2021-23 డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా టెస్ట్ బ్యాటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ దేశవాలీ వన్డే కప్‌లో సెంచరీతో కదం తొక్కాడు. టోర్నీలో భాగంగా నార్తంప్టన్‌షైర్‌తో నిన్న (ఆగస్ట్ 6) జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకంతో (119 బంతుల్లో 106 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిశాడు. టీమిండియాలో చోటు కోల్పోయాక కసితో రగిలిపోతున్న పుజారా.. తన తాజా ఇన్నింగ్స్‌తో భారత సెలెక్టర్లకు సవాలు విసిరాడు. ఈ మ్యాచ్‌లో పుజారా ఇన్నింగ్స్ సాగిన తీరు పై పేర్కొన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. పుజారా సెంచరీతో చెలరేగినా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ససెక్స్ ఓటమిపాలవ్వడం కొసమెరుపు.
Great to have you back, @cheteshwar1! 🙌
— Sussex Cricket (@SussexCCC) August 6, 2023
Century 💯 pic.twitter.com/k7SfSu59si
వర్షం కారణంగా 45 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్.. పుజారా శతకొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో పుజారా మినహా ఎవరూ రాణించలేదు. కెప్టెన్ టామ్ హెయిన్స్ (13), జేమ్స్ కోల్స్ (29), హడ్సన్ (14), ఒలివర్ కార్టర్ (21), జాక్ కార్సన్ (17), హెన్రీ క్రొకోంబ్ (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. నార్తంప్టన్‌షైర్ బౌలర్లలో జాక్ వైట్ 3, ప్రాక్టర్, కియోగ్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తేలిపోయిన పృధ్వీ షా..
గ్లోసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌తో ఇంగ్లండ్ దేశవాలీ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భారత యువ ఓపెనర్ పృథ్వీ షా.. ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. గ్లోసెస్టర్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లో 34 పరుగులు చేసి విచిత్ర రీతిలో ఔటైన (హిట్ వికెట్) షా.. తాజాగా ససెక్స్‌తో జరిగిన తన రెండో మ్యాచ్‌లోనూ తక్కువ స్కోర్‌కే (17 బంతుల్లో 26; 4 ఫోర్లు) పరిమితమయ్యాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌ల్లో షాకు మంచి ఆరంభమే లభించినా, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. షా భారీ స్కోర్ చేయకపోయినా, మిగతా వారు రాణించడంతో అతని జట్టు విజయం సాధించింది.
ససెక్స్‌తో మ్యాచ్‌లో 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్తంప్టన్‌షైర్.. మరో 8 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నార్తంప్టన్‌షైర్ ఆటగాళ్లు తలో చేయి వేసి తమ జట్టును గెలిపించుకున్నారు. షాతో పాటు రికార్డో (37), సామ్ వైట్‌మ్యాన్ (30), రాబ్ కియోగ్ (22), లూక్ ప్రాక్టర్ (10), లెవిస్ మెక్‌మానస్ (36) రెండంకెల స్కోర్లు చేయగా.. టామ్ టేలర్ (42 నాటౌట్), జస్టిన్ బ్రాడ్ (22 నాటౌట్) నార్తంప్టన్‌షైర్‌ను విజయతీరాలకు చేర్చారు. ససెక్స్ బౌలర్లలో కర్రీ, కార్సన్ చెరో 2 వికెట్లు, క్రొకోంబ్, హడ్సన్, జేమ్స్ కోల్స్ తలో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment