కాగా, ఈ ముక్కోణపు సిరీస్‌లో పాక్, న్యూజిలాండ్‌తో పాటు సౌతాఫ్రికా కూడా పాల్గొంది. ఈ టోర్నీలో ఫైనల్‌కు ముందు మూడు జట్లు తలో రెండు మ్యాచ్‌లు ఆడాయి. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ 78 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాను చిత్తు చేసి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మూడో మ్యాచ్‌లో పాక్.. సౌతాఫ్రికా నిర్దేశించిన 353 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్‌కు చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ స్వదేశంలో ఈ టోర్నీని నిర్వహించింది.
పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభ కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనుండగా.. మిగతా మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్‌లో జరుగుతాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. భారత్‌ను ఢీకొంటుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment