వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. అయితే భద్రతా కారణాల రిత్యా టీమిండియా పాక్‌లో పర్యటించేది లేదని స్పష్టం చేసింది. హైబ్రిడ్ పద్దతిలో (తటస్థ వేదిక) టోర్నీని నిర్వహిస్తే పాల్గొంటామని భారత్ తెలిపింది.
ఈ ప్రతిపాదనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒప్పుకోవడం లేదు. అవసరమైతే టోర్నీ నుంచి తప్పుకుంటాం కానీ.. హైబ్రిడ్ పద్దతిలో మాత్రం టోర్నీని నిర్వహించేది లేదని తేల్చి చెప్పింది. మరోవైపు పీసీబీ హైబ్రిడ్ పద్దతిలో టోర్నీని నిర్వహించేందుకు అంగీకరించకపోతే వేదికను సౌతాఫ్రికాకు మారుస్తామని ఐసీసీ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే, సూర్యకుమార్ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో రెండో టీ20 ముగిసిన అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌కు హాజరైన ఓ పాక్ అభిమాని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి ఫోటో దిగాడు. అనంతరం సదరు అభిమాని మీరు పాక్‌కు ఎందుకు రావడం లేదని స్కైని ప్రశ్నించాడు.
ఇందుకు స్కై బదులిస్తూ.. మా చేతుల్లో ఏముంది అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా, పాక్ మొండిపట్టు వీడకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ సందిగ్దంలో పడింది. ఒకవేళ పాక్ హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోక పోతే టోర్నీ రద్దైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇదిలా ఉంటే, భారత సీనియర్ జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాతో పర్యటిస్తుంది. ఈ పర్యటనలోని తొలి మ్యాచ్ పెర్త్ వేదికగా నవంబర్ 22న ప్రారంభమవుతుంది. మరోవైపు భారత టీ20 జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భారత్ ఇదివరకే రెండు మ్యాచ్‌లు ఆడేసింది. ఇందులో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ సిరీస్‌లో మరో రెండు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment