ఘోర పరాభవాన్ని తప్పించుకున్న పాకిస్తాన్‌ | Pakistan Misses Innings Defeat In Second Test Vs South Africa, Check Out Full Score Details Inside | Sakshi
Sakshi News home page

ఘోర పరాభవాన్ని తప్పించుకున్న పాకిస్తాన్‌

Published Mon, Jan 6 2025 8:34 PM | Last Updated on Tue, Jan 7 2025 1:16 PM

Pakistan Misses Innings Defeat In Second Test Vs South Africa

కేప్‌టౌన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఘోర పరాభవాన్ని తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో పాక్‌ ఇన్నింగ్స్‌ పరాజయాన్ని అధిగమించింది. తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలిన పాక్‌ ఫాలో​ ఆన్‌ ఆడుతుంది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ చేయడంతో పాక్‌ లీడ్‌లోకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో పాక్‌ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే సౌతాఫ్రికా ముందు కనీసం 250 పరుగుల లక్ష్యాన్ని అయినా ఉంచాల్సి ఉంది. అయితే పరిస్థితులు అలా కనిపించడం లేదు. 

సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో పాక్‌ చేతిలో మరో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం​ ఆ జట్టు కేవలం 50 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. కీలక బ్యాటర్లంతా పెవిలియన్‌కు చేరారు. నాలుగో రోజు ఆటలో మూడో సెషన్‌ కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో పాక్‌ గట్టెక్కాలంటే రేపు (ఐదో) తొలి సెషన్‌ వరకు బ్యాటింగ్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడే సౌతాఫ్రికా ముందు ఫైటింగ్‌ టార్గెట్‌ను ఉంచగలుగుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా అతి భారీ స్కోర్‌ చేసింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 615 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ భారీ డబుల్‌ సెంచరీ (259) చేసి సౌతాఫ్రికాను కమాండింగ్‌ పొజిషన్‌లో ఉంచాడు. కెప్టెన్‌ టెంబా బవుమా (106), వికెట్‌ కీపర్‌ కైల్‌ వెర్రిన్‌ (100) కూడా సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్‌ (62), కేశవ్‌ మహారాజ్‌ (40) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. 

సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్‌ 17, ముల్దర్‌ 5, ట్రిస్టన్‌ స్టబ్స్‌ 0, బెడింగ్హమ్‌ 5, మఫాకా 0, రబాడ 6 (నాటౌట్‌) పరుగులు చేశారు. పాక్‌ బౌలర్లలో మొహమ్మద్‌ అబ్బాస్‌, సల్మాన్‌ అఘా తలో మూడు వికెట్లు తీయగా.. మీర్‌ హమ్జా, ఖుర్రమ్‌ షెహజాద్‌ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.

అనంతరం పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లు తలో చేయి వేసి పాక్‌ ఇన్నింగ్స్‌ నేలకూల్చారు. రబాడ 3, మఫాకా, మహారాజ్‌ తలో 2, మార్కో జన్సెన్‌, వియాన్‌ ముల్దర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్‌ ఆజమ్‌ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మొహమ్మద్‌ రిజ్వాన్‌ (46) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. పాక్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ 2, కమ్రాన్‌ గులామ్‌ 12, సౌద్‌ షకీల్‌ 0, సల్మాన్‌ అఘా 19, ఆమెర్‌ జమాల్‌ 15, ఖుర్రమ్‌ షెహజాద్‌ 14, మీర్‌ హమ్జా 13, మొహమ్మద్‌ అబ్బాస్‌ 0 (నాటౌట్‌) పరుగులు చేశారు. 

ఈ మ్యాచ్‌లో పాక్‌ 10 మంది ఆటగాళ్లతోనే బ్యాటింగ్‌ను కొనసాగించాల్సి వచ్చింది. యువ ఓపెనర్‌ సైమ్‌ అయూబ్‌ సౌతాఫ్రికా బ్యాటింగ్‌ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డాడు. సైమ్‌ కాలు మడతపడటంతో ఉన్నపళంగా మైదానం నుంచి వైదొలిగాడు. అతను ఆరు వారాల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలని డాక్టర్లు చెప్పారు. అందుకే అతను బ్యాటింగ్‌కు దిగలేదు.

ఫాలో ఆన్‌ ఆడుతన్న పాక్‌ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తుంది. ఆ జట్టు నాలుగో రోజు మూడో సెషన్‌ సమయానికి 7 వికెట్ల నష్టానికి 471 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 50 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కెప్టెన్‌ షాన్‌ మసూద్ (145) సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీ చేశాడు. మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (81) రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్‌ సెంచరీతో రాణించాడు. 

ఖుర్రమ్‌ షెహజాద్‌ (18), కమ్రాన్‌ గులామ్‌ (28), సౌద్‌ షకీల్‌ (23) కొద్ది సేపు నిలదొక్కుకున్నట్లు కనిపించినా ఆతర్వాత పెవిలియన్‌ బాట పట్టారు. మొహమ్మద్‌ రిజ్వాన్‌ (41), సల్మాన్‌ అఘా (48) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆమెర్‌ జమాల్‌ (34 నాటౌట్‌), మీర్‌ హమ్జా (16 నాటౌట్‌) పాక్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహారాజ్‌, కగిసో రబాడ, మార్కో జన్సెన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. మఫాకా ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement