SRH: అతడి గురించి ఎంత చెప్పినా తక్కువే.. సంతోషంగా ఉంది | Pat Cummins comments on SRH win over CSK in IPL 2024 | Sakshi
Sakshi News home page

అతడి గురించి ఎంత చెప్పినా తక్కువే.. చాలా సంతోషంగా ఉంది: కమ్మిన్స్‌

Published Fri, Apr 5 2024 11:30 PM | Last Updated on Sat, Apr 6 2024 9:28 AM

Pat Cummins comments on SRH Win over CSK in IPL 2024 - Sakshi

కమ్మిన్స్‌ (PC: IPL)

ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో అద్బుత విజయం సాధించింది. ఉప్పల్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సీఎస్‌కేను ఆరెంజ్‌ ఆర్మీ చిత్తు చేసింది. తొలుత బౌలింగ్‌లో అదరగొట్టిన ఎస్‌ఆర్‌హెచ్‌.. అనంతరం బ్యాటింగ్‌లో దుమ్ములేపింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే.. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేసింది.

సీఎస్‌కే బ్యాటర్లలో శివమ్‌ దూబే(45) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రహానే(35), జడేజా(31) పరుగులతో రాణించాడు.. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. భువనేశ్వర్‌ కుమార్‌, టి నటరాజన్‌, పాట్‌ కమ్మిన్స్‌, జయ్‌దేవ్‌ ఉనద్కట్‌, షాబాజ్ అహ్మద్ తలా వికెట్‌ సాధించారు. అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ 18.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో ఐడైన్‌ మార్‌క్రమ్‌(50) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. అభిషేక్‌ శర్మ(37), ట్రావిస్‌ హెడ్‌(31) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక ఈ విజయంపై మ్యాచ్‌ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ స్పందించాడు. తమ హోం గ్రౌండ్‌లో మరో విజయం సాధించడం సంతోషంగా ఉందని కమ్మిన్స్‌ తెలిపాడు.

"హోం గ్రౌండ్‌లో విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మా ఖాతాలో రెండు పాయింట్లు వచ్చి చేరాయి. ఈ రోజు పిచ్‌ కాస్త భిన్నంగా ఉంది. ఆట సాగుతున్న కొద్దీ పిచ్‌ కొంచెం నెమ్మదించింది. శివమ్‌ దూబే మాత్రం స్పిన్నర్లను ఎటాక్‌ చేశాడు. అందుకే స్పిన్నర్లతో తమ ఫుల్‌ ఓవర్ల కోటా వేయించలేదు. వికెట్‌ నెమ్మదిగా ఉంది కాబట్టి ఆఫ్‌కట్టర్‌లతో  ప్రత్యర్ది బ్యాటర్లను కట్టడి చేయాలనుకున్నాం.

మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేశాము. మా బౌలర్లు అద్బుతంగా బౌలింగ్‌ చేశారు. అదే విధంగా అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌ మాకు మంచి ఆరంభం ఇచ్చారు. అభిషేక్‌ కోసం ఎంత చెప్పిన తక్కుదే. ఆ తర్వాత మార్‌క్రమ్‌ అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ రోజు స్టేడియం హౌస్‌ ఫుల్‌ అయిపోయింది. ఎంఎస్‌ ధోని బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయిందని" కమ్మిన్స్‌ పోస్ట్‌ మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో ‍కమ్మిన్స్‌ పేర్కొన్నాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement