పారిస్ పారాలింపిక్స్‌లో పాల్గొనే వారంతా వివిధ రకాల వైకల్యాలతో ఇబ్బంది పడేవారే. నిబంధనలకు అనుగుణంగా దాదాపు తమలాంటి శారీరక లోపాలతో ఉన్న వ్యక్తులతోనే వారంతా పోటీ పడటం కూడా వాస్తవమే. అయినా సరే కొందరు ఆటగాళ్ల శారీరక లోపాలు అయ్యో అనిపిస్తాయి. మరికొందరి పోరాటం కన్నీళ్లు తెప్పిస్తుంది. అలాంటి జాబితాలో ఉండే ప్లేయర్ గాబ్రియెల్ డాస్ సాంతోస్ అరాజో.
డాల్ఫిన్ తరహాలో దూసుకుపోతాడు
బ్రెజిల్‌కు చెందిన ఈ స్విమ్మర్ ఈత కొలనులో దూసుకుపోతున్న తీరు చూస్తే ఎలాంటి వైకల్యమైనా తలవంచి అభివాదం చేస్తుంది. పుట్టుకతోనే ‘ఫోకోమెలియా’ అనే వ్యాధి బారిన పడటంతో గాబ్రియెల్ రెండు చేతులూ పూర్తిగా కోల్పోయాడు. కాళ్లు కూడా అచేతనంగా మారిపోయాయి.
ఇలాంటి స్థితిలోనూ అతను స్విమ్మింగ్‌పై ఆసక్తి చూపించి కొలనులోకి దిగాడు. మిగిలిన శరీరాన్ని మాత్రమే కదిలిస్తూ డాల్ఫిన్ తరహాలో ఈతలో దూసుకుపోయే టెక్నిక్‌ను నేర్చుకున్నాడు. తీవ్ర సాధనతో పారాలింపిక్ స్విమ్మర్‌గా ఎదిగాడు. శుక్రవారం పారిస్ ఒలింపిక్స్‌లో 22 ఏళ్ల గాబ్రియెల్ బ్రెజిల్ దేశానికి తొలి పతకాన్ని అందించాడు. ఎస్2 కేటగిరీ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో దూసుకుపోయిన అతను స్వర్ణం గెలుచుకున్నాడు.
స్వర్ణాల వీరుడు
అంతేకాదు.. 1 నిమిషం 53.67 సెకన్లలోనే అతను దీనిని పూర్తి చేయడం విశేషం. గత టోక్యో ఒలింపిక్స్‌లో కూడా రెండు స్వర్ణాలు, ఒక రజతం గెలిచిన ఘనత గాబ్రియెల్ అతని సొంతం. విజయం సాధించిన తర్వాత తమ దేశ సాంప్రదాయ ‘సాంబా’ నృత్యాన్ని అతను ప్రదర్శించిన తీరు గాబ్రియెల్ ఘనతకు మరింత ప్రత్యేకతను తెచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment