రోహిత్‌ శర్మతో కలిసి పనిచేయడం నా అదృష్టం: ద్రవిడ్‌ | Rahul Dravids Big Praise For India Skipper Rohit sharma | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మతో కలిసి పనిచేయడం నా అదృష్టం: ద్రవిడ్‌

Published Wed, Aug 14 2024 8:59 AM | Last Updated on Wed, Aug 14 2024 10:01 AM

Rahul Dravids Big Praise For India Skipper Rohit sharma

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ‌పై మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్‌తో కలిసి పనిచేయడం గొప్ప గౌరవమని ద్రవిడ్ కొనియాడాడు. కాగా  ద్రవిడ్- రోహిత్ శర్మ ఆధ్వర్యంలోనే టీ20 వరల్డ్‌కప్‌-2024ను భారత జట్టు  సొంతం చేసుకుంది.

గత 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్‌కప్ ట్రోఫీని వీరిద్దరి కలిసి టీమిండియాకు అందించారు. అంతేకాకుండా వీరిద్దరి కాంబనేషన్‌లో భారత జట్టు ఎన్నో అద్భుతాలు విజయాలు సాధించింది. టీ20 వరల్డ్‌కప్ విజయంతో భారత హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ ప్రస్ధానం ముగిసింది.

 భారత హెడ్‌కోచ్‌గా తప్పుకున్న అనంతరం ద్రవిడ్ వరుస ఇంటర్వ్యూలతో బీజీబీజీగా ఉన్నాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ద్రవిడ్ మాట్లాడుతూ.. "రోహిత్ శర్మతో కలిసి పనిచేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. రోహిత్ ఒక అద్భుతమైన కెప్టెన్‌. అతడు తన కెప్టెన్సీతో టీమిండియాను అభిమానులకు మరింత చేరువ చేశాడు. అంతేకాకుండా కెప్టెన్సీ స్కిల్స్‌తో అందరని ఆకట్టుకున్నాడు.

 జట్టులో అందరని ఒకేలా చూస్తాడు. డ్రెస్సింగ్ రూమ్ వాతవారణం ప్రశాంతంగా ఉందంటే అందుకు కారణం రోహిత్ శర్మనే. భారత జట్టులో విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, అశ్విన్‌ లాంటి చాలా మంది సీనియర్ క్రికెటర్లు ఉన్నారు. వారందరూ సూపర్ స్టార్లు. కానీ వీరిందరూ ఎటువంటి ఈగోలు లేకుండా కెప్టెన్ అడుగుజాడల్లానే నడుస్తున్నారు. రోహిత్‌తో పాటు ఈ సీనియర్ ఆటగాళ్ల గ్రూప్ జట్టును ముందుకు నడిపిస్తుందని నేను భావిస్తున్నాను. 

అదేవిధంగా  స్టార్ ప్లేయర్స్‌కు ఇగో ఎక్కువగా ఉంటుందనుకుంటారు. వారితో కలసి పని చేయడం కష్టమని చాలా భావిస్తారు. కానీ భారత జట్టులో పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. వాళ్లు ఎంత గొప్ప క్రికెటర్లైనా చాలా వినయంగా ఉంటారని" పేర్కొన్నాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement