ఆర్సీబీ, ముంబై మ్యాచ్ ఫిక్స్‌.. ఇదిగో సాక్ష్యం! | Raj Bawa Actions Last Over-Fans Troll RCB vs MI Match Completely Fixed | Sakshi
Sakshi News home page

IPL 2026: ఆర్సీబీ, ముంబై మ్యాచ్ ఫిక్స్‌.. ఇదిగో సాక్ష్యం!

May 11 2026 9:16 PM | Updated on May 11 2026 9:53 PM

Raj Bawa Actions Last Over-Fans Troll RCB vs MI Match Completely Fixed

ఐపీఎల్ 2026 సీజన్ చప్పగా సాగుతున్న వేళ ముంబై ఇండియన్స్‌, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు ఫుల్‌కిక్ ఇచ్చింది. ఆఖరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఛేదించాల్సిన లక్ష్యం తక్కువే అయినప్పటికీ ఆద్యంతం ఆర్సీబీ,  ముంబై మధ్య విజయం చేతులు మారుతూ వచ్చింది. 

చివరకు ముంబై తప్పిదాలు, పేలవ ఫీల్డింగ్‌తో ఓటమిని కొనితెచ్చుకుంది. అయితే తాజాగా సోషల్ మీడియా ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ముంబై ఇండియన్స్‌, ఆర్సీబీ మధ్య మ్యాచ్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే.. ఆర్సీబీ విజయానికి ఆఖరి ఓవర్‌లో 15 పరుగుల కావాలి. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసేందుకు రాజ్ బవా వచ్చాడు. ఓవర్‌లో మూడు వైడ్లు, ఒక నోబ్ వేశాడు. 

ఇది చాలదన్నట్లు భువనేశ్వర్ చేత సిక్సర్ కొట్టించాడు. ఇక ఆఖరి బంతికి రెండు పరుగుల అవసరమైన దశలో ఆర్సీబీ బ్యాటర్ రసిక్ సలామ్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. అయితే రాజ్ బవా తన వైపు వచ్చిన బంతిని కనీసం ఆపే ప్రయత్నం చేయకుండా అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక అభిమాని ఎక్స్‌లో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. 

బంతి అతని కాలు తాకి మరో దిశలో వెళ్లింది. ఈ గ్యాప్‌లో ఆర్సీబీ రెండు పరుగులు తీసి విజయం సాధించింది. అయితే రాజ్ బవా బంతిని ఆపే ప్రయత్నం చేసి ఉంటే ముంబై గెలవడం లేదా సూపర్ ఓవర్‌కు దారి తీసి ఉండేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ‘రాజ్ బవా బంతిని కావాలనే ఆపలేదని, కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ’ కొంతమంది ఫ్యాన్స్ తెలిపారు. 

‘అప్పటికే ఆ ఓవర్‌లో తొమ్మిది బంతులు వేసి రాజ్ బవా అలసిపోయాడని, అందుకే బంతిని ఆపే ప్రయత్నం చేయలేకపోయి ఉండొచ్చని, మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి వాటికి ఆస్కారం ఉండదని’ కొంతమంది కామెంట్లు చేశారు. ఇంకొందరు మాత్రం.. ‘ముంబై ఐదుసార్లు టైటిల్ గెలవడంతోనే ఆ జట్టు పూర్తిగా నీరుగారిపోయిందని.. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, ఆర్సీబీతో ముంబై జట్టును కూడా ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని’ కొందరు ఆగ్రహంతో రెచ్చిపోయారు. 

ఏది ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి అటుంచితే చాన్నాళ్లుకు ఐపీఎల్‌లో ఒక థ్రిల్లర్ మ్యాచ్ మంచి అనుభూతి కలిగించిందని చెప్పొచ్చు. ఈ విజయంతో  ఆర్సీబీ పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. ఓటమితో ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ 2026 సీజన్‌ నుంచి ఎలిమినేట్‌ అయింది.

చదవండి: టిమ్ డేవిడ్ అనైతిక చ‌ర్య‌.. త‌గిన శాస్తి జ‌రిగింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement