IPL 2023, RR Vs KKR Highlights: Rajasthan Royals Beat Kolkata Knight Riders By 9 Runs - Sakshi
Sakshi News home page

IPL 2023: జైస్వాల్‌ ఊచకోత.. కేకేఆర్‌పై రాజస్తాన్‌ ఘన విజయం

Published Fri, May 12 2023 3:19 AM | Last Updated on Fri, May 12 2023 8:25 AM

Rajasthan Royals crush Kolkata Knight Riders by 9 wickets - Sakshi

తొలి ఓవర్లో 6, 6, 4, 4, 2, 4... ఇలా దూకుడు మొదలు పెట్టిన యశస్వి జైస్వాల్‌ ఆగలేదు... తొలి 6 బంతుల్లో 26 పరుగులు రాబట్టిన అతను తర్వాతి 7 బంతుల్లో మరో 24 పరుగులు కొట్టేశాడు. అంతే...13 బంతుల్లో ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీతో కొత్త రికార్డు    సృష్టించాడు. 3 ఓవర్లలోపే యశస్వి హాఫ్‌ సెంచరీ అయిపోయింది. మరో 3 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 78 పరుగులు. అక్కడే మ్యాచ్‌లో ఎవరు గెలవబోతున్నారో అర్థమైపోయింది!

ఇక మిగిలింది యశస్వి ఎంత దూరం, ఎలా వెళతాడనేది... సెంచరీ వరకు చేరగలిగాడు కానీ రెండు పరుగుల తేడాతో శతకం చేజారింది. అయితేనేం ఐపీఎల్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటి ఆడిన జైస్వాల్‌ రాజస్తాన్‌ జట్టును గెలిపించాడు... మరో ఎండ్‌లో కెప్టె న్‌ సామ్సన్‌ మెరుపు బ్యాటింగ్‌తో పని సులువైంది. రాజస్తాన్‌ 41 బంతులు మిగిలి ఉండగానే నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది.   

కోల్‌కతా: ఈడెన్‌ గార్డెన్స్‌లో రాజస్తాన్‌ పండగ చేసుకుంది. నైట్‌రైడర్స్‌ బ్యాటింగ్‌ చేసినంత సేపూ నెమ్మదిగా అనిపించిన పిచ్‌పైనే పరుగులు వరద పారించి కీలక విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన పోరులో రాజస్తాన్‌ 9 వికెట్ల తేడాతో కోల్‌కతాపై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.

వెంకటేశ్‌ అయ్యర్‌ (42 బంతుల్లో 57; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. యజువేంద్ర చహల్‌ 25 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి కోల్‌కతాను కట్టడి చేశాడు. అనంతరం రాజస్తాన్‌ 13.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 151 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ యశస్వి జైస్వాల్‌ (47 బంతుల్లో 98 నాటౌట్‌; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు), సంజూ సామ్సన్‌ (29 బంతుల్లో 48 నాటౌట్‌; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగి జట్టును లక్ష్యానికి చేర్చారు.   

వెంకటేశ్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ను మినహాయిస్తే కోల్‌కతా ఇన్నింగ్స్‌ ఆసాంతం పేలవంగా సాగింది. వెంకటేశ్‌ కూడా మరీ విధ్వంసకరంగా ఆడకపోయినా... పరిస్థితిని బట్టి తనవంతు పాత్ర పోషించాడు. వెంకటేశ్‌ 42 బంతుల్లో 57 పరుగులు చేయగా ... ఇతర ఆటగాళ్లంతా కలిసి 78 బంతుల్లో 89 పరుగులు చేయగలి గారంటే అతని ఇన్నింగ్స్‌ విలువ తెలుస్తుంది.  

ధనాధన్‌... 
ఆశ్చర్యకరంగా పార్ట్‌టైమ్‌ బౌలర్, కోల్‌కతా కెప్టె న్‌ నితీశ్‌ రాణా మొదటి ఓవర్‌ వేశాడు. ఆ ఓవర్లో ఏకంగా 26 పరుగులు రాబట్టి ప్రత్యర్థిని యశస్వి కఠినంగా శిక్షించాడు. సమన్వయ లోపంతో జోస్‌ బట్లర్‌ (0) రనౌట్‌ కావడంతో రాయల్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అయితే జట్టుపై అది ఎలాంటి ప్రభావం చూపించలేదు.

యశస్వి, సామ్సన్‌ కలిసి వేగం తగ్గకుండా ఇన్నింగ్స్‌ను నడిపించారు. వీరి షాట్లకు నైట్‌రైడర్స్‌ బౌలర్ల వద్ద సమాధానం లేకపోయింది. సామ్సన్‌ 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చి న క్యాచ్‌ను నేలపాలైంది. అనంతరం అనుకూల్‌ వేసిన ఓవర్లో 3 సిక్సర్లతో సామ్సన్‌ చెలరేగాడు. చివర్లో యశస్వి సెంచరీ విషయంలో కాస్త ఉత్కంఠ నెలకొంది.

యశస్వి 94 పరుగుల వద్ద ఉండగా రాయల్స్‌కు 3 పరుగులు కావాలి. 13వ ఓవర్‌ చివరి బంతికి పరుగు తీయని సామ్సన్‌ సిక్సర్‌ కొట్టమన్నట్లుగా సైగ చేస్తూ యశస్వికి అవ కాశం ఇచ్చాడు. అయితే తర్వాతి బంతికి ఫోర్‌ మాత్రమే రావడంతో యశస్వి 98 పరుగుల వద్ద ఆగిపోవాల్సి వచ్చి ంది. అయితే దానిని పట్టించుకోకుండా అతను విజయానందాన్ని ప్రదర్శించాడు. 

ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన క్రికెటర్‌గా యశస్వి (13 బంతుల్లో) నిలిచాడు. గతంలో ఈ రికార్డు కేఎల్‌ రాహుల్, కమిన్స్‌ (14 బంతుల్లో) పేరిట ఉంది. 

187  ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చహల్‌ రికార్డు నెలకొల్పాడు.   డ్వేన్‌ బ్రేవో (161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును చహల్‌ (143 బంతుల్లో 187 వికెట్లు) సవరించాడు.   

స్కోరు వివరాలు  
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: జేసన్‌ రాయ్‌ (సి) హెట్‌మైర్‌ (బి) బౌల్ట్‌ 10; గుర్బాజ్‌ (సి) సందీప్‌ శర్మ (బి) బౌల్ట్‌ 18; వెంకటేశ్‌ (సి) బౌల్ట్‌ (బి) చహల్‌ 57; నితీశ్‌ రాణా (సి) హెట్‌మైర్‌ (బి) చహల్‌ 22; రసెల్‌ (సి) అశ్విన్‌ (బి) ఆసిఫ్‌ 10; రింకూ సింగ్‌ (సి) రూట్‌ (బి) చహల్‌ 16; శార్దుల్‌ (ఎల్బీ) (బి) చహల్‌ 1; అనుకూల్‌ (నాటౌట్‌) 6; నరైన్‌ (సి) రూట్‌ (బి) సందీప్‌ 6; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 149. వికెట్ల 
పతనం: 1–14, 2–29, 3–77, 4–107, 5–127, 6–129, 7–140, 8–149. బౌలింగ్‌: బౌల్ట్‌ 3–0–15–2, సందీప్‌ శర్మ 4–0–34–1, అశ్విన్‌ 4–0–32–0, రూట్‌ 2–0–14–0, యజువేంద్ర చహల్‌ 4–0–25–4, ఆసిఫ్‌ 3–0–27–1.  

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (నాటౌట్‌) 98; బట్లర్‌ (రనౌట్‌) 0; సామ్సన్‌ (నాటౌట్‌) 48; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (13.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 151. వికెట్ల పతనం: 1–30. బౌలింగ్‌: నితీశ్‌ రాణా 1–0–26–0, హర్షిత్‌ రాణా 2–0–22–0, శార్దుల్‌ ఠాకూర్‌ 1.1–0–18–0, వరుణ్‌ చక్రవర్తి 3–0–28–0, సునీల్‌ నరైన్‌ 2–0–13–0, సుయశ్‌ 3–0–22–0, అనుకూల్‌ 1–0–20–0.  

ఐపీఎల్‌లో నేడు 
ముంబై  ్ఠ vs గుజరాత్‌  (రాత్రి గం. 7:30 నుంచి)  
స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement