ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) తదుపరి అధ్యక్షుడిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నియమితుడు కానున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. నఖ్వీ రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నట్లు తెలుస్తోంది. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా ప్రస్తుతం ఏసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే.
జై షా వైదొలిగిన వెంటనే
రెండేళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత ఈ ఏడాది జనవరిలో.. మరోసారి ఏసీసీ బాస్‌గా బాధ్యతలు చేపట్టాడు జై షా. ఏడాది పాటు అతడి పదవీకాలాన్ని పొడిగిస్తూ ఏసీసీ నిర్ణయం తీసుకున్న క్రమంలో.. ఇప్పటికీ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నాడు. అయితే, రొటేషన్ పాలసీ ప్రకారం ఈసారి ఈ పదవి పాక్ బోర్డు చైర్మన్‌ను వరించనున్నట్లు ఏసీసీ వర్గాలు తెలిపాయి.
‘‘వచ్చే ఏడాది ఏసీసీ సమావేశంలో.. నఖ్వీ నియామకానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తారు. తదుపరి రెండేళ్లపాటు ఏసీసీ ప్రెసిడెంట్‌గా నఖ్వీ కొనసాగే అవకాశం ఉంది. జై షా వైదొలిగిన వెంటనే అతడి స్థానంలో నఖ్వీ బాధ్యతలు చేపడతాడు’’అని సదరు వర్గాలు జాతీయ మీడియాతో వెల్లడించాయి.
వచ్చే ఏడాది భారత్‌లో
కాగా వచ్చే ఏడాది భారత్‌లో ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నీ పురుషుల ఆసియాకప్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీని వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించనున్నారు. 2026లో స్వదేశంలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ముందుగా ఈ టోర్నీ నిర్వహిస్తారు.
గతంలోనూ 2023 వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా పాకిస్తాన్‌లో ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్‌లో నిర్వహించారు. అయితే భారత్ అక్కడికి వెళ్లేందుకు నిరాకరించడంతో ‘హైబ్రిడ్ మోడల్’తో భారత్ ఆడిన మ్యాచ్‌ల్ని శ్రీలంకలో ఏర్పాటు చేశారు. ఫైనల్లో శ్రీలంకపై గెలిచి భారత్ విజేతగా నిలిచింది. అనంతరం 2027 ఆసియా కప్‌నకు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తుంది.
అదే ఏడాది దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచకప్ ఉండటంతో బంగ్లాలో వన్డే ఫార్మాట్‌లో ఆసియాకప్ జరుగనుంది. ఈ రెండు టోర్నీల్లోనూ భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లతో పాటు టెస్టు హోదా దక్కని ఒక ఆసియా జట్టు పాల్గొంటుందని ఆసియా క్రికెట్ మండలి తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment