పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కీలక ప్రకటన.. ఇకపై | PCB Confirms 3 New Tournaments To Elevate Domestic Cricket | Sakshi
Sakshi News home page

PCB: పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కీలక ప్రకటన.. ఇకపై కొత్తగా..

Published Mon, Aug 5 2024 5:11 PM | Last Updated on Mon, Aug 5 2024 5:20 PM

PCB Confirms 3 New Tournaments To Elevate Domestic Cricket

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) కొత్తగా మూడు టోర్నమెంట్లు ప్రవేశపెట్టింది. దేశవాళీ క్రికెట్‌ 2024- 2025లో భాగంగా చాంపియన్స్‌ వన్డే కప్‌, చాంపియన్స్‌ టీ20 కప్‌, చాంపియన్స్‌ ఫస్ట్‌క్లాస్‌ కప్‌ టోర్నీ నిర్వహిస్తామని తెలిపింది. ప్రస్తుతం పురుషుల క్రికెట్‌లో మాత్రమే ఈ మూడు టోర్నమెంట్లు ప్రవేశపెడుతున్నట్లు స్పష్టం చేసింది.

కాగా పాకిస్తాన్‌లో ఇప్పటికే నేషనల్‌ టీ20 కప్‌, ఖైద్‌- ఈ - ఆజం ట్రోఫీ, ప్రెసిడెంట్స్‌ ట్రోఫీ, ప్రెసిడెంట్స్‌ కప్‌, హెచ్‌బీఎల్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ వంటి డొమెస్టిక్‌ క్రికెట్‌ టోర్నీలు ఉన్నాయి. వీటికి అదనంగా పై మూడు టోర్నమెంట్లను పీసీబీ ప్రవేశపెట్టింది.

ఈ విషయం గురించి పీసీబీ చైర్మన్‌ మొహ్సిన్‌ నఖ్వీ మాట్లాడుతూ.. ‘‘దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌కు మధ్య చాంపియన్స్‌ టోర్నమెంట్లు వారధిగా నిలవడమే కాకుండా.. క్రికెటింగ్‌ ఎకోసిస్టమ్‌ను పునరుత్తేజితం చేసే విధంగా ఉంటాయి. ప్రతిభ ఆటగాళ్లను గుర్తించి.. వారి నైపుణ్యాలకు పదునుపెట్టి.. గ్లోబల్‌ వేదికపై రాణించేలా వారిని తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం’’ అని తెలిపాడు. చాంపియన్స్‌ టోర్నీల్లో డాల్ఫిన్స్‌, లయన్స్‌, పాంథర్స్‌, స్టాలియాన్స్‌, వోల్వ్స్‌ పేర్లతో ఐదు జట్లు ఉంటాయని పేర్కొన్నాడు.

గత మూడేళ్లుగా ఆకట్టుకుంటున్న 150 మంది టాప్‌ డొమెస్టిక్‌ క్రికెటర్లతో పాటు సెంట్రల్‌ కాంట్రాక్టు ప్లేయర్లు కూడా ఇందులో పాల్గొంటారని మొహ్సిన్‌ నఖ్వీ వెల్లడించాడు. ప్రతి జట్టుకు పాకిస్తానీ మాజీ సూపర్‌స్టార్‌ మెంటార్‌గా ఉంటాడని వెల్లడించాడు. విశేష అనుభవం ఉన్న వారిని మాత్రమే కోచ్‌లుగా నియమించుకుంటామని స్పష్టం చేశాడు.

కాగా గత కొన్నాళ్లుగా పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు చేదు అనుభవాలు ఎదుర్కొంటోంది. ద్వైపాక్షిక సిరీస్‌లలో వైట్‌వాష్‌కు గురవడంతో పాటు.. వన్డే వరల్డ్‌ప్‌-2023, టీ20 ప్రపంచకప్‌-2024లో కనీసం నాకౌట్‌ దశకు చేరకుండానే నిష్క్రమించింది. ఇక పీసీబీ చైర్మన్‌ నియామకం, హెడ్‌కోచ్‌ల విషయంలోనూ హైడ్రామా జరిగింది. అదే విధంగా.. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌లేమి, క్రమశిక్షణా రాహిత్యం మీద కూడా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పీసీబీ దేశవాళీ క్రికెట్‌ స్థాయి నుంచి ప్రక్షాళన చర్యలు చేపట్టింది.

ఈ నేపథ్యంలో పీసీబీ దేశవాళీ క్రికెట్‌ స్థాయి నుంచి ప్రక్షాళన చర్యలు చేపట్టింది. కాగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి సైతం ఇటీవల.. కఠిన నిబంధనలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

ప్రధాన ఆటగాళ్లు మినహా మిగతావాళ్లెవరైనా ఏదేని కారణం చేత జాతీయ జట్టుకు దూరమైతే.. దేశవాళీ క్రికెట్‌లో ఆడిన తర్వాతే టీమిండియాలో ఆడే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ధిక్కరించిన ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లపై వేటు వేస్తూ.. సెంట్రల్‌ కాంట్రాక్టు నుంచి తప్పించింది. అయితే, శ్రేయస్‌ అయ్యర్‌ దేశవాళీ క్రికెట్‌లో తనను తాను నిరూపించుకుని శ్రీలంకతో వన్డే సిరీస్‌ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు. ఇక పీసీబీ సైతం తాజా చర్యతో బీసీసీఐ బాటలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement