టీమిండియాలో చోటు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న వారిలో పృథ్వీ షా ఒకరు. 23 ఏళ్ల ఈ ముంబై ఓపెనర్ చాలా రోజులుగా భారత జట్టులో చోటు దక్కక నిరాశగా ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు సెలెక్టర్లు ఇతన్ని ఎంపిక చేసినా.. తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. తదనంతరం జరిగిన ఐపీఎల్-2023లో ఘోర వైఫల్యం చెందడం, అదే సమయంలో అతని సమకాలీకులు ఓపెనర్లుగా రాణించడంతో షా టీమిండియాకు ఆడే ఆశలను దాదాపుగా వదులుకున్నాడు.
ఈ క్రమంలో తాజాగా అతనికి తొలిసారి కౌంటీ క్రికెట్ ఆడే అవకాశం దొరికింది. నాటింగ్‌హమ్‌షైర్.. షాతో ఒప్పందం చేసుకున్నట్లు ఓ ప్రముఖ దినపత్రిక జర్నలిస్ట్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. దులీప్ ట్రోఫీ 2023 ముగిసాక షా నాలుగు రోజుల కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లు ఆడతాడని, తదనంతరం రాయల్ లండన్ వన్డే కప్ (50 ఓవర్ల టోర్నీ) ఆడతాడని తెలుస్తుంది.
దీనికి ముందు షా.. దులీప్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ జోన్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో వెస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఒకవేళ సెమీస్‌లో సెంట్రల్ జోన్ గెలిస్తే జులై 12-16 మధ్యలో జరిగే ఫైనల్లో కూడా ఆడతాడు. 2021లో చివరిసారిగా టీమిండియాకు ఆడిన షా.. ఆతర్వాత ఫామ్ లేమి, వివాదాలు, సరైన అవకాశాలు రాక ఖాళీగా ఉన్నాడు. పృథ్వీ షా తన కెరీర్‌లో 5 టెస్ట్‌లు, 6 వన్డేలు, ఓ టీ20 ఆడాడు. వన్డేల్లో, టీ20ల్లో పెద్దగా రాణించని షా.. టెస్ట్‌ల్లో పర్వాలేదనిపించాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు చేశాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించే షా.. గడిచిన సీజన్‌లో 8 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క హాఫ్ సెంచరీ సాయంతో 106 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment