జైపూర్: అప్పుడు చెన్నైలో... ఇప్పుడు సొంత ఇలాకాలో రాజస్తాన్ రాయల్స్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. గురువారం జరిగిన ఐపీఎల్ పోరులో రాయల్స్ 32 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై జయభేరి మోగించింది. మొదట రాజస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశస్వి జైస్వాల్ (43 బంతుల్లో 77; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించగా, తుషార్ దేశ్‌పాండే 2 వికెట్లు తీశాడు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులే చేసింది. శివమ్ దూబే (33 బంతుల్లో 52; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), రుతురాజ్(29 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడు కనబరిచారు. స్పిన్నర్ ఆడమ్ జంపా (3/22), అశ్విన్ (2/35) తిప్పేశారు.
విరుచుకుపడిన యశస్వి
రాజస్తాన్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి బంతి నుంచే దూకుడుగా నడిపించాడు. ఆకాశ్ సింగ్ మొదటి ఓవర్లో మూడు బౌండరీలు బాదిన అతను మళ్లీ మూడో ఓవర్ వేసేందుకు వస్తే 4, 0, 6, 0, 4, 4లతో 18 పరుగులు పిండుకున్నాడు. బట్లర్ కూడా ఫోర్లు బాదడంతో పవర్ ప్లేలో రాయల్స్ 64/0 స్కోరు చేసింది. ఏడో ఓవర్లోనే జైస్వాల్ ఫిఫ్టీ (26 బంతుల్లో) పూర్తయ్యింది.
కాసేపటికి బట్లర్ (21 బంతుల్లో 27; 4 ఫోర్లు) అవుటైనా... సంజూ సామ్సన్ (17)తో కలిసి యశస్వి తన జోరుకొనసాగించాడు. అయితే 14వ ఓవర్లో తుషార్ వీరిద్దరిని అవుట్ చేయగా, హిట్టర్ హెట్‌మైర్ (8) విఫలమయ్యాడు. ఈ దశలో స్కోరు వేగం మందగించగా... మళ్లీ డెత్ ఓవర్లలో ధ్రువ్ జురెల్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పడిక్కల్ (13 బంతుల్లో 27 నాటౌట్; 5 ఫోర్లు) దంచేయడంతో స్కోరు 200 దాటింది.
చెన్నై చతికిల...
కొండంత లక్ష్యం ఛేదించాల్సిన జట్టుకు మెరుగైన ఆరంభం కావాలి. కానీ రుతురాజ్‌కు తోడుగా దిగిన ఓపెనర్ కాన్వే (8), టాపార్డర్‌లో వచ్చి న రహానే (15) విఫలమయ్యారు. 11వ ఓవర్లోనే 73 పరుగుల వద్ద అంబటి రాయుడు (0) రూపంలో నాలుగో వికెట్ పడిపోవడంతోనే చెన్నై చతికిలపడింది.
ఆరంభంలో ఓపెనర్ రుతురాజ్ తన ధాటిని కొనసాగించాడు. ఆ తర్వాత వచ్చి న వారిలో ఒక్క దూబే తప్ప ఇంకెవరూ అలా ఆడలేకపోయారు. అయితే వీళ్లిద్దరి మెరుపులు అంతపెద్ద లక్ష్యానికి ఏ మాత్రం సరిపోలేదు. మొయిన్ అలీ (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రవీంద్ర జడేజా (15 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు) మోస్తరు స్కోరే చేశారు.
స్కోరు వివరాలు
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) రహానే (బి) తుషార్ 77; బట్లర్ (సి) దూబే (బి) జడేజా 27; సామ్సన్ (సి) రుతురాజ్ (బి) తుషార్ 17; హెట్‌మైర్ (బి) తీక్షణ 8; ధ్రువ్ (రనౌట్) 34; పడిక్కల్ (నాటౌట్) 27; అశ్విన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 202. వికెట్ల పతనం: 1–86, 2–125, 3–132, 4–146, 5–194. బౌలింగ్: ఆకాశ్ 2–0–32–0, తుషార్ 4–0–42–2, తీక్షణ 4–0–24–1, జడేజా 4–0–32–1, మొయిన్ అలీ 2–0–17–0, పతిరణ 4–0–48–0.
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) పడిక్కల్ (బి) జంపా 47; కాన్వే (సి) సందీప్ (బి) జంపా 8; రహానే (సి) బట్లర్ (బి) అశ్విన్ 15; దూబే (సి) బట్లర్ (బి) కుల్దీప్ 52; రాయుడు (సి) హోల్డర్ (బి) అశ్విన్ 0; మొయిన్ అలీ (సి) సామ్సన్ (బి) జంపా 23; జడేజా (నాటౌట్) 23; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–42, 2–69, 3–73, 4–73, 5–124, 6–170. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–24–0, కుల్దీప్ యాదవ్ 3–0–18–1, హోల్డర్ 4–0–49–0, అశ్విన్ 4–0–35–2, ఆడమ్ జంపా 3–0–22–3, చహల్ 2–0–21–0.
ఐపీఎల్‌లో నేడు
పంజాబ్ VS లక్నో (రాత్రి గం. 7:30 నుంచి)
స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment