WCL 2026: లెజెండ్స్‌ టోర్నీ నుంచి పాకిస్తాన్‌ ఔట్‌ | Pakistan-Withdraw-World Championship-Legends-Wants-Indian-Players-Apology-Sources | Sakshi
Sakshi News home page

WCL 2026: లెజెండ్స్‌ టోర్నీ నుంచి పాకిస్తాన్‌ ఔట్‌

Oct 6 2026 7:39 AM | Updated on Oct 6 2026 7:56 AM

Pakistan-Withdraw-World Championship-Legends-Wants-Indian-Players-Apology-Sources

దుబాయ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ లెజెండ్స్ ఆఫ్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూసీఎల్-2026) టోర్నీ మూడో ఎడిషన్ నుంచి పాకిస్తాన్ చాంపియన్స్ అధికారికంగా నిష్క్రమించింది. ఆడలేక మద్దెలదరువు అన్నట్లు.. లెజెండ్స్ టోర్నీలో పాక్ జట్టు పాల్గొనాలంటే, భారత జట్టు తమకు లిఖితపూర్వకంగా క్షమాపణ చెబితేనే, తమ ఆటగాళ్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ) జారీ చేస్తామంటూ డబ్ల్యూసీఎల్‌ నిర్వాహకుల ముంగిట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ డిమాండ్‌ను ఉంచింది. 

అయితే పాక్ వక్రబుద్ధిని పసిగట్టిన డబ్ల్యూసీఎల్‌ నిర్వాహకులు పీసీబీ డిమాండ్‌ను తిరస్కరించారు. అంతేకాదు ఇండియా చాంపియన్స్‌ ఆటగాళ్లు కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటూ స్పష్టం చేశారు. దీంతో పాకిస్తాన్ చాంపియన్స్ జట్టు ఈ సీజన్ నుంచి వైదొలుగుతున్నట్లు పీసీబీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆస్ట్రేలియాతో జరగాల్సిన మ్యాచ్‌ రద్దయినట్లు డబ్ల్యూసీఎల్‌ నిర్వాహకులు పేర్కొన్నారు.

విషయంలోకి వెళితే.. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో  గత సీజన్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడేందుకు ఇండియా చాంపియన్స్ నిరాకరించింది. ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న ఈ నిర్ణయంలో భారత్‌ వెనక్కి తగ్గలేదు. దీంతో గత సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరగాల్సిన గ్రూప్‌ మ్యాచ్‌ రద్దయింది.

సెమీఫైనల్లోనూ భారత్‌ ఇదే వైఖరిని కొనసాగించింది. పాక్‌తో ఆడేందుకు భారత ఆటగాళ్లు మైదానంలోకి దిగకపోవడంతో పాకిస్థాన్‌ వాకోవర్‌తో ఫైనల్‌కు చేరింది. భారత జట్టులో యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్‌, పీయూష్‌ చావ్లా, యూసుఫ్‌ పఠాన్‌, రాబిన్‌ ఉతప్ప వంటి మాజీ ఆటగాళ్లు ఉన్నారు.

ఈసారి టోర్నీలో పాల్గొనేందుకు పాక్‌ ఆటగాళ్లకు పీసీబీ ఎన్‌ఓసీలు ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే గత సీజన్‌లో తీసుకున్న నిర్ణయంపై భారత్‌ నుంచి లిఖితపూర్వక క్షమాపణ కోరింది. అంతేకాదు.. భారత ఆటగాళ్లు టోర్నీలో పాల్గొనకపోయినా అభ్యంతరం లేదని నిర్వాహకులు హామీ ఇవ్వాలని కూడా కోరింది. అయితే ఈ డిమాండ్లను డబ్ల్యూసీఎల్‌ నిర్వాహకులు అంగీకరించలేదు. దీంతో పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ టోర్నీ నుంచి తప్పుకుంది. దీనిపై డబ్ల్యూసీఎల్‌ మాత్రం ‘అనుకోని పరిస్థితుల కారణంగా’ పాక్‌ జట్టు వైదొలిగినట్లు ప్రకటించింది. 

ఇదీ చదవండి: కెప్టెన్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌.. బంగ్లాను చిత్తు చేసిన ఇంగ్లండ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement