భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రవేశపెట్టిన ‘పటిష్ట జట్టుకు పది సూత్రాల’ అంశంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. జట్టు ప్రయోజనాల కోసమే నిబంధనలు కఠినతరం చేశామే తప్ప.. ఇవేమీ స్కూలు పిల్లలకు ఇచ్చే పనిష్మెంట్లు కావని పేర్కొన్నాడు. జట్టులోని ప్రతి సభ్యుడు పరిణతి గలిగిన వ్యక్తులేనని.. సూపర్ స్టార్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారన్నాడు.
అయితే, జాతీయ జట్టుకు ఆడుతున్నపుడు ప్రతి ఒక్కరు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని అగార్కర్ స్పష్టం చేశాడు. ప్రతి టీమ్‌లోనూ రూల్స్ ఉంటాయని.. జట్టు అభివృద్ధి, ప్రయోజనాలు మాత్రమే తమ అంతిమ లక్ష్యమని పేర్కొన్నాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లు రోజురోజుకు మరింత మెరుగుపడటానికి మాత్రమే నిబంధనలు విధించినట్లు తెలిపాడు.
బీసీసీఐ ప్రవేశపెట్టిన పది సూత్రాల పాలసీ
దేశవాళీ మ్యాచ్‌లు ఆడాల్సిందే
‘స్టార్ హోదాతో దేశవాళీ క్రికెట్‌ను అటకెక్కించిన ఆటగాళ్లు ఇకపై బరిలోకి దిగాల్సిందే. టీమిండియాకు ఎంపిక కావాలంటే రంజీ మ్యాచ్‌లు, ఇతర దేశవాళీ టోర్నీలలో ఆటగాళ్లంతా వారి వారి రాష్ట్ర జట్లకు అందుబాటులో ఉండాలి. సహేతుక కారణం ఉంటే తప్ప... తప్పుకోవడానికి యువ ఆటగాళ్లకే కాదు సీనియర్లకు ఇకపై వీలుండదు’
బ్రాండ్–ఎండార్స్‌మెంట్లు కుదరవు
టోర్నీలు, సిరీస్‌లు జరుగుతుంటే ఇకపై ‘బ్రాండింగ్’ షూటింగ్‌ల్లో పాల్గొనడం కుదరదు. ఆటగాళ్లు కుదుర్చుకున్న ఎండార్స్‌మెంట్ ఒప్పందాల కోసం సిరీస్ మధ్యలో ఫొటో షూట్స్ నిషిద్ధం.
కుటుంబసభ్యుల అనుమతికి ఓ పరిమితి
విదేశీ పర్యటనలకు వెళ్లినపుడు ఆ ద్వైపాక్షిక సిరీస్ 45 రోజులకు మించి సుదీర్ఘంగా సాగితే క్రికెటర్ల కుటుంబసభ్యులు కూడా అసాంతం ఉంటామంటే ఉండనివ్వరు. 45 రోజులు ఆ పైన పర్యటనల కోసం ఇకపై రెండు వారాలపాటే కుటుంబసభ్యుల్ని అనుమతిస్తారు. స్వల్పకాల పర్యటనలకు మాత్రం వారం పరిమితే ఉంటుందిక!
జట్టుతో పాటే పయనం
ఇప్పటి వరకు ఆటగాళ్లు విడతల వారీగా, పర్యటన షెడ్యూల్‌కు ఉన్న సమయానికి అనుకూలంగా ఆటగాళ్లు ఆయా దేశాలకు వేర్వేరుగా పయనమయ్యేవారు. కానీ ఇక మీదట ఓ జట్టుగా సహచరులతో పాటే ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
తద్వారా జట్టులో అను‘బంధం’ బలపడేందుకు దోహదం చేస్తుంది. అనివార్య కారణాలు లేదంటే తప్పనిసరై ఫ్యామిలీతో ప్రయాణించాలంటే మాత్రం బోర్డు నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి!
వ్యక్తిగత సిబ్బందికి కట్టుబాట్లు
జట్టులో ఎంత సీనియరైనా, దిగ్గజమైనా తమ వెంట వ్యక్తిగత సిబ్బందిని తీసుకెళ్తామంటే అనుమతించరు. సదరు సిబ్బంది అవసరమనుకుంటే ఆ ఆటగాడు కచి్చతంగా బోర్డు ఆమోదం పొందాల్సి ఉంటుంది.
‘అదనపు’ లగేజీ భారం ప్లేయర్లపైనే...
విమాన ప్రయాణానికి సంబంధించి ఇప్పటి వరకు ఆటగాళ్ల లగేజీపై ఎలాంటి ఆంక్షలు, పరిమితుల్లేవు. ఎన్ని కేజీలు తీసుకెళ్లినా ఆ భారాన్ని బోర్డే భరించేది. కానీ ఇకపై ఒక ఆటగాడు 150 కేజీలకు మించి లగేజీ తీసుకెళితే ఆ భారం ఆటగాళ్లే మోయాలి.
కలసికట్టుగా ప్రాక్టీస్
సన్నాహాలకు ఆటగాళ్లంతా సమయానికి అందుబాటులో ఉండాలి. నెట్స్‌లో శ్రమించేందుకు వెళ్లే సమయంలో తమకు వీలుచిక్కిన సమయంలో స్టేడియానికి చేరకుండా... అంతా కలిసి ఒకే బస్సులో ప్రాక్టీసుకు బయలు దేరాలి.
బోర్డు కార్యక్రమాలకు హాజరు
బీసీసీఐ నిర్వహించే సమావేశాలు, ఈవెంట్లు, కార్యక్రమాలకు భారత ఆటగాళ్లంతా అందు
బాటులో ఉండాలి. ఇది క్రికెట్ వృద్ధికి మరింత దోహదం చేస్తుందని బోర్డు భావిస్తోంది.
మ్యాచ్‌లు ముగిశాక...
ఏదైనా పర్యటన, సిరీస్, టోర్నీల్లో మ్యాచ్ ముగిసిన అనంతరం ఇష్టారీతిన ఎవరికివారు హోటల్ గదులకు వెళతామంటే కుదరదు. అందరు కలిసి జట్టుగా వెళ్లాలి. జట్టుతో పాటే పయనించాలి.
గదుల్లోనూ కలిసిమెలిసే బస
స్టార్ ఆటగాళ్లకు విడిగా ప్రత్యేక గదులిస్తున్నారు. ఇకపై రెండు వారాలు, ఒక వారం కుటుంబసభ్యుల పరిమితికి లోబడి మాత్రమే ప్రత్యేక గదుల్ని కేటాయిస్తారు. మిగతా సమయంలో సహచర ఆటగాళ్లతో గదుల్ని పంచుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment